Kakinada News | మనం సాధారణంగా ఇళ్లల్లో ఎక్సాండబుల్‌ టేబుల్స్‌, ఛైర్స్‌, కాట్స్‌ చూస్తుంటాం కదా.. వీటి వినియోగం కూగా ఇటీవల కాలంలో బాగా పెరిగిందనే చెప్పవచ్చు.. ఎందుకుంటే ఇరుకు ఇళ్లల్లో ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.. కావాల్సినప్పుడు వాటిని విస్తరించుకోవచ్చు.. లేక పోతే మడిచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు.. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు ఓ ఆవిష్కణ చేశాడు.. ఇతని ఆలోచనకు ప్రధానంగా సామాజిక అవసరం కూడా ఉందని గ్రహించి ఆ దిశగా అడుగులు వేశాడు.. ఆ కుర్రాడే కాకినాడకు చెందిన సుధీర్‌..

సుధీర్‌ గ్రాడ్యుయేషన్‌(బీకాం) పూర్తిచేసినప్పటికీ ఇంజనీరింగ్‌ విభాగం అంటే అత్యంత ఆశక్తితో ఆరంగంలోనే ఏదో ఒకటి చేయాలని తన ఆలోచనతో తనకు మించిన వ్యయప్రయాసలతో చాలా వరకు అనుకున్న ఆవిష్కరణకు కొంత వరకు రూపాన్ని తేగలిగాడు.. తల్లిని కోల్పోయి తండ్రి సంరక్షణలో ఉన్న ఈ యువకుడు తనకు ఇంకొంత డబ్బు, టెక్నాలజీ తోడైతే పూర్తిగా తన ఆవిష్కరణ లక్ష్యాన్ని ఛేదిస్తానని చెబుతున్నాడు..  ఇంతకీ ఈ యువకుడు. ఆ ఆవిష్కరణ ఏంటో చూడాలంటూ ఈ స్టోరీ చదవాల్సిందే..ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇరుకు రోడ్లులోకి అంబులెన్స్‌లు, ఫైర్‌ వెహికల్స్‌(అగ్నిమాపక శకటం)లు చేరుకునేందుకు అనేక అవరోధాలు ఎదురవుతుంటాయి.. ఆ సమయంలో ఆ రోడ్డుకు దగ్గట్టుగా ఆ వెహికల్‌ అడ్జస్ట్‌ అవ్వగలిగితే... అదేవిధంగా ట్రాఫిక్‌లు జామ్‌ అయినప్పడు..పక్క సందులోనుంచి వెహికల్‌ వెళ్లిపోయేలా అడ్జస్ట్‌ అవ్వగలిగితే.. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ ఆవిష్కరణకు అడుగులు వేశాడు. 

వెల్డర్‌ దగ్గర పనిచేస్తూ..

తన ఆవిష్కరణ లక్ష్యాన్ని ఛేదించేందుకు సుధీర్‌ కాకినాడ మెయిన్‌రోడ్డు కు ఆనుకుని ఉన్న పోస్టాఫీసు సమీపంలో ఓ వెల్డర్‌ దగ్గర పనికి చేరాడు.. అతని వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తూనే తనకు కావాల్సిన రూపంలో ఓ వెహికల్‌ తయారు చేసేందుకు అతనిని ఒప్పించాడు.. తన ఆలోచనను విన్న అతను మొదట్లో పెద్దగా ఆసక్తి కనపరచకపోయినా ఆతరువాత మొత్తం మీద పనిప్రారంభించారు. ఇలా కావాల్సిన ఐరెన్‌ సామానులు, ఇతరాత్ర వస్తువులు అన్నీ కొనుగోలు చేసి మొత్తం మీద ఓ రూపానికి తీసుకువచ్చారు. పక్కనే ఉన్న టైర్లు షాపు యజమాని కూడా తనవంతు సహకారాన్ని అందించాడు.. మొత్తం మీద రూ.2.50 లక్షలు పైబడి ఖర్చు చేసి బ్యాటరీతో నడిచే ఈవీ అడ్జస్టబుల్‌ వెహికల్‌ను అయితే రూపకల్పన చేశాడు.

దానికదే అడ్జస్ట్‌ అయ్యేలా రూపకల్పన..

ఇరుకు సందుల్లో సైతం వెళ్లగలిగేలా తయారు చేసిన ఈ అడ్జస్ట్‌బుల్‌ వెహికల్‌కు మెల్చి జెదక్‌ (ఎమ్‌ జడ్‌) అనే పేరు పెట్టాడు. ఇది హిబ్రూ పదం అని తెలిపాడు. అదేవిధంగా కార్‌ విడ్త్‌ టూ బైక్‌ విడ్త్‌ ఎగైన్‌ బైక్‌ విడ్త్‌ టూ కార్‌ విడ్త్‌ అనే ట్యాగ్‌ లైన్‌కూడా ఈ వెహికల్‌పై రాశాడు. ముఖ్యంగా ఎక్సాండబుల్‌ ఛాసెస్‌ అనే విధానంలో ఇది పనిచేస్తుంది.. అయితే ఛాసెస్‌ విడ్త్‌ పెరిగేందుకు మానువల్‌గానే చేస్తున్నప్పటికీ కొంత సాంకేతికత తోడైతే చాలా సునాయాసంగా వెహికల్‌ ఛాస్‌ అంటూ టోటల్‌ వెహికల్‌ ఎక్సాండబుల్‌ అవుతుందంటున్నాడు సుధీర్‌.  ఈ వెహికల్‌ మినిమైజ్‌ అయినప్పుడు 3 అడుగులు వెడల్పులోకి వెళ్తుంది.. అదే వైశాల్యం పెంచినప్పుడు ఇంకో అడుగున్న పెరుగుతుందని చెబుతున్నాడు.

బైక్‌ సైజులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేలా.. అదే కారు సైజులోకి మారినప్పుడు నలుగురు వ్యక్తులు వెళ్లగలిగేలా సీట్లు కూడా మడుచుకునేలా రూపకల్పన చేశాడు.. ఇక ఈ వెహికల్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్‌ కాగా 48 వోల్ట్స్‌, 30 ఈహెచ్‌ బ్యాటరీ కెపాసిటీతో  ఇద్దరు కూర్చునప్పుడు 42 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో కదులుతుంది.. నలుగురు కూర్చున్నప్పుడు 35 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో నడుస్తుందని చెబుతున్నాడు ఈ వెహికల్‌ రూపకర్త సుధీర్‌. 

ఇంకా 26 ఆలోచనలు ఉన్నాయి..

ఈ వెహికల్‌ ఆవిష్కరణతో పాటు దేశ రక్షణ విభాగంలో ఉపయోగపడేవిధంగా మరికొన్ని తన వద్ద సరికొత్త ఆలోచనలు ఉన్నాయని, ఇలా మొత్తం 26 వరకు ఐడియాలు ఉన్నాయని సుధీర్‌ చెబుతున్నాడు. ప్రభుత్వం నుంచి, ఎవరైనా పారిశ్రామిక వేత్తలనుంచి తనకు అవకాశాలు వస్తే తన టాలెంట్‌ను నిరూపించుకోవడమే కాకుండా దేశానికి ఉపయోగపడే సరికొత్త ఆవిష్కరణలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తన ఈప్రయత్నంలో ఎన్నో విమర్శలు, అవహేళనలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తానని, పూర్తి ఆటోమెటిక్‌ వెహికల్‌గా మార్చేందుకు ఆర్ధీక ఇబ్బందులు వల్ల పూర్తిచేయలేకపోయానని చెబుతున్నాడు సుధీర్‌.