MG Hector Tomahawk PHEV Price, Range And Features Telugu: డీజిల్‌ కార్లకు పోటీగా మరో కొత్త కారు మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఇది సాధారణ పెట్రోల్‌ లేదా ఎలక్ట్రిక్‌ కారు కాదు. పెట్రోల్‌ ఇంజిన్‌ & ఎలక్ట్రిక్‌ మోటార్‌ రెండింటినీ ఉపయోగించే ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ కారు. అదే ఎంజీ హెక్టర్‌ తొమాహాక్ PHEV.

Continues below advertisement

ఈ కారును ‘డీజిల్‌ కిల్లర్‌’ అని పిలుస్తున్నారు. ఈ పేరు పెట్టింది మరెవరో కాదు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌ పార్థ్‌ జిందాల్‌. ఈ కారుకు ఎందుకు అంత పవర్‌ఫుల్‌ పేరు పెట్టారు? కారణం ఏంటి?.

డీజిల్‌ కార్లకు అసలైన ప్రత్యామ్నాయం?

Continues below advertisement

తొమాహాక్ PHEVను డీజిల్‌ ఎస్‌యూవీలకు ప్రత్యామ్నాయంగా ఎంజీ తీసుకొచ్చింది. ముఖ్యంగా, రోజూ నగరంలో కారు నడిపేవాళ్లు & తరచూ లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేవాళ్ల కోసం డిజైన్‌ చేసింది. సాధారణ ఎలక్ట్రిక్‌ కారులో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఛార్జింగ్‌పై ఆందోళన ఉంటుంది. డీజిల్‌ కార్లలో ఆ సమస్య ఉండదు. మంచి రేంజ్‌ ఉంటుంది. అయితే ఇంధన ఖర్చు ఎక్కువ అవుతుంది.

తొమాహాక్ PHEV ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. సిటీలో రోజువారీ ప్రయాణాలను ఎలక్ట్రిక్‌ మోడ్‌లో చేయవచ్చు. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు పెట్రోల్‌ ఇంజిన్‌ పని చేస్తుంది. దీంతో రేంజ్‌పై ఆందోళన తగ్గుతుంది.

ఎంత రేంజ్‌ వస్తుంది?

తొమాహాక్ PHEV అనేది 7-సీటర్‌ కారు. ఈ ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్‌ మోడ్‌లో 115 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. పెట్రోల్‌ ఇంజిన్‌ & ఎలక్ట్రిక్‌ పవర్‌ను కలిపి ఉపయోగిస్తే మొత్తం రేంజ్‌ 1,100 కి.మీ. కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అంటే ఇంటి వద్ద పూర్తిగా ఛార్జ్‌ చేసుకుని రోజువారీ పనులకు ఎలక్ట్రిక్‌ మోడ్‌లో వెళ్లొచ్చు. లాంగ్‌ ట్రిప్‌లో మాత్రం పెట్రోల్‌ ఇంజిన్‌తో కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: మీ బడ్జెట్‌లోనే మంచి ఆటోమేటిక్ కారు! రూ.7 లక్షల నుంచి స్టార్ట్.. బెటర్‌ మైలేజ్‌ కూడా!

డీజిల్‌ కంటే ఖర్చు తక్కువేనా?

ఇక్కడే ‘డీజిల్‌ కిల్లర్‌’ అనే పేరు వెనుక అసలు కారణం ఉంది. 1,000 కి.మీ. ప్రయాణానికి డీజిల్‌ ఎస్‌యూవీలో రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఖర్చు కావచ్చని ఎంజీ అంచనా వేసింది. అదే తొమాహాక్ PHEVను క్రమం తప్పకుండా ఛార్జ్‌ చేస్తూ ఎలక్ట్రిక్‌ మోడ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే 1,000 కి.మీ.కు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు మాత్రమే ఖర్చవుతుందని వివరించింది. అంటే డీజిల్‌ ఎస్‌యూవీతో పోలిస్తే నిర్వహణ ఖర్చు దాదాపు మూడో వంతు వరకు తగ్గే అవకాశం ఉందన్నమాట. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. రెగ్యులర్‌ ఛార్జింగ్‌ & ఎక్కువగా ఎలక్ట్రిక్‌ మోడ్‌ వినియోగించడం ఇక్కడ కీలకం. ఇంట్లో ఛార్జింగ్‌ చేసుకోకుండా కేవలం పెట్రోల్‌ ఇంజిన్‌పై ఆధారపడితే ఈ స్థాయిలో పొదుపు ఉండకపోవచ్చు.

