మారుతి సుజుకి విటారా బ్రెజా మొదటిసారి 2016లో లాంచ్ అయింది. మొదట్లో ఇందులో కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. 2020లో బీఎస్6 నిబంధనలు అందుబాటులోకి రావడంతో కంపెనీ డీజిల్ ఇంజిన్ల తయారీని నిలిపివేసింది. 1.5 లీటర్ బీఎస్6 ఎస్‌హెచ్‌వీఎస్ పెట్రోల్ ఇంజిన్‌తో మారుతి సుజుకి విటారా బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ అప్పుడే లాంచ్ చేసింది. ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో పోటీ కూడా ఎక్కువైంది. కాబట్టి మారుతి సుజుకి కొత్త తరం బ్రెజాను ఇటీవలే లాంచ్ చేసింది. అంతేకాకుండా కారు పేరులో విటారా తీసేసి కేవలం ‘బ్రెజా’గానే మార్కెట్ చేసింది. దీంతో వినియోగదారులకు పాత మోడల్ కొనుగోలు చేయాలా లేక కొత్త మోడల్ కొనాలా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. వీటిలో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం...
ధర
కారు కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ముందుగా చూసేది ధరనే. కాబట్టి వీటిలో ఏది తక్కువకు వస్తుందో చూద్దాం. తాజాగా లాంచ్ అయిన మారుతి సుజుకి బ్రెజా ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్య ఉంది. దీని ముందు తరం మారుతి సుజుకి విటారా బ్రెజా ధర రూ.7.34 లక్షల నుంచి రూ.11.40 లక్షల మధ్య ఉంది. ప్రారంభ వేరియంట్‌ను కొనుగోలు చేయాలంటే రూ.65,000 ఎక్కువ పెట్టాలి. దీంతో ప్రస్తుతం వెన్యూ, నెక్సాన్‌ల రేంజ్‌లోకి బ్రెజా కూడా చేరిపోయింది. అయితే టాప్ ఎండ్ మోడల్ కొనాలంటే మాత్రం ఏకంగా రూ.2.56 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ మొత్తమే.
ఫీచర్లు
కొత్త బ్రెజాలో లేటెస్ట్ ఫీచర్లను కంపెనీ అందించింది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్స్‌అప్ డిస్‌ప్లే, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్ బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫ్లోటింగ్ రూఫ్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
ఇక ముందు తరం బ్రెజాలో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వెనకవైపు ఏసీ వెంట్స్, ఆటో వైపర్స్, క్రూజ్ కంట్రోల్, ముందు, వెనకవైపు ఆర్మ్ రెస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు దాదాపు లేటెస్ట్ బ్రెజాలో కూడా ఉన్నాయి.
ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, మైలేజ్
కొత్త బ్రెజాలో 1.5 లీటర్ ఎన్ఏ ప్రొగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ముందు వెర్షన్‌లో 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ మోడల్ అందుబాటులో ఉంది. కొత్త బ్రెజా 101 హెచ్‌పీని అందిస్తుండగా... పాత బ్రెజా 103 బీహెచ్‌పీని అందించనుంది. ఇక కొత్త బ్రెజా పీక్ టార్క్ 136 ఎన్ఎం కాగా... పాత బ్రెజా పీక్ టార్క్ 138 ఎన్ఎంగా ఉంది. కొత్త బ్రెజాలో 5 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ముందు వెర్షన్‌లో 5 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
ఇక మైలేజ్ విషయానికి వస్తే... కొత్త బ్రెజా మాన్యువల్ మోడల్ లీటరుకు 20.15 కిలోమీటర్ల మైలేజ్‌ను, ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 19.8 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ముందు వెర్షన్ బ్రెజా మాన్యువల్ మోడల్ లీటరుకు 17.03 కిలోమీటర్లను, ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 18.76 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. పవర్ విషయంలో ముందు వెర్షన్ బ్రెజా కొంచెం ముందంజలో ఉండగా... మైలేజ్‌లో మాత్రం కొత్త బ్రెజా ఏకంగా మూడు కిలోమీటర్ల మైలేజ్ అధికంగా అందించనుంది.
పాత బ్రెజా కంటే కొత్త బ్రెజా ఎత్తు 4.5 సెంటీమీటర్లు పెరిగింది. అంటే దాదాపు ఒకటిన్నర అంగుళం పెరిగిందనుకోవచ్చు. మిగతా డైమెన్షన్స్ రెండిట్లోనూ దాదాపు సమానంగానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే... స్టార్టింగ్, మిడ్ వేరియంట్‌లు కొనాలనుకుంటే కొత్త బ్రెజాను కళ్లు మూసుకుని తీసుకోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ల వైపు వెళ్లే కొద్దీ ధరలో తేడా ఎక్కువగా ఉంది కాబట్టి అధికంగా మీరు పెట్టాలనుకునే ధరకు పొందుతున్న ఫీచర్లు తగినవేనా కాదా అని చూసుకుని ఆ ఫీచర్లు కచ్చితంగా కావాలనుకుంటే కొత్త బ్రెజా... ఫీచర్లు తక్కువైనా రూ.3 లక్షలు మిగుల్చుకోవాలనుకుంటే పాత బ్రెజా కొనవచ్చు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?