MG Assured Buyback Program: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, చాలామంది వినియోగదారుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది. అదే.. 'రీసేల్' విలువ. “కొన్ని ఏళ్ల తర్వాత ఈవీ అమ్మితే ఎంత వస్తుంది?” అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే లక్ష్యంగా JSW MG Motor India కీలక నిర్ణయం తీసుకుంది. తన ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటికే అమలులో ఉన్న "అస్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్"ను ఇప్పుడు 5 ఏళ్ల వరకు పెంచింది. MG Value Promise పేరుతో కొనసాగుతున్న ఈ స్కీమ్ ఇప్పటివరకు 3 ఏళ్ల వరకే ఉండేది. గరిష్టంగా 60 శాతం వరకు రీసేల్ విలువకు గ్యారంటీ ఇస్తూ వచ్చింది. తాజా అప్‌డేట్‌తో, ఇప్పుడు కస్టమర్లు 3, 4 లేదా 5 ఏళ్ల టెన్యూర్‌ను కార్ కొనుగోలు సమయంలోనే ఎంపిక చేసుకోవచ్చు.
ఈ స్కీమ్‌లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.... ఇది ఏ బ్యాంక్ లోన్ లేదా ఫైనాన్స్ ప్యాకేజీకి లింక్ అయి ఉండదు. కస్టమర్ కావాలంటే ఫైనాన్స్‌తో, లేకపోతే క్యాష్ పేమెంట్‌తోనూ ఈ బైబ్యాక్ ఆప్షన్‌ను సొంతంగా ఎంచుకోవచ్చు.
ఎంచుకున్న కాల పరిమితి పూర్తయ్యాక, వాహన యజమానికి మూడు ఆప్షన్లు ఉంటాయి. అవి:
1, వాహనాన్ని తన వద్దే ఉంచుకోవచ్చు
2. MGకి తిరిగి ఇచ్చి అస్యూర్డ్ రీసేల్ విలువ పొందవచ్చు
3. కొత్త MG మోడల్‌కు అప్‌గ్రేడ్ అవ్వచ్చు
ఈ అస్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకాల్లో ఉన్న MG Comet EV, MG Windsor EV, MG ZS EV కు వర్తిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, MG ZS EV కమర్షియల్ యూజర్లకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అయితే, కమర్షియల్ యూజర్లకు ఇది 3 ఏళ్ల వరకు లేదా 60,000 కిలోమీటర్లు (ఏది ముందైతే అది) వరకే పరిమితం.
ఈ ప్రోగ్రామ్‌ను Lockton India Insurance Broking and Advisory Ltd, Zuno General Insurance భాగస్వామ్యంతో MG మోటార్ నిర్వహిస్తోంది. దీనివల్ల ప్రాసెస్ మరింత పారదర్శకంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ధరల విషయానికి వస్తే...
MG Windsor EV ధర ₹13.99 లక్షల నుంచి ₹18.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉంటుంది. ఇది Battery-as-a-Service (BaaS) మోడల్‌లో ₹9.99 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. బ్యాటరీ వినియోగానికి కిలోమీటర్‌కు ₹3.9 చార్జ్ ఉంటుంది.
MG Comet EV ధర ₹7.49 లక్షల నుంచి ₹9.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉంటుంది. BaaS ఆప్షన్‌లో ఇది కేవలం ₹4.99 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది. బ్యాటరీ రెంటల్ కిలోమీటర్‌కు ₹3.1.
MG ZS EV ధర ₹17.99 లక్షల నుంచి ₹20.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర). BaaS వేరియంట్‌లో ఇది సుమారు ₹13 లక్షల దగ్గర మొదలవుతుంది. బ్యాటరీ రెంటల్ కిలోమీటర్‌కు ₹4.5.
మొత్తానికి, ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు ఇది నిజంగా ఒక మనశ్శాంతిని పెంచే విషయం. భవిష్యత్తులో రీసేల్ టెన్షన్ లేకుండా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి MG తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.