Kia Syros EV Price, Range And Features: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీని మరింత రసవత్తరంగా మార్చేందుకు, కియా తన కొత్త సైరస్ EV ని ఈ నెలాఖరులో విడుదల చేయనుంది. ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభించిందీ కంపెనీ. ఈ మోడల్‌ను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఎక్స్‌షోరూమ్ ధరలో తీసుకురానున్నట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దీని అంచనా ఆన్‌రోడ్ ధర రూ.15.90 లక్షల నుంచి రూ.19.61 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
5 ట్రిమ్‌లు - 7 వేరియంట్లుకియా సైరస్ EV మొత్తం ఐదు ట్రిమ్‌లలో ఏడు వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో 42kWh & 51.4kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ HTK వేరియంట్‌లో కేవలం 42kWh బ్యాటరీ మాత్రమే లభిస్తే, HTK+ & HTX వేరియంట్లలో ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లూ ఉంటాయి. టాప్ HTX+ & X-Line వేరియంట్లను మాత్రం 51.4kWh బ్యాటరీతో మాత్రమే సేల్ చేస్తారు.
42kWh బ్యాటరీతో వచ్చే మోడల్‌లో 135hp శక్తిని ఉత్పత్తి చేసే ఫ్రంట్ మోటార్ ఉంటుంది. 51.4kWh వెర్షన్‌లో 171hp పవర్ అందుతుంది. రెండు మోడళ్లలోనూ 255Nm టార్క్ ఒకే విధంగా ఉంటుంది. పెద్ద బ్యాటరీతో (51.4kWh) వచ్చే మోడల్ 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 8.1 సెకన్లలో అందుకోగలదని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: టాటా బెస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ - ప్లస్‌లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి, ఆలోచించండి
రేంజ్‌రేంజ్ విషయంలో కూడా కియా సైరస్ EV ఆకట్టుకుంటోంది. 42kWh బ్యాటరీని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 443 km వరకు ప్రయాణించవచ్చని ARAI ధ్రువీకరించింది. 51.4kWh బ్యాటరీతో ఈ రేంజ్ 526 km వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ విభాగంలోనే అతి పెద్ద బ్యాటరీ ప్యాక్, అత్యధిక రేంజ్ & పవర్‌ఫుల్ మోటార్ కలిగిన మోడల్‌గా కియా సైరస్ EV నిలుస్తోంది.
ఛార్జింగ్ పరంగా, ఈ రెండు బ్యాటరీలు 11kW AC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. అలాగే 100kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. 42kWh బ్యాటరీ 10 నుంచి 80 శాతం వరకు సుమారు నాలుగు గంటల్లో ఛార్జ్ అవుతుంది. 51.4kWh బ్యాటరీకి మరో 50 నిమిషాలు అదనంగా పడుతుంది. అయితే 100kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో రెండు బ్యాటరీలు కూడా కేవలం 39 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతాయని కంపెనీ వెల్లడించింది.
రంగులుఈ ఎలక్ట్రిక్ SUV మొత్తం 9 మోనోటోన్ ఎక్స్‌టీరియర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది, అవి - ఫ్రాస్ట్ బ్లూ, గ్రావిటీ గ్రే, మాగ్మా రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్, ఐవరీ సిల్వర్ మ్యాట్, ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్ & ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్. X-Line ట్రిమ్ మాత్రం అరోరా బ్లాక్ పెర్ల్ & ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ రంగుల్లో మాత్రమే లభిస్తుంది.
ఇది కూడా చదవండి: హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్?
భద్రత కియా సైరస్ EVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, TPMS, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలోనే స్టాండర్డ్‌గా అందించబడుతున్నాయి.
ట్రిమ్ వారీగా ఫీచర్లు
బేస్ HTK నుంచే LED లైట్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ Android Auto & Apple CarPlay, డ్రైవ్ మోడ్స్, USB Type-C పోర్టులు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
HTK+ వేరియంట్‌లో... HTKలో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు రియర్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ అదనంగా యాడ్ అవుతాయి.
HTXలో... HTK+లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, స్లైడింగ్ & రిక్లైనింగ్ రియర్ సీట్లు, OTA అప్‌డేట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభిస్తాయి.
HTX+ వేరియంట్‌లో.. పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ & రియర్ సీట్లు, 8 స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 4-వే పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యుయల్ డ్యాష్ క్యామ్, బ్యాటరీ హీటింగ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
టాప్ X-Line వేరియంట్‌లో Level-2 ADAS, V2L ఫంక్షన్, డిజిటల్ కీ, 64 రంగుల అంబియంట్ లైటింగ్, లోగో ప్రొజెక్షన్‌తో పడిల్ ల్యాంప్స్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
Tata Nexon EV & Mahindra XUV 3XO EVలకు గట్టి పోటీగా కియా సైరస్ EV నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ రేంజ్, పెద్ద బ్యాటరీ, ఆధునిక భద్రత ఫీచర్లు & ప్రీమియం టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ SUV కొనుగోలుదార్ల దృష్టిని ఆకర్షించే అవకాశముంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
