First E85 Fuel Station: భారత్‌ ఇంధన మార్కెట్‌లో సరికొత్త శకం మొదలైంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని పూసా రోడ్‌లో దేశంలోనే మొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. 

Continues below advertisement

అసలు ఏంటీ E85 ఫ్యాయల్

సాధారణంగా పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ ఇంధనం ఒక మిశ్రమం. E85 అంటే ఇందులో 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ప్రస్తుతం మనం వాడుతున్న E20 పెట్రోల్‌లో కేవలం 20 శాతం ఇథనాల్ మాత్రమే ఉంటుంది. ఇథనాల్ శాతం పెరగడం వల్ల ఇంధన ధర గణనీయంగా తగ్గుతోంది. 

Continues below advertisement

లీటర్‌కు 20 రూపాయలు ఆదా

ఈ సరికొత్త E85 ఇంధన ధరను లీటర్కు 82.12 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ20 పెట్రోల్‌ ధరలతో పోలిస్తే ఇది దాదాపు ఇరవై రూపాయలు తక్కువకు వస్తుంది. రోజువారి ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి, ముఖ్యంగా ట్యాక్సీలు, డెలివరీ వాహనదారులకు ఇది వరమని చెప్పవచ్చు. 

పాత వాహనాలకు పనికిరాదు 

మీ దగ్గర పాత పెట్రోల్ కారులో నేరుగా E85 ఇంధనాన్ని పోయలేరు దీని కోసం ప్రత్యేకమైన ఫ్లెక్స్‌ ఫ్యూయల్ ఇంజన్ అవసరం. E85 ఇంధనం వాడే కార్లలో ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంకులు, కొత్త రకమైన ఫ్యూయల్ లైన్లు, రీ ప్రోగ్రామ్ చేసిన ఎలక్ట్రానికి కంట్రోల్ యూనిట్‌ ఉండాలి. 

ఇథనాల్‌లో పెట్రోల్‌ కంటే తక్కువ శక్తి ఉంటుంది. దీని వల్ల కారు మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ కారణంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ధర సాధారణం కార్ల కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు. 

మారుతి ముందడుగు 

భారత్‌ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఇది కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంధన కేంద్రాల నెట్‌వర్క్ పెరిగిన తర్వాత సాధారణ ప్రజలకు విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

వాహనాన్ని ఎక్కువగా వాడే వారికి మాత్రమే E85కార్లు లాభసాటిగా ఉంటాయి. కారు కొనుగోలు చేసేటప్పుడు పెట్టే అదనపు ఖర్చును ప్రతి లీటరుపై ఆదా అయ్యే 20 రూపాయలతో భర్తీ చేసుకోవాలంటే నిరంతరం వినియోగం అవసరం తక్కువగా వాడే వారికి దీని వల్ల పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చు. బ్రెజిల్ వంటి దేశాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు చాలా పాపులర్. E85 వాడకం వల్ల కార్బన్ ఉద్గారాలు, కాలుష్యం తగ్గుతాయి.