మీరు ఒకవేళ Hyundai కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. ప్రముఖ కంపెనీ హ్యుందాయ్ తన అన్ని కార్ల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. మే 1, 2026 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ పెరుగుదల గరిష్టంగా 1 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే వేర్వేరు మోడళ్లు, వేరియంట్‌లను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీరు ఇప్పుడే కారును కొనుగోలు చేస్తే, పెరిగిన ధర అధిక ఛార్జీల నుంచి ఊరట పొందవచ్చు. ఏప్రిల్ నెలాఖరులోగా కారు కొనుగోలు చేస్తే మీకు కాస్త తక్కువ ధరకు లభిస్తుంది.
కార్ల ధర పెరగడానికి కారణం ఏమిటి?తమ కార్ల ధరల పెరుగుదలకు కారణం తయారీ ఖర్చులు పెరగడమే అని Hyundai కంపెనీ తెలిపింది. గత కొంతకాలం నుంచి వాహనాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులు, ఇతర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. వినియోగదారులపై ఎక్కువ భారం పడకూడదని తాము ఎప్పుడూ ప్రయత్నిస్తామని, అయితే ప్రస్తుతం ఖర్చులు భారీగా పెరగడంతో కార్ల ధరలను స్వల్పంగా పెంచక తప్పడం లేదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.
అమ్మకాల్లోనూ దూకుడుకార్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నప్పటికీ, Hyundai అమ్మకాల్లో స్థిరమైన వృద్ధి కనిపించడం విశేషం. ఆర్థిక సంవత్సరం 2026 నాలుగో త్రైమాసికంలో కంపెనీ 2 లక్షలకు పైగా వాహనాల అమ్మకాలతో తమ స్థానాన్ని నిలుపుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 8.7 శాతం ఎక్కువ అని గుర్తుంచుకోండి. భారత ఆటో మార్కెట్లో కూడా కంపెనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఇప్పటివరకు అత్యధిక త్రైమాసిక అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, Hyundai కంపెనీ ఈ విభాగంలోనూ తన పట్టును నిలబెట్టుకుంటూ సుమారు 9 శాతం వృద్ధిని సాధించింది. మార్చి 2026లో కూడా హ్యుందాయ్ కంపెనీ మంచి ఫలితాలు రాబట్టింది. వినియోగదారుల్లో Hyundai కార్లకు ఉన్న డిమాండ్ ఉందని, అందుకు కంపెనీ క్వాలిటీతో పాటు సర్వీసులు కారణమని అర్థమవుతోంది.
కారు ఇప్పుడే కొనడం మంచిది.. మీరు త్వరలో Hyundai కారును కొనే ప్లాన్ చేసుకుంటే కనుక ఏప్రిల్ నెలాఖరులోపే మీకు సరైన టైం కావచ్చు. ధరలు పెరగకముందే కొనడం ద్వారా మీరు కొంతమేర నగదు ఆదా చేసుకోవచ్చు. ఈ సమయంలో చాలా మంది డీలర్లు అదనపు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇచ్చి విక్రయాలు పెంచాలని ప్రయత్నిస్తారు. కనుక ఈ నెలాఖరులోగా కొనకపోతే మే 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
