MG Windsor Price, Range And Features Telugu: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన MG Windsor EV మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించింది. 15,000 కి.మీ. లాంగ్ టర్మ్ వినియోగం తర్వాత కూడా ఈ కారు రోజువారీ అవసరాలకు ఎంత అనువుగా ఉందో తాజా రివ్యూ వెల్లడించింది. విశాలమైన క్యాబిన్‌, సులభమైన డ్రైవింగ్ అనుభవం, మంచి పనితీరు & ఉపయోగకరమైన రియల్ వరల్డ్ రేంజ్ కారణంగా ఈ కారు భారతీయుల ఆదరణను చూరగొంటోంది.

రన్నింగ్‌ ఎలా ఉంది?MG Windsor EVలో ప్రధాన బలం డ్రైవింగ్ అనుభవమే. ఎలక్ట్రిక్ మోటార్ శక్తిని ఎంతో సాఫీగా & అంచనా వేసే విధంగా అందించడం వల్ల నగర ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చాలా సులభంగా ఉంటుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా ఈ విభాగంలో అత్యుత్తమంగా ట్యూన్ చేసిన వాటిలో ఒకటిగా నిలిచింది. అత్యధిక రీజెన్ మోడ్‌లో కూడా బ్రేకింగ్ సహజంగా అనిపిస్తుండటం డ్రైవర్‌కు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. ఒకే పెడల్‌తో నడిపే సింగిల్ పెడల్ డ్రైవింగ్ మోడ్ ఉంటే ఇంకా బాగుండేదని రివ్యూలో పేర్కొన్నారు.

ఈ కారులోని క్యాబిన్ ఇప్పటికీ అతి పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. క్యాబ్ ఫార్వర్డ్ డిజైన్‌, పెద్ద విండోలు & విశాలమైన పరిమాణాల కారణంగా లోపల ఎంతో విశాలంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వెనుక సీట్లలో ప్రయాణించే వారికి తలకు & కాళ్లకు సమృద్ధిగా స్థలం లభిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారని రివ్యూలో పేర్కొన్నారు. అయితే ప్రీమియం లుక్ ఇచ్చే మందమైన క్విల్టెడ్ సీట్లు సన్నగా ఉండే ప్రయాణికులకు ఎక్కువసేపు ప్రయాణంలో అంతగా సౌకర్యంగా అనిపించకపోవచ్చని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రూ.13.50 లక్షల నుంచి Kia Syros EV - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు? కొనాలంటే ఏది బెస్ట్‌?

పనితీరు విషయంలో కూడా MG Windsor EV మంచి మార్కులు సాధించింది. నగర ట్రాఫిక్‌లోనే కాకుండా ముంబై నుంచి పుణే వరకు జరిగే హైవే ప్రయాణాల్లో కూడా ఈ కారు శక్తి కొరతను ఎప్పుడూ అనిపించలేదని పేర్కొన్నారు. హైవేపై అధిక వేగంతో సులభంగా ప్రయాణించడంతో పాటు ఓవర్‌టేకింగ్ సమయంలో కూడా తగిన శక్తిని అందిస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ ప్రయాణాన్ని మధ్యలో ఛార్జింగ్ అవసరం లేకుండానే పూర్తి చేసే స్థాయి రియల్ వరల్డ్ రేంజ్‌ను అందించిందని తెలిపారు.

లోపాలుఅయితే ఈ కారులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. పెద్ద గాజు భాగం కారణంగా ఎండలో పార్క్ చేసినప్పుడు క్యాబిన్ త్వరగా వేడెక్కుతుంది. దీనికి నలుపు రంగు లెదరెట్ సీట్లు కూడా కారణమవుతున్నాయి. హైవేపై అధిక వేగంలో ప్రయాణించే సమయంలో రోడ్ నాయిస్ క్యాబిన్‌లోకి ఎక్కువగా వినిపించడం వల్ల రిఫైన్‌మెంట్ కొంత తగ్గుతుంది. సాధారణంగా రైడ్ నాణ్యత సౌకర్యంగా ఉన్నప్పటికీ కాస్త పెద్ద గుంతలు & అతుకులపై ప్రయాణించే సమయంలో కొంత అసౌకర్యం అనిపిస్తుందని రివ్యూ తెలిపింది.

ఇది కూడా చదవండి: టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?

15 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ & సన్‌షేడ్ వంటి ఫీచర్ల కోసం టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించాల్సి రావడం అంత సౌకర్యంగా ఉండదని పేర్కొన్నారు. స్టీరింగ్ వీల్‌పై ఉన్న షార్ట్‌కట్స్ కొంత సహాయం చేసినప్పటికీ, వీటికి ప్రత్యేక ఫిజికల్ బటన్లు ఉంటే వినియోగం మరింత సులభంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా స్క్రీన్ పరిమాణం పెద్దగా ఉండటం వల్ల దూరంగా ఉన్న ఆప్షన్లను తాకేందుకు డ్రైవర్ కొంత ముందుకు వంగాల్సి వస్తుంది.

15,000 కి.మీ. వినియోగం తర్వాత కూడా MG Windsor EV ఒక బ్యాలెన్స్‌డ్‌ ఎలక్ట్రిక్ కారుగా నిలిచిందని ఈ లాంగ్ టర్మ్ రివ్యూ స్పష్టం చేసింది. విశాలమైన క్యాబిన్‌, సులభమైన డ్రైవింగ్‌, బలమైన పనితీరు & ఉపయోగకరమైన రేంజ్ కారణంగా భారత మార్కెట్లో ఈ కారుకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తేలింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మొత్తం మీద రోజువారీ వినియోగానికి & హైవే ప్రయాణాలకు అనువైన ఎలక్ట్రిక్ కార్లలో MG Windsor EV ఇప్పటికీ అత్యుత్తమ ఎంపికల్లో ఒకటిగా కొనసాగుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.