FASTag Rules India :జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ట్యాగ్ అంటించకపోయినా, రోడ్డు పనులు జరుగుతున్నా టోల్ ధరల్లో మార్పులు ఉంటాయి. ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు గమనించాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలివే.
ఇండియాలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ఇప్పుడు అనివార్యంగా మారింది. ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) సాంకేతికతతో పనిచేసే ఈ ట్యాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. టోల్ ప్లాజా మీదుగా వాహనం వెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా అమౌంట్ కట్ అవుతుంది. ప్రతి లావాదేవీకి సంబంధించి మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. అయితే చాలా మందికి తెలియని కొన్ని కీలక నిబంధనల గురించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) క్లారిటీ ఇచ్చింది.
విండ్‌స్క్రీన్‌కు ట్యాగ్ అంటించకపోతే రెట్టింపు ఫీజు
చాలామంది ఫాస్ట్‌ట్యాగ్‌ను కారు ముందు అద్దానికి అంటించకుండా చేతితో చూపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద స్కానింగ్ ఆలస్యమవుతుంది. దీనిని అరికట్టేందుకు NHAI కఠిన నిబంధన తెచ్చింది. వాహనం లోపలి వైపు నుంచి అద్దానికి ట్యాగ్‌ను సరిగ్గా అంటించకపోతే, ఆ వాహనం నుంచి రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిబంధన వల్ల ఇతర వాహనదారులకు అనవసరమైన ఆలస్యం కలగకుండా ఉంటుంది.
నిర్మాణ సమయంలో సగం టోల్ మాత్రమే
జాతీయ రహదారులపై మరమ్మతులు లేదా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ గుర్తించింది. రహదారిని నాలుగు లేదా ఆరు లేన్లుగా మార్చే పనులు సాగుతున్న సమయంలో, పాత టోల్ ధరలో కేవలం 50 శాతం మాత్రమే వసూలు చేయాలి. ఉదాహరణకు అక్కడ టోల్ ధర రూ.50 ఉంటే, నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు రూ.25 చెల్లిస్తే సరిపోతుంది.
యూపీఐ చెల్లింపులపై డిస్కౌంట్
ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ లేన్‌లోకి ప్రవేశించే వాహనాలకు నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు ధర వసూలు చేస్తారు. ఒకవేళ వాహనదారులు యూపీఐ (UPI) ద్వారా చెల్లించాలని భావిస్తే, అప్పుడు వర్తించే ఫీజులో 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక సదుపాయం
ప్రయాణంలో తలెత్తే సమస్యలు లేదా ఫిర్యాదుల కోసం వాహనదారులు 1033 హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయవచ్చు. అలాగే 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ ప్రయాణీకులకు డిజిటల్ తోడుగా నిలుస్తుంది. ఇందులో రహదారి వివరాలు, సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, వాతావరణ సమాచారం వంటి వివరాలు లభిస్తాయి. రహదారి భద్రత, పారదర్శకత కోసం ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం అవసరం.
