Hyundai Creta Competition: మన మార్కెట్‌లో, కొన్ని కార్లు తమ బ్రాండ్‌ గుర్తింపును సైతం మించి ఎదుగుతాయి. టయోటాకు ఇన్నోవా ఎలా కీలకమో, హ్యుందాయ్‌కు క్రెటా కూడా అలాంటి మోడల్‌. గత కొన్నేళ్లుగా హ్యుందాయ్‌ విక్రయాల్లో క్రెటా కీలక పాత్ర పోషిస్తోంది. 2025లో హ్యుందాయ్‌ మొత్తం అమ్మకాలలో 35 శాతం పైగా వాటా క్రెటా నుంచే రావడం దీనికి నిదర్శనం. మిగతా అమ్మకాలను  8 మోడళ్లు పంచుకున్నాయి. ఇంతగా ఒకే మోడల్‌పై ఆధారపడినప్పుడు, ఆ మోడల్‌పై ఒత్తిడి పెరిగితే మొత్తం బ్రాండ్‌పై ప్రభావం పడటం సహజం. 2026లో అదే జరగబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Continues below advertisement

క్రెటా గతంలోనూ కాంపిటీషన్‌ను ఎదుర్కొంది. 2019లో Kia Seltos మార్కెట్‌లోకి వచ్చినప్పుడు కూడా క్రెటాకు సవాల్‌ ఎదురైంది. ఆ తర్వాత అదే క్లాస్‌లోకి ఇతర SUVలు వచ్చి చేరినా, క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. కానీ 2026 మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఈసారి ఒకటి కాదు, రెండు కాదు... దాదాపు ఆరు కొత్త లేదా అప్‌డేటెడ్‌ SUVలు క్రెటాకు ఎదురు నిలవబోతున్నాయి. పైగా ఈ ఒత్తిడి 2027 ఆరంభం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఆ సమయంలోనే కొత్త తరం క్రెటా రానుంది.

టాటా సియెర్రా - నోస్టాల్జియా ప్లస్‌ టెక్నాలజీ

Continues below advertisement

టాటా సియెర్రా పేరు వినగానే 90ల పిల్లలకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అదే నోస్టాల్జియాను క్యాష్‌ చేసుకుంటూ టాటా ఈ SUVను తిరిగి తీసుకొచ్చింది. ఇప్పటికే క్రెటాకు ప్రత్యర్థిగా టాటా కర్వ్‌ ఉన్నప్పటికీ, సియెర్రాది మాత్రం మరో లెవెల్‌. డిజైన్‌, ఫీచర్లు, క్యాబిన్‌ స్పేస్‌, ప్రాక్టికాలిటీ అన్నింటిలోనూ ఇది బలంగా కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో అత్యధిక ఫీచర్లున్న SUVలలో ఇది ఒకటిగా నిలుస్తోంది. బుకింగ్స్‌ సంఖ్యే దీనికి ఉన్న డిమాండ్‌ను ప్రదర్శింస్తోంది. దీని ధరలు మరింత అగ్రెసివ్‌గా ఉంటే, క్రెటాకు ఇది పెద్ద తలనొప్పిగా మారేది.

కొత్త Kia Seltos - క్రెటా కంటే పెద్దది

కొత్త తరం Kia Seltos క్రెటాతో ఫీచర్ల పరంగా సమానంగా ఉండటమే కాకుండా, సైజ్‌లో కూడా ఒక మెట్టు ముందుంది. ఇది పొడవుగా, వెడల్పుగా ఉండటంతో పాటు, వెనుక సీటు స్పేస్‌, బూట్‌ స్పేస్‌ కూడా ఎక్కువగా అందిస్తోంది. క్యాబిన్‌ ఫీల్‌ కూడా మరింత ప్రీమియంగా అనిపిస్తోంది. ముఖ్యంగా, ధరల విషయంలో Seltos ఎలాంటి అదనపు భారాన్ని మోపడం లేదు. కొన్ని వేరియంట్లలో అయితే క్రెటా కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఒకప్పుడు రైడ్‌ కంఫర్ట్‌ విషయంలో క్రెటాకు ఉన్న అడ్వాంటేజ్‌ ఇప్పుడు తగ్గిపోయింది.

రెనాల్ట్‌ డస్టర్‌, నిస్సాన్‌ సిబ్లింగ్‌

మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌ను 2012లో మొదలుపెట్టింది డస్టరే. అదే సెగ్మెంట్‌లో 2015 తర్వాత క్రెటా ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు ఏడేళ్ల విరామం తర్వాత కొత్త డస్టర్‌ తిరిగి వస్తోంది. ఈసారి ఇది పాత డస్టర్‌లా రఫ్‌గా కాకుండా, షార్ప్‌ డిజైన్‌, ఆధునిక ఫీచర్లతో వస్తోంది. 1.0 లీటర్‌, 1.3 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్లు, 160hp స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఆప్షన్‌ కూడా ఉండటం దీని బలంగా మారింది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిస్సాన్‌ నుంచి మరో SUV కూడా రానుంది. క్రెటాలో ప్రస్తుతం హైబ్రిడ్‌ ఆప్షన్‌ లేకపోవడం ఇక్కడ లోటుగా మారుతోంది.

స్కోడా కుషాక్‌, VW టైగన్‌ ఫేస్‌లిఫ్ట్‌లు

స్కోడా కుషాక్‌, వోక్స్‌వ్యాగన్‌ టైగన్‌ పెద్దగా క్రెటా అమ్మకాలపై ప్రభావం చూపవని అనిపించవచ్చు. కానీ 2026 మార్చిలో రానున్న ఫేస్‌లిఫ్ట్‌ మోడళ్లు కొత్త డిజైన్‌, మెరుగైన ఇంటీరియర్‌, అదనపు ఫీచర్లతో పలకరిస్తాయి. ఇవి, కొంతమంది ప్రీమియం డ్రైవింగ్‌ అనుభూతి కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

2026 - క్రెటాకు అసలైన పరీక్ష

ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సవాలును క్రెటా తట్టుకుని నిలబడింది. కానీ ఈసారి కాంపిటీషన్‌ స్కేల్‌ పూర్తిగా భిన్నంగా ఉంది. క్రెటా ఇప్పటికీ క్లాస్‌ లీడర్‌ కావొచ్చు. కానీ, హ్యుందాయ్‌ వ్యూహం ఎంత బలంగా ఉందో నిరూపించాల్సిన సంవత్సరం ఇదే. ఇంతటి ఒత్తిడిని క్రెటా ఎలా ఎదుర్కుంటుందో చూడటం కార్‌ ప్రేమికులకు ఆసక్తికరంగా మారింది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.