Features Hyundai Bayon misses out: హ్యుందాయ్ బేయాన్ (Hyundai Bayon)ను భారత మార్కెట్లో రూ.10 లక్షల నుంచి రూ.18.15 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో కంపెనీ తీసుకొచ్చింది. క్రెటా కంటే దిగువ స్థానంలో ఉండే ఈ మిడ్‌సైజ్ SUVలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అయితే, కొన్ని సౌకర్యాల విషయంలో మాత్రం ప్రత్యర్థి కార్లతో పోలిస్తే వెనుకబడింది. ముఖ్యంగా.. ప్రయాణికుల సౌకర్యం, రోజువారీ వినియోగంలో ఉపయోగపడే కొన్ని ఫీచర్లు ఇందులో అందుబాటులో లేవు. బేయాన్ కొనాలని భావిస్తున్నవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు ఇవే.

Continues below advertisement

1. పవర్డ్ కో-డ్రైవర్ సీటు, బాస్ మోడ్ లేవు

హ్యుందాయ్ బేయాన్‌లో డ్రైవర్ సీటును 8 విధాలుగా ఎలక్ట్రిక్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ముందు ప్రయాణికుడి సీటును మాత్రం చేతితోనే సర్దుకోవాలి. క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెక్టన్, హోండా ఎలివేట్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ వంటి ప్రత్యర్థి మోడళ్లలో ఎలక్ట్రిక్ కో-డ్రైవర్ సీటు సౌకర్యం ఉంది.

Continues below advertisement

క్రెటాలో బాస్ మోడ్ కూడా లభిస్తుంది. దీని ద్వారా.. వెనుక సీటులో కూర్చున్నవాళ్లు ముందు ప్రయాణికుడి సీటును ముందుకు జరిపి, వాల్చి తమకు ఎక్కువ లెగ్‌రూమ్ పొందవచ్చు. బేయాన్‌లో ఈ సౌకర్యం లేకపోవడం లోటు అనే చెప్పాలి.

2. పవర్డ్ టెయిల్‌గేట్ అందుబాటులో లేదు

బేయాన్‌లో 505 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ విభాగంలో అత్యధిక సామర్థ్యం కలిగిన బూట్‌లలో ఇది ఒకటి. అయితే, బూట్ డోర్‌ (ట్రంక్‌)ను తెరవడానికి, మూసేందుకు చేతిని ఉపయోగించాల్సిందే.

మారుతి విక్టోరిస్, టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెక్టన్ వంటి ప్రత్యర్థి SUVల్లో పవర్డ్ టెయిల్‌గేట్ సౌకర్యం ఉంది. అంటే చేయి ఉపయోగించాల్సిన అవసరమే లేదు. బేయాన్‌లోనూ ఈ ఫీచర్ ఉంటే, సామాన్లు ఎక్కించడం, దించడం మరింత సులభమయ్యేది.

ఇది కూడా చదవండి: Hyundai Bayon ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.10 లక్షలు.. హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్ ధర ఎంతవుతుందంటే?

3. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లేదు

బేయాన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అందుబాటులో ఉంది. అయితే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మాత్రం లేదు. ఈ ఫీచర్ ఉంటే.. డ్రైవర్, ముందు ప్రయాణికుడు తమకు నచ్చిన ఉష్ణోగ్రతలను విడివిడిగా సెట్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తో పాటు టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెక్టన్ వంటి మోడళ్లలో ఈ సౌకర్యం ఉంది. ముఖ్యంగా రూ.16 లక్షలలోపు ధర కలిగిన కొన్ని క్రెటా, సెల్టోస్ వేరియంట్లలోనూ ఇది లభించడం గమనార్హం.

4. వెనుక సన్‌షేడ్స్ లేవు

భారతదేశంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెనుక సీటు ప్రయాణికులకు సన్‌షేడ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి నేరుగా పడే సూర్యకాంతిని తగ్గించి ప్రయాణాన్ని కొంత సౌకర్యవంతంగా మారుస్తాయి.

హ్యుందాయ్ బేయాన్‌లో వెనుక సన్‌షేడ్స్ అందుబాటులో లేవు. క్రెటా, సెల్టోస్, టాటా సియెరా వంటి ప్రత్యర్థి మోడళ్లలో ఈ ఫీచర్ లభిస్తుంది.

5. వెనుక ప్రయాణికులకు వైర్‌లెస్ ఛార్జర్ లేదు

బేయాన్‌లో HX5 వేరియంట్ నుంచి వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ఈ ఛార్జర్ ముందు ప్రయాణికుల కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. వెనుక సీటులో కూర్చునేవారికి ప్రత్యేక వైర్‌లెస్ ఛార్జర్ లేదు.

క్రెటాలో వెనుక AC వెంట్ల దగ్గర అదనపు వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. బేయాన్‌లో మాత్రం వెనుక ప్రయాణికుల కోసం Type-C పోర్ట్, 12V సాకెట్ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల వైర్‌లెస్ ఛార్జింగ్ కోరుకునేవారికి ఇది ఒక లోటుగా కనిపించవచ్చు.

ఇది కూడా చదవండి: క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?

6. హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) లేదు

హెడ్-అప్ డిస్‌ప్లే ద్వారా వేగం వంటి ముఖ్యమైన డ్రైవింగ్ సమాచారాన్ని కారు అద్దంపై డ్రైవర్ కంటి ముందే ప్రదర్శించవచ్చు. దీనివల్ల సమాచారాన్ని చూడటానికి పదేపదే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వైపు చూడాల్సిన అవసరం తగ్గుతుంది.

మారుతి గ్రాండ్ విటారా, విక్టోరిస్, టాటా సియెరా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి ప్రత్యర్థి మోడళ్లలో HUD సౌకర్యం ఉంది. కానీ బేయాన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.

బేయాన్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

హ్యుందాయ్ బేయాన్‌లో 505 లీటర్ల బూట్ స్పేస్, 8-వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అయినప్పటికీ.. పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ AC, వెనుక సన్‌షేడ్స్, HUD వంటి సౌకర్యాలు లేకపోవడం కొందరికి నిరాశ కలిగించవచ్చు.

కారు ఎంపిక చేసుకునేటప్పుడు ధరతో పాటు ఏ ఫీచర్లు ఏ వేరియంట్‌లో లభిస్తున్నాయో పరిశీలించాలి. ముఖ్యంగా.. వెనుక సీటు సౌకర్యం, ఛార్జింగ్ అవసరాలు, రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని బేయాన్‌ను క్రెటా, సెల్టోస్, సియెరా వంటి ప్రత్యర్థి SUVలతో పోల్చి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.