KTM 390 Adventure Bike Price: అడ్వెంచర్ టూరింగ్ బైక్ కొనాలనుకునే రైడర్ల లిస్ట్‌లో KTM 390 Adventure పేరు ఎప్పుడూ ముందుంటుంది. శక్తిమంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ఆఫ్‌రోడ్ సామర్థ్యం – ఇవన్నీ కలిపి ఇది తన సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇటీవల GST సవరణల తర్వాత ధర కొంచెం పెరిగినా, ఇప్పటికీ ఈ బైక్‌పై ఆసక్తి తగ్గలేదు. అయితే కొనే ముందు కొన్ని కీలక విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే KTM 390 Adventure గురించి ఎక్కువగా అడిగే 5 ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.
1. KTM 390 Adventure ఇంజిన్ పవర్ ఎంత?
KTM 390 Adventureలో 399cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజిన్ KTM 390 Duke, 390 Enduro మోడళ్లలో కూడా ఉంది. ఈ ఇంజిన్ 8,500rpm వద్ద 46hp పవర్‌ను, 6,500rpm వద్ద 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైవే క్రూజింగ్ అయినా, ఆఫ్‌రోడ్ రైడింగ్ అయినా ఈ ఇంజిన్ ఎప్పుడూ ఉత్సాహంగా స్పందిస్తుంది. ముఖ్యంగా ఓవర్‌టేకింగ్ సమయంలో, లోడ్‌తో ప్రయాణిస్తున్నప్పటికీ పవర్ తక్కువ అనిపించదు.
2. KTM 390 Adventure సీట్ హైట్ ఎంత?
ఈ బైక్ 830mm సీట్ హైట్‌తో వచ్చింది. అంటే, ఇది కొంచెం ఎత్తైన బైక్ అన్నమాట. 5.7 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు ఈ బండిపై ఎక్కితే, సిటీ ట్రాఫిక్‌లో కాళ్లు పూర్తిగా నేలపై పెట్టడం కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. అయితే అడ్వెంచర్ బైక్‌లకు ఇది సాధారణమే. హైవేలు, లాంగ్ రైడ్స్‌లో ఈ ఎత్తు పెద్ద సమస్యగా అనిపించదు.
3. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, మైలేజ్ ఎంత?
KTM 390 Adventureలో 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఎక్స్‌పర్ట్‌లు చేసిన రియల్ వరల్డ్ టెస్టుల్లో ఈ బైక్ సిటీలో లీటర్‌కు 26.94 కిలోమీటర్లు , హైవే మీద లీటర్‌కు 35.5 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చింది. దీని ఆధారంగా చూస్తే, ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 400 నుంచి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ సాధించవచ్చు. లాంగ్ టూరింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
4. గ్రౌండ్ క్లియరెన్స్, సస్పెన్షన్ ట్రావెల్ ఎంత?
KTM 390 Adventureలో...
237mm గ్రౌండ్ క్లియరెన్స్
ముందు సస్పెన్షన్ ట్రావెల్ – 200mm
వెనుక సస్పెన్షన్ ట్రావెల్ – 205mm
బ్యాడ్ రోడ్స్, గుంతలు, రఫ్ ట్రాక్స్ వంటివి ఏవీ ఈ బైక్‌కు పెద్దగా ఇబ్బంది కావు. మోస్తరు ఆఫ్‌రోడ్ సెక్షన్లలో కూడా ఇది ధైర్యంగా దూసుకుపోతుంది.
5. KTM 390 Adventure ధర ఎంత? (AP & Telangana)
ఎక్స్-షోరూమ్ ధర (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) - ₹3.95 లక్షలు
విజయవాడలో ఆన్‌రోడ్ ధర
RTO: ₹48,888
ఇన్సూరెన్స్ (Comprehensive): ₹24,030
ఆన్‌రోడ్ ధర: ₹4,67,814
హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ ధర: ₹3.95 లక్షలు
ఇన్సూరెన్స్ (Zero Depreciation): ₹26,464
RTO & ఇతర చార్జీలు: ₹74,992
ఎక్స్‌టెండెడ్ వారంటీ: ₹2,599
AMC: ₹2,199
స్టాండర్డ్ యాక్సెసరీస్: ₹1,450
ఆన్‌రోడ్ ధర: ₹5,02,075
ముగింపు
KTM 390 Adventure అనేది కేవలం సిటీ బైక్ కాదు. ఇది నిజమైన అడ్వెంచర్ టూరింగ్ మెషీన్. పవర్, సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్, రేంజ్ అన్నింట్లో బ్యాలెన్స్ కావాలనుకునే రైడర్లకు ఇది సరైన ఎంపిక. అయితే సీట్ హైట్, ధర అంశాలను ముందే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మరింత సంతృప్తికరంగా ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.