India's Auto Retail Hits All Time High Sales: ఇండియన్ ఆటో రిటైల్ రంగం గత ఆర్థిక సంవత్సరం లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 2,96,71,064 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 13.30 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. కేవలం రెండేళ్ల క్రితం వరకు మూడు కోట్ల మార్కు అనేది ఒక కలలా అనిపించినా, ఇప్పుడు ఆ మైలురాయికి అత్యంత చేరువలో నిలిచామని తెలుస్తోంది. మొత్తం ఆరు వాహన విభాగాలలో ఐదు విభాగాలు తమ వార్షిక రికార్డులను తిరగరాయడం ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
టు-వీలర్స్ కమ్‌బ్యాక్ - ప్యాసింజర్ వాహనాల జోరు..కోవిడ్ పూర్వపు పీక్ స్టేజ్‌ను టూ-వీలర్ విభాగం మళ్ళీ అందుకుందని తెలుస్తోంది. ఏకంగా 2.14 కోట్ల యూనిట్ల అమ్మకాలతో 13.40 శాతం వృద్ధి సాధించింది. జీఎస్టీ మార్పుల వల్ల ధరలు అందుబాటులోకి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత పెరగడం దీనికి ప్రధాన కారణాలు. ఇక ప్యాసింజర్ వాహనాల (PVs) విషయానికి వస్తే, చరిత్రలో మొదటిసారిగా 47 లక్షల మార్కును దాటాయి. కొత్త మోడళ్ల రాక, ఎస్‌యూవీల (SUVs) పట్ల ప్రజల్లో పెరిగిన క్రేజ్ ఈ వృద్ధికి ఊతమిచ్చాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రికార్డు సృష్టించిన ట్రాక్టర్లు - కమర్షియల్ వెహికల్స్..ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచిన విభాగం ట్రాక్టర్లు. మొదటిసారిగా 10 లక్షల యూనిట్ల రిటైల్ విక్రయాలతో 18.95 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మంచి రుతుపవనాలు, రబీ పంట సాగు పెరగడం వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం దీనికి నిదర్శనం. అలాగే కమర్షియల్ వాహనాలు (CVs) కూడా 10 లక్షల మార్కును దాటి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పెరగడం వల్ల సరుకు రవాణాకు డిమాండ్ పెరిగింది. త్రీ-వీలర్ విభాగంలో 60 శాతానికి పైగా ఎలక్ట్రిక్ వాహనాలే (EVs) ఉండటం విశేషం. కేవలం కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ విభాగం మాత్రం ప్రాజెక్టుల ఆలస్యం వల్ల 11.70 శాతం క్షీణించింది. లేకపోతే ఈ విభాగంలో కూడా గణనీయమైన పురోగతి ఉండే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జీఎస్టీ 2.0 మ్యాజిక్ - రూరల్ వర్సెస్ అర్బన్..సెప్టెంబర్ నెలలో అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. చిన్న కార్లు, మాస్ సెగ్మెంట్ టూ-వీలర్లపై పన్ను భారం తగ్గడం వల్ల సామాన్యులకు వాహనాలు కొనుగోలు చేయడం సులభమైంది. డిమాండ్ పరంగా చూస్తే, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ భారతంలో అమ్మకాలు వేగంగా పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో గ్రామీణ డిమాండ్ 17.12 శాతం ఉండగా, పట్టణాల్లో అది 10.43 శాతంగా నమోదైంది. ఈ ఏప్రిల్ నెలలో కూడా ఇదే జోరు కొనసాగుతుందని డీలర్లు ఆశిస్తున్నారు. సుమారు 50.56 శాతం మంది డీలర్లు అమ్మకాలు ఇంకా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, భారత్ ఇప్పుడు గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా మారుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
