Maruti Wagon R Facelift Details In Telugu: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కొనే ప్లాన్‌లో ఉన్నవాళ్లకు గుడ్‌న్యూస్. ఈ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లో త్వరలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ వాహనం రోడ్లపై కనిపించింది. పూర్తిగా క్యామఫ్లేజ్ చేసిన ఈ టెస్ట్ మ్యూల్‌ను కొందరు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వ్యాగన్ ఆర్‌లో కొత్త అప్‌డేట్ రాబోతుందనే చర్చ మొదలైంది.

Continues below advertisement

2019లో మూడో తరం వ్యాగన్ ఆర్ మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ మోడల్‌కు పెద్ద మార్పులు చేయలేదు. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో కొన్ని డిజైన్ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మెకానికల్‌గా కూడా కీలక మార్పు వచ్చే అవకాశం ఉంది.

అండర్‌బాడీ CNG ట్యాంక్‌

Continues below advertisement

రోడ్లపై కనిపించిన టెస్ట్ వాహనాన్ని CNG వెర్షన్‌గా గుర్తించారు. ఇందులో CNG ట్యాంక్‌ను వాహనం కింద అమర్చినట్లు కనిపించింది. సాధారణంగా CNG వాహనాల్లో ట్యాంక్‌ను బూట్‌లో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల బూట్‌లో లగేజీ పెట్టుకునే స్థలం తగ్గుతుంది.

అండర్‌బాడీ CNG ట్యాంక్‌ను ఉపయోగిస్తే ఈ సమస్య తగ్గుతుంది. బూట్ స్పేస్‌ను పూర్తిగా వినియోగించుకోవచ్చు. మారుతి సుజుకి ఇటీవల బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ CNG వెర్షన్‌లో కూడా అండర్‌బాడీ ట్యాంక్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఇదే విధానాన్ని వ్యాగన్ ఆర్‌లోనూ తీసుకురావచ్చని తెలుస్తోంది.

ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే వ్యాగన్ ఆర్ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌లో చిన్న మార్పులు తప్ప పెద్ద స్థాయిలో మార్పులు ఉండకపోవచ్చు. టెస్ట్ వాహనంలో హెడ్‌ల్యాంప్‌లకు కొత్త డిజైన్ డిటైల్స్‌ కనిపించాయి. గ్రిల్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. బంపర్‌కు మరింత స్మూత్ ఫినిష్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కింది భాగంలో ఉన్న ఎయిర్ ఇన్‌లెట్లను కూడా రీడిజైన్ చేయవచ్చు.

వెనుక భాగంలోనూ చిన్న మార్పులు కనిపించాయి. బంపర్‌లో స్వల్ప మార్పులు చేశారు. ప్రస్తుత మోడల్‌లో అడ్డంగా ఉన్న రిఫ్లెక్టర్ల స్థానంలో నిలువుగా ఉండే రిఫ్లెక్టర్లు కనిపించాయి. అయితే టెయిల్ ల్యాంప్ డిజైన్ మాత్రం ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగానే కొనసాగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460km దూరం జర్నీ.. 7 ఎయిర్‌బ్యాగ్స్‌తో కియా కొత్త PV7 ఎలక్ట్రిక్ వ్యాన్!

ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్‌ 

ఇంటీరియర్‌కు సంబంధించి కూడా టెస్ట్ వాహనంలో కొంత భాగం కనిపించింది, పెద్ద మార్పులు ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా బయట డిజైన్ & ఇంజిన్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ఇంజిన్ విషయానికి వస్తే, వ్యాగన్ ఆర్‌లో 1.0 లీటర్ 3  సిలిండర్‌ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగవచ్చు. ఇదే ఇంజిన్‌తో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉండొచ్చు. అయితే టాప్ వేరియంట్లలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.2 లీటర్ 4 సిలిండర్‌ K12N పెట్రోల్ ఇంజిన్ స్థానంలో కొత్త Z12E ఇంజిన్‌ను తీసుకురావచ్చని సమాచారం.

మారుతి సుజుకి ఇప్పటికే స్విఫ్ట్ & డిజైర్ వంటి మోడళ్లలో K సిరీస్ ఇంజిన్‌కు బదులుగా Z సిరీస్ ఇంజిన్‌ను ఉపయోగిస్తోంది. మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం ఈ మార్పు చేస్తోంది. ఇదే విధానాన్ని వ్యాగన్ ఆర్‌లోనూ అమలు చేసే అవకాశం ఉంది.

వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో కూడా ఇంజిన్ మార్పు ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా లేదు. ప్రస్తుతం ఆ వెర్షన్‌లోనూ K సిరీస్ ఇంజిన్‌నే ఉపయోగిస్తున్నారు.

ధర

కొత్త మార్పులతో వ్యాగన్ ఆర్ ఫేస్‌లిఫ్ట్ ధర కొంత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యాగన్ ఆర్ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.24 లక్షల వరకు ఉంది. ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మారుతి సెలెరియో & టాటా టియాగో వంటి కార్లతో పోటీ కొనసాగించనుంది.

కొత్త వ్యాగన్ ఆర్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? పూర్తి వివరాలు ఏమిటి? అనే విషయాలపై మారుతి సుజుకి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Kia Carens Clavis EVకి లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ.. ఫెస్టివ్‌ సీజన్‌లో కియా కంపెనీ కొత్త ఆఫర్

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.