Hyundai Bayon SUV Details In Telugu: హ్యుందాయ్ ఇండియా, SUV మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. Hyundai Bayon SUVని రూ.10 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఈ కారుకు డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. కంపెనీ SUV లైనప్‌లో Creta కంటే దిగువ స్థాయిలో దీనిని ఉంచింది. Creta ప్రారంభ ధరతో పోలిస్తే, Bayon సుమారు రూ.91,000 తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆధునిక డిజైన్, పెద్ద డిజిటల్ డిస్ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్, భద్రత ఫీచర్లు ఈ SUVలో ప్రధాన ఆకర్షణలు. మీ మాటలను అర్ధం చేసుకుని తగిన విధంగా స్పందించే AI అసిస్టెంట్ కూడా ఈ కారులో ఉంది. బేయాన్ ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండగా, 2027 జనవరిలో CNG వెర్షన్‌ను తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తోంది.
ధరలు, వేరియంట్ల వివరాలు
Hyundai Bayon మొత్తం ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. HX2, HX3, HX3+, HX5, HX6, HX8, HX10 పేర్లతో వీటిని విక్రయిస్తున్నారు. పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రారంభ వేరియంట్ ధర రూ.10 లక్షలు. టాప్ HX10 పెట్రోల్ CVT వేరియంట్ ధర రూ.18 లక్షలు.
పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి. HX2 ధర రూ.10 లక్షలు, HX3 ధర రూ.10.90 లక్షలు, HX3+ ధర రూ.11.80 లక్షలు, HX5 ధర రూ.12.45 లక్షలు, HX6 ధర రూ.13.57 లక్షలు, HX8 ధర రూ.15.10 లక్షలు, HX10 ధర రూ.16.65 లక్షలు.
CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ HX5, HX6, HX8, HX10 వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.13.85 లక్షలు, రూ.14.97 లక్షలు, రూ.16.54 లక్షలు, రూ.18 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.
టాప్ పెట్రోల్ CVT వేరియంట్ ధరను Creta CVTతో పోలిస్తే Bayon రేటు సుమారు రూ.69,000 తక్కువగా ఉంది. అయితే.. Venue 1.2-లీటర్ పెట్రోల్ బేస్ వేరియంట్‌తో పోలిస్తే Bayon ప్రారంభ మాన్యువల్ వేరియంట్ కోసం సుమారు రూ.2 లక్షలు ఎక్కువ చెల్లించాలి.
ఇది కూడా చదవండి: భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
కొత్త డిజైన్, పెద్ద కొలతలు
Bayonలో హ్యుందాయ్ తాజా ‘Art of Steel’ డిజైన్ స్టైల్‌ను ఉపయోగించింది. ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, L-ఆకారపు LED DRLs ఉన్నాయి. ఇవే టర్న్ ఇండికేటర్లుగానూ పనిచేస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో వెడల్పైన వీల్ ఆర్చ్‌లు, షార్ప్ డిజైన్ లైన్లు, బ్లాక్ క్లాడింగ్ SUVకి బలమైన రూపాన్ని ఇస్తాయి. 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, సాధారణ పుల్-టైప్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.
వెనుక భాగంలో సన్నని నల్లటి బ్యాండ్‌లో LED టెయిల్ ల్యాంప్స్ అమర్చారు. టెయిల్‌గేట్‌పై BAYON అక్షరాలు కనిపిస్తాయి. రూఫ్ స్పాయిలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ & సిల్వర్ బంపర్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
ఈ SUV పొడవు 4,245mm, వెడల్పు 1,810mm, రూఫ్ రైల్స్‌తో ఎత్తు 1,605mm. వీల్‌బేస్ 2,600mm కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 205mm. బూట్ స్పేస్ 505 లీటర్లు. హ్యుందాయ్ Global K enhanced ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించింది. భారత క్రాష్ టెస్ట్ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. Bharat NCAP భద్రత రేటింగ్ ఈ ఏడాది చివర్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
క్యాబిన్లో డిజిటల్ ఫీచర్ల హంగామా
Bayon ఇంటీరియర్‌లో 12.3-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. టచ్‌స్క్రీన్ కింద AC నియంత్రణల కోసం ప్రత్యేక ప్యానెల్ ఇచ్చారు. ఫిజికల్ బటన్లు, డయల్స్ ఉండటంతో ముఖ్యమైన ఫంక్షన్లను సులభంగా ఉపయోగించవచ్చు. స్టీరింగ్ వీల్‌పై కూడా బటన్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Eco, Normal, Sport అనే మూడు డ్రైవ్ మోడ్లు అందుబాటులో ఉంటాయి. ఇతర ఫీచర్లలో ముందు వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవర్ సీట్ పవర్ అడ్జస్ట్మెంట్, Bose సౌండ్ సిస్టమ్, Type-C USB పోర్టులు, వైర్లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, వెనుక AC వెంట్లు, రెండు దశల్లో రిక్లైన్ అయ్యే వెనుక సీట్లు ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా లభిస్తుంది.
Generative AI వాయిస్ అసిస్టెంట్, Bluelink కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, OTA అప్డేట్స్ వంటి సదుపాయాలను కూడా అందించారు. సాధారణంగా ముందుగా నిర్ణయించిన వాయిస్ కమాండ్లకే పరిమితం కాకుండా, సంభాషణ తరహా అభ్యర్థనలను అర్థం చేసుకునేలా AI అసిస్టెంట్ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
భద్రత కోసం Level 2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో ఆటో హోల్డ్ ఫీచర్లు ఉన్నాయి.
115hp పెట్రోల్ ఇంజిన్.. త్వరలో CNG
Hyundai Bayonలో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 115hp పవర్, 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. CVT వెర్షన్‌కు ARAI ప్రకటించిన మైలేజీ 18.6kpl. ఓవర్టేక్ చేసే సమయంలో తక్షణ పవర్ పెంపునకు Dash Boost మోడ్ కూడా ఉందని హ్యుందాయ్ పేర్కొంది.
ప్రస్తుతం Bayonలో టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు లేవు. 2027 జనవరిలో CNG వెర్షన్‌ను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇది భారత్‌లో హ్యుందాయ్ అందించే తొలి CNG మిడ్‌సైజ్ SUV కానుంది.
పోటీ ఎలా ఉండబోతోంది?
మిడ్‌సైజ్ SUV విభాగంలో Bayonకు Maruti Suzuki Grand Vitara, Victoris, Toyota Hyryder, Kia Seltos, Tata Sierra, Honda Elevate, Skoda Kushaq, Volkswagen Taigun, Citroen Aircross, MG Astor వంటి మోడళ్ల నుంచి పోటీ ఎదురుకానుంది. Chennai ప్లాంట్‌లో కుడివైపు, ఎడమవైపు స్టీరింగ్ అమరికలతో Bayonను తయారు చేస్తున్నారు. భారత్‌లో విక్రయించడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు.
మొత్తంగా చూస్తే, Creta కంటే తక్కువ ధరలో మరో చక్కటి SUVని కస్టమర్లకు అందించడమే హ్యుందాయ్ లక్ష్యంగా కనిపిస్తోంది. పెద్ద డిజిటల్ స్క్రీన్లు, ADAS, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కోరుకునేవారికి ఇది ఆసక్తికరమైన మోడల్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
