Maruti Suzuki Announces Price Hike: కామన్‌మ్యాన్‌ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, మరోసారి ధరలను పెంచింది. రేట్ల పెంచడం ఏడాది వ్యవధిలో ఇది నాలుగోసారి. ఎంపిక చేసిన మోడళ్లపై ఈ ధరల పెంపు 22 నవంబర్ 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ధరలు సగటున 0.31 శాతం పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఏయే మోడళ్లపై ధరలు పెరుగుతాయి? ఒక్కో కారుపై ఎంత పెంపు ఉంటుంది? అనే వివరాలను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Continues below advertisement

ఖర్చుల ఒత్తిడితో ధరల సవరణ

కొంతకాలంగా ముడిసరుకులు, విడిభాగాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకుంది. నిరంతర వ్యయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అదే సమయంలో కస్టమర్లపై ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామని వెల్లడించింది.

Continues below advertisement

“నిరంతర వ్యయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఈ పెంపు నవంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. ధరల పెరుగుదల పరిమాణ ఆధారిత వెయిటెడ్ యావరేజ్ ప్రకారం సుమారు 0.31 శాతంగా ఉంటుంది” అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి పేర్కొంది.

ఇది కూడా చదవండి: కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్

అన్ని మోడళ్లకు ఒకే పెంపు కాదు

మారుతి ప్రకటించిన 0.31 శాతం పెంపు అనేది వాహన విక్రయాల పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకున్న వెయిటెడ్ యావరేజ్ మాత్రమే. కంపెనీ మొత్తం కార్ల శ్రేణిపై ఒకే విధంగా 0.31 శాతం ధరలు పెరుగుతాయని దీని అర్థం కాదు. ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే ధరల సవరణ వర్తిస్తుంది.

ఏ మోడళ్ల ధరలు పెరుగుతాయో, ఒక్కో మోడల్‌పై ఎంత అదనపు ధర భారం పడుతుందో మారుతి సుజుకి ఇంకా వెల్లడించలేదు. ఆ వివరాలు ప్రకటించిన తర్వాతే వివిధ కార్ల కొత్త ధరలపై స్పష్టత రానుంది.

నాలుగోసారి..

FY2026-27లో మారుతి సుజుకి చేపట్టిన నాలుగో ధరల సవరణ ఇది. సెప్టెంబర్‌లోనూ కొన్ని మోడళ్ల మీద రూ.20,000 వరకు ధరల పెంపును ఈ కంపెనీ ప్రకటించింది. దీనికంటే ముందు ఆగస్టులో... ఎరినా, నెక్సా షోరూముల్లో అమ్మే కొన్ని మోడళ్లపై రూ.30,000 ధరలు పెంచింది. జూన్‌లోనూ రూ.30,000 వరకు రేట్లను సవరించింది.

ఇది కూడా చదవండి: 180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!

Q2 FY2027లో లాభం తగ్గుదల

కంపెనీ ఇటీవల ప్రకటించిన Q2 FY2027 ఆర్థిక ఫలితాల్లో లాభదాయకతపై ఒత్తిడి కనిపించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,302.8 కోట్లుగా ఉన్న స్టాండలోన్ నికర లాభం ఈసారి 27 శాతం తగ్గి రూ.2,414.9 కోట్లకు చేరింది.

అయితే, ఇదే సమయంలో కంపెనీ త్రైమాసిక నికర అమ్మకాల్లో రికార్డు నమోదు చేసింది. Q2 FY2027లో నికర అమ్మకాలు రూ.50,615.5 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. మొత్తం వాహన విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో 6,96,654 యూనిట్లకు చేరుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన దాదాపు 27 శాతం వృద్ధి నమోదైంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.