Flex fuel cars in India: భారత్‌లో గత కొన్నేళ్లుగా "ఫ్లెక్స్ ఫ్యూయల్" (Flex Fuel) వాహనాలపై చర్చలు, చర్యలు వేగంగా సాగుతున్నాయి. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది.
ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏమిటి?
ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) అంటే... ఒకే వాహనం వివిధ రకాల పెట్రోల్-ఇథనాల్ మిశ్రమ ఇంధనాలపై నడిచే టెక్నాలజీ. సాధారణ కార్లు నిర్దిష్ట శాతం ఇథనాల్ కలిగిన ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించగలవు. కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్, E20, E85 లేదా ఇంకా ఎక్కువ ఇథనాల్ శాతం ఉన్న ఇంధనాలను కూడా ఆటోమేటిక్‌గా గుర్తించి వాటిపై పనిచేస్తాయి.
సింపుల్‌గా చెప్పాలంటే... మీరు కారులో ఏ ఇంధనం పోశారో ప్రత్యేకంగా సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం ఉండదు. వాహనంలోని సెన్సార్లు ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని గుర్తించి, ఇంజిన్ పనితీరును దానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తాయి.
E20, E85 అంటే ఏమిటి?
E20 = 20% ఇథనాల్ + 80% పెట్రోల్E85 = 85% ఇథనాల్ + 15% పెట్రోల్
భారత్‌లో తాజా పరిస్థితి
కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా "E20 ఇంధనం" అందుబాటులోకి తీసుకురావడంపై సీరియస్‌గా ఫోకస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక పెట్రోల్ బంకుల్లో E20 విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా E20 అనుకూల వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
టయోటా ముందంజ
భారత్‌లో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శించిన కంపెనీగా Toyota Kirloskar Motor నిలిచింది. ఈ కంపెనీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత Toyota Innova HyCross Flex Fuel*ప్రోటోటైప్‌ను కేంద్ర రవాణా శాఖ సమక్షంలో ప్రదర్శించింది.
ఇతర కంపెనీలు కూడా సిద్ధం
Maruti Suzuki, Hyundai Motor India, Tata Motors, Mahindra & Mahindra వంటి కంపెనీలు కూడా ఇథనాల్ అనుకూల ఇంజిన్ టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు E20 అనుకూల మోడళ్లను విక్రయిస్తున్నాయి.
ఫ్లెక్స్ ఫ్యూయల్ వల్ల ప్రయోజనాలు
* పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.* చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది.* కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుంది.* భవిష్యత్తులో ఇంధన ఖర్చు తగ్గే అవకాశం ఉంది.* దేశీయ ఇంధన భద్రత బలపడుతుంది.
సవాళ్లు కూడా ఉన్నాయి
* ఇథనాల్ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచాల్సి ఉంటుంది.* అన్ని ప్రాంతాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది.* ఇథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండటంతో వాహనాల మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది.* ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ అవసరం.
ముందున్న దారి
ప్రస్తుతం భారత మార్కెట్‌లో పూర్తి స్థాయి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు విస్తృతంగా అందుబాటులో లేకపోయినా, E20 అనుకూల వాహనాలు వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి ఇథనాల్ వినియోగాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు భారత రోడ్లపై భారీ స్థాయిలో కనిపించే అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్ మొత్తం ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్‌దే కావచ్చు!.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
