Mandatory Electric Car Sound Alerts: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం పెరుగుతోంది. అయితే EVలతో ఒక సమస్య ఉంది. ఇవి తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దాదాపు శబ్దం లేకుండా కదులుతాయి. రోడ్డు దాటే పాదచారులు, సైక్లిస్టులు, పార్కింగ్ ప్రాంతాల్లో నడిచేవాళ్లు ఆ వాహనాన్ని గుర్తించలేకపోవచ్చు. ఈ సమస్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

Continues below advertisement

నిర్దేశిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహన మోడళ్లకు అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (AVAS)ను తప్పనిసరి చేసింది. 2026 అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అంటే, అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ప్రతి ఎలక్ట్రిక్‌ వాహనం, తక్కువ వేగంతో కదులుతున్నప్పుడు బయటకు వినిపించే హెచ్చరిక శబ్దం రావాలి. తద్వారా, ఈ వాహనానికి సమీపంలో ఉండే ప్రజలు అప్రమత్తం అవుతారు. ఈ ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్లకు ఈ నిబంధనలను పాటించేందుకు 2027 అక్టోబర్ 1 వరకు కేంద్రం గడువు ఇచ్చింది.

AVAS అంటే ఏమిటి?

Continues below advertisement

AVAS పూర్తి పేరు అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్. ఎలక్ట్రిక్ వాహనం నిశ్శబ్దంగా కదులుతున్నప్పుడు బయటివారికి వినిపించేలా హెచ్చరిక శబ్దాన్ని విడుదల చేసే వ్యవస్థ ఇది. ఆ వాహనం సమీపంలోనే ఉందని పాదచారులు, ఇతర రోడ్డు వినియోగదారులు గుర్తించేందుకు ఈ సౌండ్ ఉపయోగపడుతుంది. ఇది సాధారణ హారన్‌లా పెద్దగా శబ్దం చేయాల్సిన అవసరం లేదు. వాహనం వస్తున్నట్లు చుట్టుపక్కల వారికి అర్థమయ్యేంత శబ్దం ఉండేలా రూపొందిస్తారు. ముఖ్యంగా రద్దీగా ఉండే వీధులు, నివాస ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాల్లో ఇది ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌

ఏ వేగంలో సౌండ్ వస్తుంది?

AIS-173 ప్రమాణాల ప్రకారం, వాహనం గంటకు 0 కిలోమీటర్ల కంటే ఎక్కువ, 20 కిలోమీటర్ల వరకు వేగంతో ముందుకు కదులుతున్నప్పుడు AVAS శబ్దం అవసరం. రివర్స్ చేసే సమయంలోనూ ప్రత్యేక హెచ్చరిక శబ్దం ఉండాలి. గంటకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంలో AVAS శబ్దాన్ని తప్పనిసరి కాదు.

ఎంత శబ్దం ఉండాలి?

AVAS కోసం ప్రభుత్వం హారన్‌లా ఇబ్బంది కలిగించే శబ్దాన్ని తప్పనిసరి చేయలేదు. AIS-173 ప్రమాణాలు నిర్దిష్ట వేగాల్లో కనీస శబ్ద స్థాయిలను నిర్దేశించాయి. ముందుకు ప్రయాణించే సమయంలో గరిష్ఠ శబ్ద స్థాయి 75 dB(A)కు మించకూడదు. పాదచారులు సులభంగా గుర్తించేలా నిర్దేశిత ఫ్రీక్వెన్సీ ప్రమాణాలను కూడా పాటించాలి.

ఏ వాహనాలకు ఈ రూల్ వర్తిస్తుంది?

భారత వాహన వర్గీకరణలోని M, N కేటగిరీలకు చెందిన నిర్దేశిత ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. M కేటగిరీలో కార్లు, బస్సులు వంటి ప్రయాణికుల వాహనాలు ఉంటాయి. N కేటగిరీలో ట్రక్కులు వంటి గూడ్స్ వాహనాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లకు ఈ రూల్‌ వర్తించదు.

ఇది కూడా చదవండి: 2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి

AVAS సౌండ్‌ను ఆఫ్ చేయవచ్చా?

డ్రైవర్‌కు నచ్చినప్పుడు ఈ సౌండ్‌ను ఆపేసే అవకాశం ఉంటుందని భావించకూడదు. AIS-173 ప్రమాణాల ప్రకారం AVASలో పాజ్ ఫంక్షన్‌కు అనుమతి లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.