Sugar Based Ethanol Ban: దేశంలో చక్కెర ధరలు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026-27 సరఫరా ఏడాదికి చక్కెర ఆధారిత ఇథనాల్‌ను కొనుగోలు టెండర్ నుంచి మినహాయించినట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. చెరకు రసం, చక్కెర, చక్కెర పాకం, బీ-హెవీ మొలాసిస్‌తో తయారయ్యే ఇథనాల్‌కు ఈసారి టెండర్లలో అవకాశం ఇవ్వలేదు. దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

చెరుకును ఇథనాల్ తయారీకి మళ్లించకుండా చూడాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం సూచించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. అయితే, ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక ప్రకటనల తర్వాతే నిర్ధారించుకోవాల్సి ఉంది.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ప్రభావం ఉంటుందా?

Continues below advertisement

భారత్ విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం ద్వారా దిగుమతి ఇంధన వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడం కూడా ఈ కార్యక్రమంలోని మరో ముఖ్య ఉద్దేశం.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను తప్పనిసరి చేశారు. ఇందులో గరిష్ఠంగా 20 శాతం ఇథనాల్ మిశ్రమం ఉంటుంది. అయితే, చక్కెర ఆధారిత ఇథనాల్‌కు బదులుగా మొక్కజొన్న, బియ్యం వంటి ముడి పదార్థాల వినియోగం పెరిగితే సరఫరా వ్యవస్థలో మార్పులు రావచ్చు.

ఇది కూడా చదవండి: Honda Festive Discounts: హోండా కార్లపై బిగ్‌ డీల్స్‌.. సిటీ, ఎలివేట్, అమేజ్ కొనేవాళ్లకు రూ.2.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!

పెట్రోల్ ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?

చెరుకును ఇథనాల్ తయారీకి మళ్లించకుండా నిషేధం విధించినప్పటికీ, కేవలం ఈ ఒక్క కారణంతోనే దేశీయ పెట్రోల్‌ ధరల్లో మార్పులు ఉండవు. దేశీయ కారణాల కంటే, అంతర్జాతీయ కారణాలే చమురు ధరలను అధికంగా ప్రభావితం చేస్తాయి. అంటే, అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి పెట్రోల్‌ &డీజిల్‌ ధరలు మారుతుంటాయి.

11 బిలియన్ లీటర్ల ఇథనాల్ కొనుగోలుకు టెండర్

2026 నవంబర్‌లో ప్రారంభమయ్యే సరఫరా ఏడాదికి మొత్తం 11 బిలియన్ లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేయాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు టెండర్ ప్రక్రియను చేపట్టినట్లు రాయిటర్స్ తెలిపింది.

ఈసారి మొక్కజొన్న, నూకలు, భారత ఆహార సంస్థ వద్ద ఉన్న మిగులు బియ్యంతో తయారుచేసిన ఇథనాల్‌కు బిడ్లు దాఖలు చేయవచ్చు. అంటే, చక్కెర ఆధారిత ఉత్పత్తికి బదులుగా ఇతర ముడి పదార్థాలతో ఇథనాల్ తయారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ కార్లపై దసరా ఆఫర్లు.. క్రెటా నుంచి గ్రాండ్ ఐ10 నియోస్ వరకు భారీ తగ్గింపులు!

మొక్కజొన్న ఇథనాల్ ధర కూడా తగ్గింపు

మొక్కజొన్నతో తయారుచేసే ఇథనాల్‌కు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని కూడా తగ్గించినట్లు నివేదిక వెల్లడించింది. గతంలో లీటరుకు రూ.5.79గా ఉన్న ప్రోత్సాహకాన్ని రూ.2.79కు తగ్గించారు. దీంతో కొనుగోలు ధర లీటరుకు రూ.71.86 నుంచి రూ.68.86కు పడిపోయింది. ఈ మార్పు ఇథనాల్ తయారీ సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మొక్కజొన్నను ముడి పదార్థంగా ఉపయోగించే సంస్థలు కొత్త ధరల ప్రకారం తమ ఉత్పత్తి ఖర్చులు, లాభాలను లెక్కించుకోవాల్సి ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.