మైలేజీ కూడా భారీగానే..

తొమాహాక్ PHEV ప్రధానంగా హైబ్రిడ్‌ మోడ్‌లో ఉపయోగిస్తే సుమారు 22 కి.మీ. మైలేజీ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. క్రమం తప్పకుండా ఛార్జింగ్‌ చేస్తూ రోజువారీ ప్రయాణాల్లో ఎక్కువ భాగాన్ని ఎలక్ట్రిక్‌ మోడ్‌లో పూర్తి చేస్తే 30 నుంచి 50 కి.మీ. వరకు మైలేజీ వస్తుందని తెలిపింది. అయితే ఈ సంఖ్యలను నేరుగా డీజిల్‌ కారు మైలేజీతో పోల్చకూడదు. ఇందులో విద్యుత్‌తో ప్రయాణించిన దూరం కూడా లెక్కలోకి వస్తుంది. ఛార్జింగ్‌ ఖర్చును కూడా మొత్తం నిర్వహణ ఖర్చులో కలపాలి.

ఇది కూడా చదవండి: ADAS ఉన్న కారులో ఈ పొరపాటు చేయవద్దు! విస్మరిస్తే ప్రాణాలకే ముప్పు!

ఎవరిని టార్గెట్‌ చేస్తున్నారు?

భారత్‌లో, ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌యూవీ మార్కెట్‌లో నెలకు సుమారు 50,000 కార్లు అమ్ముడవుతున్నాయని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ అంచనా. ఇందులో దాదాపు 40,000 డీజిల్‌ ఎస్‌యూవీలు ఉంటాయని కంపెనీ చెబుతోంది. మరో 10,000 వరకు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు ఉంటాయని పేర్కొంది. సాధారణంగా ఈ విభాగంలోని కస్టమర్లు ఏడాదికి 18,000 నుంచి 20,000 కి.మీ. వరకు ప్రయాణిస్తారని కంపెనీ నిర్వహించిన సర్వేల్లో తేలింది. వీరిలో చాలామంది రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలతో పాటు తరచూ ఇతర నగరాలకు వెళ్తుంటారు. అందుకే వాళ్లంతా డీజిల్‌ ఎస్‌యూవీలను ఎంచుకుంటున్నారు. తమ అవసరాలకు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కంటే డీజిల్‌ ఎస్‌యూవీ సరిపోతుందని భావిస్తున్నారు. ఈ కస్టమర్లను PHEV వైపు తిప్పాలని ఎంజీ ప్రయత్నిస్తోంది.

MG కంపెనీ.. తొమాహాక్ PHEV తోపాటు తొమాహాక్ EV ని కూడా లాంచ్‌ చేసింది. ఈ రెండింటినీ కలిపి నెలకు 5,000 నుంచి 6,000 కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

PHEV తెచ్చినప్పుడు EV ఎందుకు?

వినియోగదారులను క్రమంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు తీసుకెళ్లడం ఎంజీ పెట్టుకున్న మరో లక్ష్యం. PHEV ద్వారా రోజువారీ ప్రయాణాల్లో EV మోడ్‌ను ఉపయోగించే అలవాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. రోజూ ఎలక్ట్రిక్‌ మోడ్‌లో ప్రయాణించిన తర్వాత, ఇంజిన్‌ అవసరం చాలా తక్కువగా ఉందని కస్టమర్లు గుర్తిస్తారని ఎంజీ అభిప్రాయపడుతోంది. అప్పుడు తర్వాతి కారు పూర్తిస్థాయి EVగా కొనుగోలు చేస్తారని ఆశిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.