Kawasaki Z300 launched: కవాసాకి కంపెనీ భారత మార్కెట్లో తన Z సిరీస్‌కు చెందిన Z300 బైక్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.3.24 లక్షలుగా నిర్ణయించింది. స్పోర్టీ డిజైన్, పవర్‌ఫుల్‌ ట్విన్ సిలిండర్ ఇంజిన్, మోడ్రన్‌ ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్.. ప్రీమియం బైక్‌లను కోరుకునేవారికి మరో ఆప్షన్‌గా నిలవనుంది. Ninja 300 ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌లో Z900 డిజైన్ లక్షణాలను కూడా చూడొచ్చు.

Continues below advertisement

296cc ఇంజిన్.. 39hp పవర్

కవాసాకి Z300లో 296cc లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇదే ఇంజిన్‌ను నింజా 300లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 11,000rpm వద్ద 39hp గరిష్ఠ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 10,000rpm వద్ద 26.1Nm టార్క్‌ను అందిస్తుంది.

Continues below advertisement

ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. రెండు సిలిండర్లతో కూడిన ఇంజిన్ కావడంతో ప్రయాణ సమయంలో సున్నితమైన పనితీరును అందించే అవకాశం ఉంది. అయితే, వాస్తవ రోడ్లపై ఇంజిన్ పనితీరు ఎలా ఉంటుందనేది రైడింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

Z900 తరహా డిజైన్

Z300లో ప్రధాన ఆకర్షణ దాని డిజైన్. కవాసాకి పెద్ద బైక్ అయిన Z900 నుంచి స్ఫూర్తి పొందిన ‘సుగోమి’ స్టైల్‌ను ఇందులో ఉపయోగించారు. షార్ప్‌ డిజైనింగ్‌, దూకుడుగా కనిపించే ముందు భాగం, కండలు తిరిగినట్లుగా కనిపించే మస్క్యులర్‌ బాడీ డిజైన్ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. స్ట్రీట్‌ఫైటర్ శైలికి అనుగుణంగా వెడల్పైన, నిటారుగా ఉండే సింగిల్ పీస్ హ్యాండిల్‌బార్‌ను అందించారు. రైడర్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూర్చునే భంగిమను రూపొందించారు. నగర ప్రయాణాలతో పాటు స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడేవారిని ఆకట్టుకునేలా దీని రూపకల్పన ఉంది.

ఇది కూడా చదవండి: హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!

ఆధునిక ఫీచర్లు

ఈ బైక్‌లో రివర్స్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇది నింజా 500లోని డిస్‌ప్లే తరహాలో ఉంటుంది. బైక్‌కు డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు చక్రాలు లాక్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో ABS సహాయపడుతుంది.

కవాసాకి Z300ను లైమ్ గ్రీన్, బ్లాక్ అనే రెండు రంగుల్లో అందిస్తున్నారు. ఈ రంగులు బైక్ స్పోర్టీ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి.

ఫ్రేమ్, సస్పెన్షన్ వివరాలు

Z300లో నింజా 300లో ఉపయోగించిన ట్యూబ్యులర్ ఫ్రేమ్‌నే కొనసాగించారు. ముందు భాగంలో 37mm టెలిస్కోపిక్ ఫోర్క్‌ను ఏర్పాటు చేశారు. వెనుకవైపు ప్రీలోడ్ సర్దుబాటు చేసుకునే మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు.

చక్రాలు, బ్రేకింగ్ వ్యవస్థ కూడా నింజా 300 నుంచి తీసుకున్నవే కావచ్చు. ఉంది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. ముందు భాగంలో 290mm పెటల్ డిస్క్, వెనుక భాగంలో 220mm పెటల్ డిస్క్ బ్రేకులు ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ వివరాలను కొనుగోలు చేసే ముందు అధికారిక స్పెసిఫికేషన్లతో నిర్ధారించుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: BMW F 450 RR వేరియంట్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? టాప్‌ మోడల్‌లో స్పెషల్‌ ఏంటి?

కేటీఎం, టీవీఎస్ బైక్‌లతో పోటీ

భారత మార్కెట్లో కవాసాకి Z300కు.. KTM 390 Duke, TVS Apache RTR 310 ప్రధాన ప్రత్యర్థులుగా నిలవనున్నాయి. కేటీఎం 390 డ్యూక్ ధర రూ.2.85 లక్షలు (ఎక్స్‌షోరూమ్) కాగా, టీవీఎస్ అపాచీ RTR 310 ధర రూ.2.30 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇవి రెండూ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే బైక్‌లు.

ఈ రెండు మోడళ్ల కంటే కవాసాకి Z300 ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ట్విన్ సిలిండర్ ఇంజిన్ దీని ప్రత్యేకత. ఇంజిన్ పనితీరులో సున్నితత్వాన్ని కోరుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపిక కావచ్చు. పైగా.. కేటీఎం, టీవీఎస్ బైక్‌లు స్పోర్టీ రైడింగ్‌కు అనుగుణమైన పెర్ఫార్మెన్స్‌ ఇస్తాయి, కవాసాకి మాత్రం స్మూత్‌ పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.