Maruti prices Wagon R flex fuel: భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్న వేళ మారుతి సుజుకి కీలక ముందడుగు వేసింది. ఇటీవల ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆవిష్కరించిన Wagon R Bioflex ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. E85 ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ఎక్స్‌షోరూమ్ ధరను రూ.7.24 లక్షలుగా నిర్ణయించింది.

Continues below advertisement

ప్రస్తుతం, కమర్షియల్ వినియోగదారుల కోసం మాత్రమే వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే ఈ వెర్షన్ ధర రూ.86 వేల వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం.

E85 ఫ్యూయల్‌కు అనుకూలమైన ఇంజిన్

Continues below advertisement

వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్‌లో మారుతి సుజుకి పాపులర్‌ K12N 1.2 లీటర్ 4-సిలిండర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. అయితే అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఈ ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేసింది.

అప్‌గ్రేడ్ చేసిన ఫ్యూయల్ ఇంజెక్టర్లు, కొత్త ఫ్యూయల్ పంప్, ప్రత్యేక ఫ్యూయల్ లైన్లు, రీక్యాలిబ్రేట్ చేసిన ECU, ఇథనాల్ సెన్సర్ వంటి సాంకేతిక మార్పులతో ఈ ఇంజిన్ E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వినియోగించగలదు.

ఈ ఇంజిన్ పవర్, టార్క్, అధికారిక మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ వ్యాగన్ ఆర్ ZXi+ 1.2 లీటర్ ఇంజిన్ 91 hp పవర్, 114 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్‌లో పెద్ద మార్పులేమీ లేవు

వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ డిజైన్ సాధారణ మోడల్‌ను పోలి ఉంటుంది. బయట నుంచి చూస్తే "Flex Fuel" డెకల్స్, వెనుక భాగంలో "Bioflex" బ్యాడ్జ్ మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఇంటీరియర్‌లో కూడా ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. బ్లాక్-బేజ్ డ్యూయల్ టోన్ క్యాబిన్, ఫ్యాబ్రిక్ సీట్లు, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలు కొనసాగించారు.

ఫీచర్ల పరంగా ఎలా ఉంది?

ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను టాప్ ఎండ్ ZXi+ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో:

* 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్* వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో* ఆపిల్ కార్‌ప్లే* 6 ఎయిర్‌బ్యాగ్స్* ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)* రియర్ ఏసీ వెంట్స్* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్* రియర్ పార్కింగ్ సెన్సర్లు* 4 స్పీకర్లు

వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయని అంచనా.

ధర ఎంత?

వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.24 లక్షలు. ఇదే సమయంలో సాధారణ వ్యాగన్ ఆర్ ZXi+ మాన్యువల్ వేరియంట్‌తో పోలిస్తే రూ.86,000 అధికం.

మరోవైపు, కమర్షియల్ వినియోగదారుల కోసం విక్రయిస్తున్న Wagon R Tour H3 ధర రూ.4.99 లక్షల నుంచి రూ.5.89 లక్షల మధ్య ఉంది. దీంతో పోలిస్తే బయోఫ్లెక్స్ వెర్షన్ రూ.1.35 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఎక్కువగా మారింది.

కొనుగోలుదారులకు లాభసాటి బేరమేనా?

ఇటీవల నిర్వహించిన E20, E85 ఇంధనాల మైలేజ్ పరీక్షల్లో, E20తో పోలిస్తే E85 ఇంధనం సుమారు 24 శాతం తక్కువ మైలేజ్ ఇచ్చినట్లు వెల్లడైంది. అదే సమయంలో E85 ధర కేవలం 19.5 శాతం మాత్రమే తక్కువగా ఉంది.

దీంతో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు వినియోగదారులకు స్పష్టమైన ఖర్చు ప్రయోజనాన్ని అందిస్తున్నాయని చెప్పడం కష్టం. అయినప్పటికీ దేశంలో ఇథనాల్ వినియోగాన్ని పెంచడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి లక్ష్యాల దిశగా ఈ వాహనాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.