Electric Car Efficiency In India: భారత ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్‌ వేగంగా మారుతోంది. ఈ క్రమంలో మూడు వరుసల సీటింగ్‌తో వచ్చే ఎలక్ట్రిక్‌ కార్లపై కుటుంబ వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. అలాంటి విభాగంలోకి వచ్చిన రెండు కీలక మోడళ్లే Mahindra XEV 9S & Kia Carens Clavis EV. బాడీ స్టైల్‌ పరంగా రెండూ వేర్వేరుగా కనిపించినా, టాప్‌ వేరియంట్ల (Kia Carens Clavis EV HTX+ ER & Mahindra XEV 9S Pack Three Above) ధర దగ్గరగా ఉండడంతో వీటి మధ్య పోలిక సహజంగా మొదలైంది. ముఖ్యంగా, ఒక ఫుల్‌ చార్జ్‌తో ఏ కారులో నిజంగా ఎంత దూరం ప్రయాణించగలవన్న ప్రధాన ప్రశ్న తలెత్తింది.

Continues below advertisement

బ్యాటరీ, క్లెయిమ్‌ చేసిన రేంజ్‌

టాప్‌ స్పెక్‌ Mahindra XEV 9Sలో భారీ 79kWh బ్యాటరీ ప్యాక్‌ లభిస్తుంది. దీనికి మహీంద్రా 679 కి.మీ. క్లెయిమ్‌ చేసిన రేంజ్‌ ప్రకటించింది. మరోవైపు, Kia Carens Clavis EV టాప్‌ వేరియంట్‌లో 51.4kWh బ్యాటరీ ఇస్తుంది. దీనికి 490 కి.మీ. రేంజ్‌ అని కంపెనీ చెప్పింది.

Continues below advertisement

బ్యాటరీ పరిమాణంలోనే కాదు, శక్తి పరంగా కూడా XEV 9S ముందంజలో ఉంది. అయితే, దీనికి మైనస్‌గా చెప్పుకోవాల్సింది బరువు. Clavis EVతో పోలిస్తే XEV 9S దాదాపు అర టన్ను ఎక్కువ బరువు ఉంటుంది. ఇదే అంశం ఎఫిషియెన్సీపై ప్రభావం చూపింది.

రియల్‌ వరల్డ్‌ రేంజ్‌ టెస్ట్‌ ఫలితాలు

నిజ జీవిత వినియోగానికి దగ్గరగా ఉండేలా నిర్వహించిన రేంజ్‌ టెస్టుల్లో రెండు కార్లు ఈ ఫలితాలు ఇచ్చాయి:

నగరంలో Kia Carens Clavis EV ఒక పూర్తి చార్జ్‌తో 383 కి.మీ. ప్రయాణించగా, Mahindra XEV 9S 478 కి.మీ. వరకు వెళ్లింది. అంటే నగర వినియోగంలోనే XEV 9S దాదాపు 95 కి.మీ. ఎక్కువ రేంజ్‌ ఇచ్చింది.

హైవే పరిస్థితుల్లో ఈ తేడా మరింత పెరిగింది. Clavis EV 345 కి.మీ., XEV 9S 477 కి.మీ. ప్రయాణించాయి. ఇక్కడ తేడా 132 కి.మీ.కు చేరింది.

మొత్తంగా చూసుకుంటే, ఒకే చార్జ్‌తో XEV 9S సగటున 477.5 కి.మీ., Clavis EV సగటున 364 కి.మీ. ప్రయాణించాయి. అంటే రియల్‌ వరల్డ్‌లో కూడా XEV 9S దాదాపు 114 కి.మీ. ఎక్కువ రేంజ్‌ అందించింది.

ఏ కారు ఎఫిషియెన్సీ ఎక్కువ?

ఇక్కడే ఆసక్తికరమైన విషయం బయటపడింది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఎక్కువ బరువు & అధిక శక్తి కారణంగా XEV 9S ఎఫిషియెన్సీ 6.04 కి.మీ./kWh మాత్రమే ఇచ్చింది. అదే సమయంలో, తక్కువ బరువు ఉన్న Carens Clavis EV 7.08 కి.మీ./kWh ఎఫిషియెన్సీ సాధించింది. అంటే బ్యాటరీ వినియోగంలో కియా కారు మరింత సమర్థంగా పనిచేసింది.

ఇతర వేరియంట్ల విషయానికి వస్తే..

Mahindra XEV 9Sలో 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. ఆసక్తికరంగా, పెద్ద 79kWh బ్యాటరీ బేస్‌ వేరియంట్‌ నుంచే అందుబాటులో ఉంది.

Kia Carens Clavis EVలో 40kWh, 51.4kWh బ్యాటరీలు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ HTX E మిడ్‌ వేరియంట్‌ నుంచి మాత్రమే వస్తుంది.

ధర 

Kia Carens Clavis EV HTX+ ER  - రూ. 24.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

Mahindra XEV 9S Pack Three Above - రూ. 29.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ‍‌(11.2kW ఛార్జర్‌ ధర రూ. 75,000 అదనం)

మొత్తం మీద, మీకు ఎక్కువ రేంజ్‌, శక్తివంతమైన పనితీరు కావాలంటే Mahindra XEV 9S స్పష్టంగా ముందుంది. కానీ బ్యాటరీ ఎఫిషియెన్సీ, తక్కువ బరువు, బ్యాలెన్స్‌డ్‌ పెర్ఫార్మెన్స్‌ కోరుకునే వారికి Kia Carens Clavis EV మంచి ఎంపిక. తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘ ప్రయాణాలు ఎక్కువగా చేసే కుటుంబాలకు నిర్ణయం తీసుకోవడంలో ఈ కంపారిజన్‌ ఒక స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నాం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.