Maruti Suzuki eVitara Launch Letest News: మారుతి సుజుకి మరియు సుజుకి గ్లోబల్ సంయుక్తంగా తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం (EV) ఈ-విటారా (eVitara) భారత మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పటికే, 2,900 సుజుకి ఈ-విటారా యూనిట్ల మొదటి బ్యాచ్‌ను భారతదేశంలో తయారు చేసి ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేయడం ద్వారా, మారుతి సుజుకి తన తయారీ సామర్థ్యాన్ని చాటిచెప్పింది . భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఇది పెద్ద ప్రోత్సాహాన్ని అందించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పో (భారత్ మొబిలిటీ ఎక్స్‌పో)లో ఈ-విటారాను ఆవిష్కరించారు.
తొలి అడుగు..మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఇది మొదటి అడుగు అని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే ఈవీ రంగంలో ఉన్న ప్రధాన కంపెనీలకు సవాలు విసరగలిగే రీతిలో ఈ విటారను తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వాహనం డిసెంబర్ 2025లో ఇండియాలో విడుదల కానుంది. దీని ఉత్పత్తి మొత్తం మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడి నుంచే గ్లోబల్-స్పెక్ మోడళ్లను ఉత్పత్తి చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా మార్కెట్‌లకు పంపనున్నారు. ఈ-విటారాను ఆధారంగా చేసుకుని, టయోటా కూడా తన అర్బన్ క్రూయిజర్ ఈవీ (Urban Cruiser EV)ని విడుదల చేయనుంది, ఇది కూడా ఇక్కడే తయారవుతుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ,మహీంద్రా బీఈ 6 వంటి మోడళ్లు ఈ-విటారాకు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
ఫీచర్లు, బ్యాటరీ ఆప్షన్లు ..మారుతి సుజుకి ఈ-విటారా నెక్సా (Nexa) ఔట్‌లెట్ల ద్వారా విక్రయించబడుతుంది, ఇది డెల్టా, జెటా, ఆల్ఫా అనే మూడు విభిన్న ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. భారతదేశంలో విడుదలయ్యే అన్ని ట్రిమ్స్‌లో ఫార్వర్డ్ వీల్ డ్రైవ్ (FWD) లేఅవుట్ ప్రామాణికంగా ఉంటుంది. ప్రారంభంలో డ్యూయల్-మోటార్ వెర్షన్లు ఉండకపోవచ్చు. మారుతి రెండు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది: 49 kWh , 61 kWh. ఈ బ్యాటరీ ఆప్షన్లను బట్టి, సింగిల్ ఎఫ్‌డబ్ల్యుడి మోటార్‌తో వరుసగా 142 బిహెచ్‌పి లేదా 172 బిహెచ్‌పి గరిష్ట శక్తిని అందించవచ్చు. ఫీచర్లు , పరికరాల విషయంలో మారుతి ఎక్కడా రాజీ పడకుండా, అధునాతన హంగులను అందించనుందని తెలుస్తోంది. ఈ-విటారాలో ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్ ,డోర్ ట్రిమ్స్‌పై సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్, గ్లాస్ రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ,వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ-విటారా పొడవు 4.27 మీటర్లు ఉన్నప్పటికీ, దీనికి 2,700 మి.మీ. పొడవైన వీల్‌బేస్ ఉంది, ఇది లోపల ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ఈ-విటారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కి.మీ గరిష్ట రేంజ్‌ను అందించే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు రేంజీ విషయంలో మరింత భరోసాను ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.