Kia Mahindra Electric Cars Comparison: మన మార్కెట్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్‌ కార్ల ఆప్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ అవసరాల కోసం 7 సీటర్‌ ఎలక్ట్రిక్‌ కారు కోరుకునే వారికి ప్రస్తుతం రెండు ప్రధాన ఆప్షన్లు ఉన్నాయి. అవే కియా కారెన్స్ క్లావిస్ EV, తాజాగా లాంచ్‌ అయిన మహీంద్రా XEV 9S. రెండూ లాంగ్‌ రేంజ్‌ బ్యాటరీ ఆప్షన్లతో వచ్చాయి. ధరల్లోనూ కొంత ఓవర్‌ల్యాప్‌ ఉంది. మరి, ఏది డబ్బుకు సరైన విలువ ఇస్తుందో తెలుసుకుందాం.

Continues below advertisement

డిజైన్‌, ఇంజినీరింగ్‌

ఈ రెండు కార్లు పూర్తిగా భిన్నమైన దారిలో రూపొందాయి. మహీంద్రా XEV 9S పూర్తిగా SUV తరహాలో కనిపిస్తుంది. ఫ్రంట్‌లో బ్లాంక్‌డ్‌ నోస్‌, భారీ LED DRLs‌తో ఇది భవిష్యత్‌ వాహనంలా కనిపిస్తుంది. XUV700తో ఒకే ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తయారైనప్పటికీ, డిజైన్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బ్లాక్‌డ్‌ అవుట్‌ టెయిల్‌గేట్‌, ప్రత్యేకమైన LED టెయిల్‌ ల్యాంప్స్‌, ఎరోడైనమిక్‌ అలాయ్‌ వీల్స్‌ దీనికి గట్టి SUV లుక్‌ ఇస్తాయి.

Continues below advertisement

కియా కారెన్స్ క్లావిస్ EV మాత్రం MPV స్టైల్‌కే కట్టుబడి ఉంటుంది. ICE కారెన్స్‌తో పోలిస్తే, గ్రీన్‌ నంబర్‌ ప్లేట్లు, గ్రిల్‌ పైన లైట్‌ బార్‌, సెంటర్‌లో ఛార్జింగ్‌ ఫ్లాప్‌, కొత్త బంపర్‌, ఐస్‌ క్యూబ్‌ స్టైల్‌ ఫాగ్‌ ల్యాంప్స్‌ లాంటి EV స్పెషల్‌ మార్పులు కనిపిస్తాయి. మొత్తం మీద XEV 9S ఒక మోడ్రన్‌ SUVలా కనిపిస్తే, క్లావిస్ EV మాత్రం పూర్తిగా MPV ఫీలింగ్‌ ఇస్తుంది.

సైజ్‌ పరంగా చూస్తే, XEV 9S పొడవు, వెడల్పు, ఎత్తులో క్లావిస్ EV కంటే పెద్దది. అయితే క్లావిస్ EVకి 18 మిల్లీమీటర్లు ఎక్కువ వీల్‌బేస్‌ ఉండటం వల్ల లోపల స్పేస్‌ బాగా ఉపయోగపడుతుంది.

ఇంటీరియర్‌, కంఫర్ట్‌

XEV 9Sలో ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌ వెంటనే ఆకట్టుకుంటుంది. బేజ్‌ లెదరెట్‌ సీట్లు, సాఫ్ట్‌ టచ్‌ మెటీరియల్స్‌, పియానో బ్లాక్‌ ఫినిష్‌ క్యాబిన్‌కు ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. అయితే యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. కొన్ని ఫంక్షన్లు లోతైన మెనూల్లో దాగి ఉంటాయి.

కంఫర్ట్‌ విషయంలో మాత్రం XEV 9S బాగా మార్కులు కొట్టేస్తుంది. ఫ్రంట్‌ సీట్లు వెడల్పుగా, సపోర్టివ్‌గా ఉంటాయి. మిడిల్‌ రో ఫ్లాట్‌ ఫ్లోర్‌తో చాలా విశాలంగా ఉంటుంది. స్లైడింగ్‌ ఫంక్షన్‌ ఉండటం వల్ల రెండో లేదా మూడో వరుసకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

కియా కారెన్స్ క్లావిస్ EV ఇంటీరియర్‌ మాత్రం సింపుల్‌, యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫిజికల్‌ బటన్‌లు, నాబ్స్‌ ఉండటం వల్ల డ్రైవింగ్‌లో వాడటం సులభం. రెండో వరుస సీట్లు ఎక్కువ రీక్లైన్‌ యాంగిల్‌తో చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. మూడో వరుసలో కూడా పొడవాటి వాళ్లు కూర్చోవచ్చు అనిపించేంత స్పేస్‌ ఉంది. ఈ విషయంలో క్లావిస్ EV స్పష్టంగా ముందుంది.

ఫీచర్లు, భద్రత

రెండూ 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESP, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, ప్యానోరమిక్‌ సన్‌రూఫ్‌, డిజిటల్‌ క్లస్టర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, TPMS లాంటి కీలక భద్రతా ఫీచర్స్‌తో వచ్చాయి.XEV 9Sలో వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay, ప్యాసింజర్‌ స్క్రీన్‌, హర్మన్‌ కార్డన్‌ ఆడియో సిస్టమ్‌ ప్రత్యేక ఆకర్షణ.క్లావిస్ EVలో ఎలక్ట్రిక్‌ ఫోల్డింగ్‌ మిర్రర్స్‌, అంబియంట్‌ లైటింగ్‌, వన్‌ టచ్‌ పవర్‌ విండోస్‌ లాంటి ఉపయోగకరమైన ఫీచర్స్‌ ఉంటాయి.

పెర్ఫార్మెన్స్‌, రేంజ్‌

XEV 9Sలో 79kWh బ్యాటరీ, రియర్‌ వీల్‌ డ్రైవ్‌ మోటార్‌ ఉంటుంది. 286hp పవర్‌తో ఇది చాలా వేగంగా స్పందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 477 కి.మీ. రియల్‌ వరల్డ్‌ రేంజ్‌ ఇస్తుంది.క్లావిస్ EVలో 51.4kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది కానీ రేంజ్‌ సుమారు 364 కి.మీ. వరకు మాత్రమే ఉంటుంది.

తుది తీర్పు

కుటుంబ అవసరాలు, మూడో వరుస సౌకర్యం, సింపుల్‌ యూజర్‌ అనుభవం కోరుకునే వారికి కియా కారెన్స్ క్లావిస్ EV మంచి ఎంపికగా నిలుస్తుంది.ఎక్కువ రేంజ్‌, పవర్‌, SUV లుక్‌, కొత్త టెక్నాలజీ అనుభవం కావాలంటే మహీంద్రా XEV 9S మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.