Mahindra Car Sales 2025: భారతీయ కార్ల మార్కెట్‌లో, 2025 సంవత్సరం, మహీంద్రా & మహీంద్రాకు చరిత్రాత్మకంగా మారింది. SUVల ఆధిపత్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ, దేశీయ ప్యాసింజర్‌ వాహన మార్కెట్‌లో మహీంద్రా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. వాహన్‌ డేటా ప్రకారం, డిసెంబర్‌ 25 వరకు నమోదైన గణాంకాల్లో, మహీంద్రా తొలిసారిగా Hyundai, Tata Motorsలను వెనక్కి నెట్టి నంబర్‌-2గా నిలిచింది. మొదటి స్థానంలో Maruti Suzuki తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సుమారు 17.50 లక్షల యూనిట్లను నమోదు చేసింది.

Continues below advertisement

2024 నుంచి 2025కి భారీ జంప్‌2025లో మహీంద్రా సుమారు 5.81 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. గత ఏడాది అంటే 2024లో ఈ సంఖ్య 4.90 లక్షలు మాత్రమే. ఈ పెరుగుదలతో మహీంద్రా గతేడాది నాలుగో స్థానంలో ఉండగా, ఈ ఏడాది నేరుగా రెండో స్థానానికి ఎగబాకింది. జనవరి నుంచి నవంబర్‌ 2025 వరకు మహీంద్రా అమ్మకాలు 5,74,657 యూనిట్లు, ఇది ఏడాది ప్రాతిపదికన 18% గ్రోత్‌ను సూచిస్తుంది. మొత్తం 16 కార్‌ కంపెనీల్లో ఇదే అతి పెద్ద పెరుగుదలగా నిలిచింది.

Tata, Hyundai కు షాక్‌2025లో, Tata Motors సుమారు 5.52 లక్షల యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. Hyundai మాత్రం 5.50 లక్షల యూనిట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. చాలా సంవత్సరాల తర్వాత Hyundai తన రెండో స్థానాన్ని కోల్పోవడం విశేషం.

Continues below advertisement

SUVలే మహీంద్రా బలంమహీంద్రా ఎదుగుదలకు ప్రధాన కారణం SUVలకు ఉన్న బలమైన డిమాండ్‌. బాడీ-ఆన్‌-ఫ్రేమ్‌, మోనోకాక్‌ SUVలపై దృష్టి పెట్టిన మహీంద్రా వ్యూహం ఫలించింది. Scorpio, Bolero, Thar, XUV శ్రేణి మోడళ్లు నెలవారీగా స్థిరమైన అమ్మకాలను అందించాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలలో SUVలే మెజారిటీగా ఉండడం మహీంద్రాకు కలిసి వచ్చింది.

గ్రామీణ మార్కెట్‌లో Bolero హవాBolero, Bolero Neo కలిపి 93,436 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది మహీంద్రా మొత్తం అమ్మకాలలో 16 శాతం వాటా. సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో Boleroకి ఉన్న డిమాండ్‌ మహీంద్రాకు స్థిరమైన సంఖ్యలను అందించింది.

3XO, XUV700 పాత్ర3XO కాంపాక్ట్‌ SUV 90,608 యూనిట్లు అమ్మకాలతో 12 శాతం వృద్ధి సాధించింది. మొత్తం సేల్స్‌లో కూడా దాదాపు 16 శాతం వాటా కలిగి ఉంది. XUV700 80,251 యూనిట్లతో స్వల్పంగా 4 శాతం తగ్గినా, ఇప్పటికీ 14 శాతం వాటాతో కీలక మోడల్‌గా కొనసాగుతోంది.

Thar బ్రాండ్‌ సూపర్‌ హిట్‌ఈ ఏడాది మహీంద్రాకు పెద్ద గేమ్‌ ఛేంజర్‌ Thar. మూడు డోర్ల Thar, ఐదు డోర్ల Thar Roxx కలిపి 1,07,326 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 55 శాతం వృద్ధి. దీంతో... 2024లో నాలుగో స్థానంలో ఉన్న Thar కుటుంబం, 2025లో రెండో స్థానానికి చేరుకుంది. ఇందులో Thar Roxx వాటా సుమారు 65 శాతంగా అంచనా.

ఎలక్ట్రిక్‌ SUVలతో అదనపు బలంమహీంద్రా కొత్త ఎలక్ట్రిక్‌ SUVలు కూడా వృద్ధికి తోడ్పడ్డాయి. BE 6, XEV 9e, తాజాగా వచ్చిన XEV9s కలిపి 38,841 యూనిట్లు నమోదు చేశాయి. ఇది మొత్తం అమ్మకాలలో 7 శాతం వాటా. ఈ ఎలక్ట్రిక్‌ మోడళ్లు మహీంద్రా పోర్ట్‌ఫోలియోను మరింత బలపరిచాయి.

మొత్తానికి, 2025 మహీంద్రాకు SUV ఆధారిత వ్యూహం ఎంత బలమైనదో స్పష్టంగా చూపించింది. పల్లె నుంచి పట్నం వరకు, డీజిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వరకు విస్తరించిన మోడళ్ల రేంజ్‌తో మహీంద్రా భారత కార్‌ మార్కెట్‌లో కొత్త పవర్‌గా నిలిచింది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.