Kia Syros vs Kia Sonet Mileage Review: కియా ఇండియా మార్కెట్‌లో రెండు డీజిల్ కంపాక్ట్ SUVలను విక్రయిస్తోంది, అవి - కియా సైరోస్ & కియా సోనెట్. ఈ రెండు మోడళ్లలో ఒకేలాంటి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (114 bhp, 250 Nm) & 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండింటికీ ARAI మైలేజ్ రేటింగ్ వేరు. సోనెట్ 18.6 కి.మీ./లీటర్ (Kia Sonet Diesel Mileage) ఇస్తే, సైరోస్ 17.65 కి.మీ./లీటర్‌కి (Kia Syros Diesel Mileage) మాత్రమే రేటింగ్ పొందింది.
ARAI రేటింగ్‌లో ఈ తేడా ఎందుకు?
సైరోస్ కొత్త మోడల్ అయినప్పటికీ, సోనెట్ కంటే దాదాపు 95 కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది. సోనెట్‌తో పోలిస్తే సైరోస్ మైలేజ్ కొంచెం తక్కువగా నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. మరోవైపు, సైరోస్ ఎక్కువ సౌకర్యాన్ని (ప్రత్యేకంగా వెనుక సీటు కంఫర్ట్) ప్రాధాన్యంగా చూసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
రియల్ వరల్డ్ మైలేజ్ ఫలితాలు
నవీ ముంబై పరిసరాల్లో కియా సైరస్ & కియా సోనెట్ రెండింటినీ సమాన పరిస్థితుల్లో పరీక్షించారు. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్ మాత్రమే ఉండగా, ఎయిర్ కండిషనింగ్, ఆడియో సిస్టమ్, వైపర్స్ వంటి అన్ని సాధారణ ఫీచర్లు ఆన్‌లోనే ఉంచి టెస్ట్ చేశారు.
ఫలితాలు ఇలా వచ్చాయి:
సిటీ టెస్ట్‌లో: సోనెట్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ఒక లీటర్‌తో సైరస్ కంటే 3 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించింది.
హైవే టెస్ట్‌లో: ఇక్కడ కూడా సోనెట్ ముందంజలో నిలిచింది, ఈసారి 5.2 కి.మీ. తేడా.
మొత్తం కలిపి (సగటున) చూసుకుంటే, సోనెట్ రియల్ వరల్డ్ మైలేజ్ సైరస్ కంటే 4.1 కి.మీ./లీటర్ ఎక్కువగా నమోదైంది.
ఈ లెక్క ప్రకారం, కియా సోనెట్ తన 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో, సైరోస్ కంటే దాదాపు 185 కి.మీ. (45 x 4.1) ఎక్కువ దూరం ప్రయాణించగలదు. డీజిల్ వాహనం కొనుగోలు చేయదలచిన వారికి ఇది ఒక కీలక నిర్ణయాంశం.
టెస్టింగ్ విధానం
ఈ పరీక్షల్లో, ఎక్స్‌పర్ట్స్, కియా వాహనాల ట్యాంకులు పూర్తిగా నింపి, కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్ పాటించి డ్రైవింగ్ చేశారు. నగర, హైవే మార్గాల్లో సగటు వేగంతో ప్రయాణం జరిగింది. సరైన లెక్క కోసం, మళ్లీ ఆయా కార్ల ట్యాంక్‌లను ఫుల్‌గా నింపి ఇంధన వినియోగాన్ని మరోమారు లెక్కించారు.
తేలిన విషయం
కియా సోనెట్ ARAI రేటింగ్ కంటే రియల్ వరల్డ్ మైలేజ్ సుమారు 2.3 కి.మీ. తక్కువగా ఉంది. కియా సైరోస్ విషయంలో తేడా మరింత ఎక్కువగా ఉంది, ఇది 5.45 కి.మీ. తక్కువగా వచ్చింది.
కియా సైరోస్ సౌకర్యం, ప్రీమియం ఫీల్ అందించడంలో ముందుంటే.. సోనెట్ మాత్రం మైలేజ్ పరంగా గెలిచింది. కాబట్టి ఎవరికి ఏ ప్రాధాన్యం ఉందో, ఆ ప్రకారం కారును కొనుగోలు చేయవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.