Flex Fuel Bike:భారత్‌ ఇంధన మార్కెట్‌లో ఒక భారీ మార్పునకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం మన వాడుతున్న పెట్రోల్‌ ధరలతో పోలిస్తే, ఇథనాల్ ధర సామాన్యుడికి ఎంతో ఊరటనిచ్చేలా ఉంది. అందుకే మౌలిక సదుపాయాల విస్తరణ వేగవంతమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 5200 E85 బంకులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వాహనదారుల ఖర్చును తగ్గించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. 

Continues below advertisement

85 శాతం ఇథనాల్‌తో పెట్రోల్

ఇప్పటి వరకు మనం కేవలం పెట్రోల్ లేదా డీజిల్‌ వాహనాలపైనే ఆధారపడ్డాం. కానీ ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ కాలం మొదలైంది. ఫ్లెక్స్‌ ఫ్యూయల్ అంటే ఒకే ఇంజిన్‌తో పెట్రోల్, ఇథనాల్‌ మిశ్రమాలను వాడుకునే వెసులుబాటు, హీరో మోటోకార్ప్‌ దీనిని స్ప్లెండర్‌ ప్లస్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్ప్లెండర్‌ ప్లస్‌ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ మోడల్‌, 85 శాతం ఇథనాల్‌ కలిగిన ఇంధనంతో కూడా సునాయాసంగా నడుస్తోంది. 

లీటర్‌పై 20 రూపాయలు ఆదా

పెట్రోల్‌ ధరల సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ ఒక గొప్ప పరిష్కారంగా కనిపిస్తోంది. ఢిల్లీలో పెట్రోల్‌ ధర వంద దాటి ఉండగా, E85 ఇంధన ర కేవలం 82.12గా ఉంది. అంటే ప్రతి లీటరుకు రూ.20 వరకు ఆదా అవుతుంది. 

Continues below advertisement

కాలుష్యం 77 శాతం తగ్గుదల

మరో ప్రధాన కారణం పర్యావరణం. ఇథనాల్‌ వాడకం వల్ల కాలుష్య కారకాలు దాదాపు 77 శాతం వరకు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఇంధనం తయారవుతోంది. దీని వల్ల మన దేశ ముడి చమురు దిగుమతులు కూడా భారీగా తగ్గుతాయి.

జులై 26 నుంచి హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్

ఈ మార్పు ప్రక్రియ ఇప్పటికే వేగం పుంజుకుంది. హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌ జులై 26 నుంచి డెలివరీ కానుంది. దీనికి తగ్గట్టుగానే 5200 బంకుల ఏర్పాటు కార్యక్రమం త్వరలో వివిధ నగరాల్లో ప్రారంభకానుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు మొదటి పంప్‌ అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వీటి విస్తరణ మొదట జరగనుంది. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బలపడుతుంది. 

కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు తక్కువే 

సాధారణంగా బైక్‌లో కేవలం ఇథనాల్ పోస్తే ఇంజిన్ పాడవుతుంది. కానీ హీరో స్ప్లెండర్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కోసం ప్రత్యేక మార్పులు చేసింది. ఇంజిన్ లోపల ఉండే 36 విడిభాగాలను ఇథనాల్‌కు తట్టుకునేలా రీ డిజైన్ చేశారు. ఇందులో స్మార్ట్ ఈసీయూ టెక్నాలజీ అమర్చారు. మీరు ట్యాంక్‌లో పెట్రోల్ పోసినా లేదా ఇథనాల్ పోసినా, ఈ ఈసీయూ ఇంధన నాణ్యతను గుర్తించి పవర్‌ను అడ్జస్ట్ చేస్తుంది. మైలేజీ విషయంలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, ఇంధనం ధర తక్కువ కాబట్టి కిలోమీటర్లకు అయ్యే ఖర్చు పెట్రోల్‌ కంటే తక్కువే ఉంటుంది. 

భారత్ ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2026 నాటికి 20 శాతం మిశ్రమం లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. కానీ E85 టెక్నాలజీ అనేది దానికి ఒక మెట్టు పైస్థాయి. దీని కోసం హీరో మోటోకార్ప్‌ వంటి సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాయి. హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ ధర సాధారణ మోడ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఇది లాభదాయకం. భవిష్యత్‌లో కేవలం స్ప్లెండర్‌ మాత్రమే కాదు, ఇతర కమ్యూటర్‌ బైక్‌లు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.

సామాన్యుడికి ఎంత లాభం?

సామాన్యుడికి దీని వల్ల లాభమనే చెప్పాలి. పెట్రోల్ ధరలు అస్థిరంగా ఉన్న తరుణంలో, ఇథనాల్ స్థిరమైన ధరను అందిస్తుంది. ప్రతి రోజూ 50 కిలోమీటర్లు తిరిగే వ్యక్తికి కనీసం 300 రూపాయలు నుంచి 500 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.