Mahindra Offer: ప్రముఖ డొమెస్టిక్ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా, తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'బీఈ 6' (BE 6) బ్యాట్‌మాన్ ఎడిషన్ విషయంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేవలం 999 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పి, రెండో బ్యాచ్‌ను కూడా మార్కెట్లోకి వదలడంతో పాత కస్టమర్ల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, తమ కారు కొనుగోలు పట్ల అసంతృప్తిగా ఉన్న యజమానుల నుండి వాహనాలను తిరిగి కొనుగోలు (Buy-Back) చేస్తామని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

Continues below advertisement

అస‌లేమైందంటే..?

మహీంద్రా గతేడాది ఆగస్టులో బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌ను 'లిమిటెడ్ రన్' మోడల్‌గా లాంచ్ చేసింది. అప్పట్లో కేవలం 999 యూనిట్లు మాత్రమే తయారు చేస్తామని ప్రకటించడంతో, బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. అయితే, సరిగ్గా ఏడు నెలల తర్వాత అంటే 2026 మార్చి 6న, మళ్లీ మరో 999 యూనిట్లతో రెండో బ్యాచ్‌ను కంపెనీ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ కన్నా ధర రూ. 70,000 పెంచినప్పటికీ, ఇవి కూడా కేవలం ఏడు నిమిషాల్లోనే బుక్ అయ్యాయి. కానీ, 'లిమిటెడ్ ఎడిషన్' అని నమ్మి కొన్న పాత కస్టమర్లు తమ కారు వాల్యూ తగ్గిపోయిందని భావించి సోషల్ మీడియాలో కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బై-బ్యాక్ ఆఫర్ నిబంధనలు

కస్టమర్ల నుండి వచ్చిన వ్యతిరేకతను గమనించిన మహీంద్రా యాజమాన్యం, మార్చి 18 నుండి 30 రోజుల పాటు బై-బ్యాక్ విండోను ఓపెన్ చేస్తోంది. తమ కారును తిరిగి ఇచ్చేయాలనుకునే యజమానులు సంబంధిత డీలర్‌షిప్‌ను సంప్రదించి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ స్పెషల్ ఎడిషన్ బీఈ 6 లోని 'ప్యాక్ త్రీ' (Pack Three) వేరియంట్ ఆధారంగా రూపొందింది. కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఈ అసామ‌న్య‌మైన‌ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Continues below advertisement

ఇదే తొలిసారి..!

సాధారణంగా లిమిటెడ్ ఎడిషన్ కార్లకు ఉండే క్రేజ్ వాటి అరుదైన లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. మహీంద్రా రెండో బ్యాచ్ తీసుకురావడంతో ఆ ప్రత్యేకత దెబ్బతిందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక బ్రాండ్‌గా కస్టమర్లతో ఉన్న సంబంధాన్ని దెబ్బతినకుండా చూసుకోవడానికి ఈ బై-బ్యాక్ ఆఫర్ ఒక సాహసోపేతమైన అడుగుగా అభివ‌ర్ణిస్తున్నారు. ఇప్పటివరకు భారత ఆటోమొబైల్ హిస్టరీలో ఒక కంపెనీ ఇలాంటి కారణంతో కార్లను తిరిగి కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.