Mahindra XUV 7XO Review: మహీంద్రా XUV 7XO... ఇది కేవలం ఒక ఫేస్‌లిఫ్ట్ కాదు. XUV 700కి వచ్చిన పూర్తి స్థాయి అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు. 2021 నుంచి మార్కెట్‌లో మంచి డిమాండ్‌తో దూసుకెళ్తున్న XUV 700కి, ఇప్పుడు Mahindra తన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్న సరికొత్త టెక్నాలజీని జోడించి కొత్త పేరు పెట్టింది, ఆ పేరే - XUV 7XO. ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్‌లు రాజస్థాన్‌లోని జైసల్మేర్ రోడ్లపై ఈ SUVని డ్రైవ్ చేసి చూసిన తర్వాత, ఇది ఎందుకు స్పెషల్ అనేది స్పష్టంగా అర్థమైంది.
డిజైన్ - పరిచయమైనదే, కానీ షార్ప్‌గా
XUV 7XO తొలి చూపులో XUV 700నే గుర్తు చేస్తుంది. కానీ దగ్గరగా చూస్తే డిజైన్‌లో చేసిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన DRLs, స్లిమ్ గ్రిల్, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్ SUVకి మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తాయి. క్రింద భాగంలో కొత్త బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ICE క్యూబ్ స్టైల్ ఫాగ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
టాప్ వేరియంట్లలో ఇప్పుడు 19 ఇంచుల అల్లాయ్ వీల్స్ వచ్చాయి. వెనుక భాగంలో XEV 9S నుంచి తీసుకున్న కొత్త LED టెయిల్ ల్యాంప్స్, హెక్సాగనల్ ప్యాటర్న్‌తో ప్రీమియం ఫీల్ ఇస్తాయి. మొత్తం మీద పాత డిజైన్‌ను చెడగొట్టకుండా, కొత్తదనం జోడించారు.
ఇంటీరియర్ - అసలైన హైలైట్
XUV 7XOలోకి ఎక్కగానే మార్పు స్పష్టంగా తెలుస్తుంది. డ్యాష్‌బోర్డ్ మొత్తం విస్తరించిన మూడు 12.3 ఇంచుల స్క్రీన్లు ఈ SUVకి ఫ్యూచర్ లుక్ ఇస్తాయి. డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ స్క్రీన్ - ఈ మూడూ స్టాండర్డ్.
ముందు సీట్లు వెడల్పుగా, మంచి సపోర్ట్‌తో ఉంటాయి. డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లు పవర్డ్, వెంటిలేటెడ్‌తో పాటు డ్రైవర్ సీట్‌కు మెమరీ ఫంక్షన్, ప్యాసింజర్ సీట్‌కు బాస్ మోడ్ ఉంది. రెండో వరుస సీట్లు కూడా టాప్ వేరియంట్లలో వెంటిలేషన్‌తో వస్తాయి.
మూడో వరుస విషయానికి వస్తే, ఇది పెద్దల కోసం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చిన్న ప్రయాణాలకు సరిపోతుంది. అయితే మూడో వరుస మడిచేస్తే, బూట్ స్పేస్ మాత్రం భారీగా లభిస్తుంది.
ఫీచర్లు & సేఫ్టీ
ఫీచర్ల విషయంలో XUV 7XO నిజంగా క్లాస్ లీడర్. 540 డిగ్రీ కెమెరా, 16 స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ స్టాండర్డ్. టాప్ వేరియంట్లలో లెవల్ 2 ADAS చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. మన రోడ్లపై కూడా ఇది బాగా స్పందించడం విశేషం.
ఇంజిన్ & డ్రైవింగ్ అనుభవం
పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు XUV 700 నుంచే కొనసాగుతున్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 203hp శక్తిని ఇస్తుంది. డ్రైవ్‌లో ఇది చాలా స్మూత్‌గా, పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే టార్క్ విషయంలో అదిరిపోతుంది. లాంగ్ డ్రైవ్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్.
రైడ్ కంఫర్ట్ - నిజమైన గేమ్ ఛేంజర్
కొత్తగా ఇచ్చిన DaVinci డ్యాంపర్స్, హైడ్రాలిక్ బంప్ స్టాప్స్ వల్ల రైడ్ క్వాలిటీ పూర్తిగా మారిపోయింది. చిన్న గుంతలు, చెడ్డ రోడ్లు, అన్నీ చాలా సాఫ్ట్‌గా ఫిల్టర్ చేస్తుంది. హైవే స్పీడ్స్‌లో స్టెబిలిటీ మరింత పెరిగింది.
ధర & విలువ
XUV 7XO ప్రారంభ ధర రూ.13.66 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ వేరియంట్ ధర రూ.24.92 లక్షల వరకు వెళ్తుంది. ఈ ధరకు ఇంత టెక్నాలజీ, కంఫర్ట్, పనితీరు ఇవ్వడం Mahindra పెద్ద ప్లస్.
ఫైనల్ వెర్డిక్ట్
Mahindra XUV 7XO అనేది XUV 700కి కేవలం అప్‌డేట్ కాదు, ఇది ఒక 'లెవెల్ అప్'. ఫీచర్లు, రైడ్ కంఫర్ట్, శక్తిమంతమైన ఇంజిన్‌తో ఇది 2026లో కూడా Mahindraకి బలమైన ఆయుధంగా మారనుంది. Hyundai, Tataలకు ఇది నిజంగానే పెద్ద ఛాలెంజ్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.