భారత్‌లోనూ ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అయితే వాటి అధిక ధర కారణంగా కొనుగోలు చేయడం పెద్ద సమస్యగా ఉంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగా ఉండటానికి కారణం వాటి బ్యాటరీ ఖరీదు కావడమే. ఈ సమస్యను తగ్గించడానికి కంపెనీలు 'Battery as a Service' (BaaS) పథకాన్ని ప్రారంభించాయి. ఈ స్కీమ్‌లో కారు ధర, బ్యాటరీ ధరను వేరు చేస్తారు. దీనివల్ల కారు ప్రారంభ ధర చాలా మేరకు తగ్గుతుంది. కస్టమర్ బ్యాటరీ కోసం ప్రతి కిలోమీటరుకు నిర్ణీత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఈ స్కీమ్ మరింత ప్రయోజనాన్ని అందిస్తుంది. 

MG Comet EV, Tata Punch EV

MG Comet EV భారత్‌లోని చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. దీని BaaS ధర ₹4.92 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. దీని సాధారణ ధర ₹7.63 లక్షల నుండి ఉంటుంది. ఇందులో కిలోమీటరుకు రూ.3.2 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాలి. దాంతో సుమారు ₹2.71 లక్షల వరకు కొనుగోలు సమయంలో ఆదా అవుతుంది. Tata Punch EV కూడా BaaS స్కీమ్‌తో వస్తుంది. దీని ప్రారంభ BaaS ధర ₹6.49 లక్షలు కాగా, సాధారణ ధర ₹9.69 లక్షల నుండి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది. ఇందులో కిలోమీటరుకు ₹2.6 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఇది ప్రస్తుతం అత్యంత తక్కువ అని చెబుతున్నారు. దీనివల్ల దాదాపు కొనుగోలుదారులకు రూ. 3.20 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

MG Windsor, e Vitara కారు, MG ZS EV

MG Windsor EV కారు BaaS ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ బట్టి కిలోమీటరుకు ₹3.9 నుండి 4.5 రూపాయల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.5 లక్షల కంటే ఎక్కువ కొనుగోలు సమయంలో ఉపశమనం లభిస్తుంది. మారుతీ సుజుకి e Vitara కూడా BaaS ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. కారు ప్రారంభ ధర ₹10.99 లక్షల నుండి మొదలవుతుంది. వేర్వేరు బ్యాటరీలపై వేర్వేరు అద్దె చెల్లించాలని గుర్తుంచుకోండి. ఇందులో రూ.5.50 లక్షల వరకు ఆదా అవుతుంది. ఈ కార్ల జాబితాలో ఇదే అత్యధికం. MG ZS EV కారు BaaS ధర రూ.13 లక్షల నుంచి లభిస్తుంది. ఇందులో కిలోమీటరుకు మీరు రూ.4.5 ఛార్జీ చెల్లించాలి. దాదాపు రూ. 5.24 లక్షల వరకు కారు కొనుగోలు సమయంలో మీరు ఆదా చేయవచ్చు.