Mahindra Thar Prices Hiked in India: ఇండియ‌న్ రోడ్లపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఈ త్రీ-డోర్ ఎస్‌యూవీ ధరను కంపెనీ గరిష్టంగా రూ. 43,500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6 నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే థార్ ధరలు పెరగడం ఇది రెండవసారి. గత జనవరిలో కూడా రూ. 20,000 వరకు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ముడి సరుకుల ఖర్చులు పెరగడం వల్ల వాహనాల ధరలను 2.5 శాతం వరకు పెంచుతామని మహీంద్రా సంస్థ గతంలోనే హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని థార్ మోడల్ పై అమలు చేసింది.

ఏ వేరియంట్‌పై ఎంత పెరిగింది?మహీంద్రా థార్ లైనప్‌లో ఎల్ఎక్స్‌టి 4డబ్ల్యుడి 2.2 డీజిల్ ఆటోమేటిక్ (LXT 4WD 2.2 Diesel AT) వేరియంట్‌పై అత్యధికంగా రూ. 43,500 ధర పెరిగింది. దీని తర్వాతి స్థానంలో ఎల్ఎక్స్‌టి 4డబ్ల్యుడి 2.0 పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది, దీని ధర రూ. 41,500 పెరిగింది. మాన్యువల్ వేరియంట్ల విషయానికి వస్తే, డీజిల్ మాన్యువల్ పై రూ. 39,500, పెట్రోల్ మాన్యువల్ పై రూ. 37,500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఎక్స్‌టి 2డబ్ల్యుడి డీజిల్, ఎల్ఎక్స్‌టి 4డబ్ల్యుడి పెట్రోల్ మోడళ్లపై రూ. 30,500 మేర కంపెనీ పెంచింది. అయితే, ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన ఏఎక్స్‌టి 2డబ్ల్యుడి 1.5 డీజిల్ మాన్యువల్ ధర మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రూ. 9.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) వద్దే కొనసాగుతోంది.

మెకానికల్ ఆప్షన్లు - పర్ఫార్మెన్స్..మహీంద్రా థార్ ప్రస్తుతం మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్లు గా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 2025లో చిన్నపాటి అప్‌డేట్స్ పొందిన ఈ మోడల్, ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఇప్పటికీ ఫేవరెట్ ఛాయిస్‌గా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్..ప్రస్తుత ధరల పెంపు ఒక వైపు కొన సాగుతుండగా, మరోవైపు మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ (Facelift) వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. ఇది ఇటీవల లాంచ్ అయిన 'థార్ రాక్స్' (Thar Roxx) నుంచి స్ఫూర్తి పొందిన హెడ్‌లైట్, గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉండబోతోంది. బాడీ స్ట్రక్చర్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొన్ని మెకానికల్ అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది. ఎస్‌యూవీ మార్కెట్లో మంచి రోడ్ ప్రెజెన్స్ కావాలనుకునే వారికి థార్ ఒక ఐకానిక్ మోడల్. కాకపోతే వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్య వాహన ప్రియులకు కొంచెం నిరాశ కలిగిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో టయోటా వంటి ఇతర కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తుంటే, మహీంద్రా మాత్రం ధరలు పెంచడం గమనార్హం. ఈ అంశం అమ్మ‌కాల‌పై కాస్త ప్రభావం చూపించే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.