భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో EV వాహనాలు నగరాల్లో మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఈ వాహనాలు కనిపిస్తున్నాయి. దాంతో కంపెనీలు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తమ సత్తా చాటుతున్నాయి. ఇప్పటికీ EV వాహనాలు చాలా ఖరీదుగా ఉన్నాయి. కానీ బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్‌కి చెందిన టియాగో ఈవీ, ఎంజీ మోటార్స్ (MG Motors)కి చెందిన కామెట్ ఈవీ వంటి వాహనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఈ బడ్జెట్ EV స్పేస్‌లో సంచలనం సృష్టించడానికి దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ సిద్ధంగా ఉంది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన, ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి హ్యుందాయ్ ఏర్పాట్లు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టియాగో ఈవీ, కామెట్ వంటి వాహనాలకు పోటీ పెరుగుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో ఎప్పుడు రానుంది, దీని ఫీచర్లు ఇక్కడ తెలుసుకుందాం.
హ్యుందాయ్ కంపెనీ మాస్టర్‌ప్లాన్
మొదట హ్యుందాయ్ తన ఈ బడ్జెట్ EVను 2027 ప్రారంభంలో పరిచయం చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కంపెనీ వినియోగదారులను గుడ్ న్యూస్ చెబుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు 2026 చివరి నాటికే భారత మార్కెట్లో లాంచ్ కానుంది. భారత్‌లో తన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వాటాను పెంచడమే కంపెనీ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం దేశీయ స్థాయిలో లోకల్ బ్యాటరీ సప్లై చైన్‌ను బలోపేతం చేస్తున్నారు.
350+ KM తో అద్భుతమైన రేంజ్
హ్యుందాయ్ తన ఈ కొత్త కాంపాక్ట్ EVను రెండు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లతో లాంచ్ చేయనుంది. ఇందులో వినియోగదారులకు ఒక స్టాండర్డ్ రేంజ్, మరోటి లాంగ్ రేంజ్ ఆప్షన్ లభిస్తుంది. దీని లాంగ్-రేంజ్ వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 355 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ రేంజ్ లభిస్తే, ఈ కారు నగరంలోని రోజువారీ ప్రయాణాలకే కాదు, వీకెండ్‌లో సమీపంలోని స్పాట్ లకు సైతం నమ్మకమైన, టెన్షన్-ఫ్రీ ఎంపికగా నిలుస్తుంది.
ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్
ఇక హ్యుందాయ్ తన వాహనాల్లో ఎప్పటినుంచో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇస్తోంది. ఈ కాంపాక్ట్ కారులో తన నెక్స్ట్-జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కనిపిస్తుందని కంపెనీ స్పష్టంచేసింది. కేబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మోడ్రన్ ఫీచర్లు ఇవ్వవచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇందులో అనేక ఎయిర్‌బ్యాగ్స్, ABS, పార్కింగ్ కెమెరాల సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉంది.
మార్కెట్లో పోటీ పెరుగుతుంది
ప్రస్తుతం ఆటో సెక్టార్‌లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ కనిపిస్తోంది. టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే పట్టు సాధించాయి. హ్యుందాయ్ తన శక్తివంతమైన పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, తక్కువ ధరతో కొత్త మోడల్‌ను లాంచ్ చేస్తే కనుక విక్రయాల్లో తిరుగుండదు. మీరు కూడా కొత్త, తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, కొంతకాలం వేచి చూడక తప్పదు.
