Mercedes-Benz EQS: జర్మనీకి చెందిన ఆటోమొబైల్ సంస్థ మెర్సిడిస్ బెంజ్ భారత్‌లో ఓ కొత్త ఈవీ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇది తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ అని కంపెనీ చెప్పుకుంటోంది. దీనిని ఈక్యూఎస్ ఎస్‌యూవీ (EQS SUV) అని పిలుస్తారు. ఇది ఈక్యూఎస్ సెడాన్ ఎస్‌యూవీ వెర్షన్ కాగా గతంలో కంపెనీ ఈక్యూఎస్‌లోనే మేబ్యాక్‌ను విక్రయించింది. తాజాగా ఈక్యూఎస్ ఎస్‌యూవీ అనేది ఈ కారు సూపర్ లగ్జరీ వెర్షన్‌గా కంపెనీ చెబుతోంది.


ఈ ఈక్యూఎస్ ఎస్‌యూవీ కారు ప్రారంభ ధర రూ.1.4 కోట్లుగా ఉంది. ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ శ్రేణిలో ఇది అతిపెద్ద ఎస్‌యూవీ మాత్రమే కాక బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్‌తో వస్తుంది. అయితే మేబ్యాక్‌లా కాకుండా, దీనికి తక్కువ క్రోమ్ ఉంది. లైట్ బార్, ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌లతో పాటు కంప్లీట్ విడ్త్ తో ఎల్ఈడీ టెయిల్‌ ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. ఇది ఫుల్ సైజ్ కంబల్షన్ ఇంజిన్ జీఎల్‌ఎల్ పరిమాణంతో సమానం.




ఈక్యూఎస్ 580 వేరియంట్‌లో లోపల ఒక హైపర్ స్క్రీన్‌ని అద్భుతంగా అమర్చారు. ఇందులో మూడు స్క్రీన్‌లు కలిసి ఉంటాయి. ఇతర ఫీచర్లలో భాగంగా 15 స్పీకర్ బర్మెస్టర్ ఆడియో సిస్టమ్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్, అడాస్, ఫుల్ లెంగ్త్ సన్‌రూఫ్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇందులో 7 సీట్లు ఉండటం వలన ఇది ఈవీల్లోనే అతిపెద్ద లగ్జరీ ఎస్‌యూవీ అని చెబుతున్నారు. 7 సీట్లలో మొదటి, రెండవ వరుసలో మంచి స్పేస్ కల్పించారు. ఇది ఈవీ కావడం చేత ఫ్లాట్ ఫ్లోర్ కూడా ఉంది.




ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 122 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 800 కిలో మీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. డ్యూయల్ మోటార్‌లతో ఈ పెద్ద SUV 544 bhp, 858Nm టార్క్ తో చాలా వేగంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. EQS ఎస్‌యూవీ మేబ్యాక్ వెర్షన్ కంటే చాలా చౌకగా ఉంది. అయితే ఇంతకుముందు విక్రయించిన సెడాన్‌తో పాటు టాప్-ఎండ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేంజ్‌లో ఉందని అంటున్నారు.