Hydrogen Cars and Buses:భారత్‌ రవాణా రంగంలో మరో కీలక అడుగు పడింది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, బొగ్గు, సీఎన్జీ, ఎలక్ట్రిక్  వాహనాల గురించి మాత్రమే విన్నారు. ఇప్పుడు తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలు ఎక్కింది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ హైడ్రోజన్ రైలు నడపడంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా పది కోచ్‌లను నడిపి ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని చూపించింది. అయితే ఇప్పుడు కార్లు, బస్‌లు కూడా హైడ్రోజన్‌తో నడిపించే వీలు ఉంటుందా? టూవీలర్స్‌ కూడా వస్తాయా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. 

Continues below advertisement

హైడ్రోజన్‌తో నడిచే బస్‌లు వస్తున్నాయా?

భారత్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధనాలపై ఆధారపడే పరిస్థితిని పూర్తిగా తగ్గించాలని భావిస్తోంది. అందుకే నేషనల్‌ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను భుజానకెత్తుకొని అందుకు తగ్గట్టుగా ప్లాన్స్‌ చేస్తోంది. అందులో భాగమే ఇప్పుడు హర్యానాలోని జింద్‌లో నడుస్తున్న హైడ్రోజన్ ట్రైన్.  ఈ ట్రైన్ అందుబాటులోకి రావడంతో అందరి దృష్టి ఇప్పుడు తర్వాత రవాణా వ్యవస్థలపై పడింది. ఇందుకు తగ్గట్టుగానే చాలా కంపెనీలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వాహనాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. టాటా మోటార్స్ అశోక్‌ లేలాండ్‌ వంటి సంస్థలు ఇప్పటికే హైడ్రోజన్ బస్‌లు సిద్ధం చేస్తున్నాయి. ఎన్టీపీసీ ఢిల్లీ, లేహ్ లో పైలట్ ప్రాజెక్టు కుంద హైడ్రోజన్ బస్‌లను విజయవంతంగా నడుపుతోంది. ఇవి ఆగ్రా-ఢిల్లీ, ముంబై-పూణే, అహ్మదాబాద్-సూరత్‌ మధ్య పది రూట్స్‌లో 37 హైడ్రోజన్ బస్‌లు, ట్రక్కులు నడుపుతున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ప్రజారవాణాలో ఈ బస్‌లు రానున్నాయి. 

హైడ్రోజన్‌తో నడిచే కార్లు ఎప్పటి నుంచి రావచ్చు 

కార్ల విషయానికి వస్తే ఇప్పటికే కొన్ని దేశాల్లో టయోటా మిరాయ్, హ్యుందాయ్‌ నెక్సో వంటి హైడ్రోజన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో పరీక్షలు చేస్తున్నారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ హైడ్రోజన్ కారు నడిపారు. అయితే దేశవ్యాప్తంగా హైడ్రోజన్ రీఫ్యూయలింగ్‌ స్టేషన్లు అందుబాటులో లేనందున హైడ్రోజన్ కార్లు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. ఒకసారి ఇలాంటి స్టేషన్‌కు అనుమతి లభిస్తే మాత్రం ఈవీలు మాదిరిగానే  హైడ్రోజన్‌తో నడిచే కార్లు వచ్చేస్తాయి. 

Continues below advertisement

హైడ్రోజన్‌తో నడిచే టూవీలర్స్‌ వస్తాయా?

హైడ్రోజన్‌తో టూవీలర్స్‌ నడపడం అంత ఈజీ కాదు. ఇది సవాల్‌తో కూడిన వ్యవహారం. హైడ్రోజన్ గ్యాస్‌ చాలా ఎక్కువ ప్రెజర్‌తో ఉంటుంది. దీన్ని స్ట్రాంగ్‌ సిలిండర్స్‌లో ఉండాలి. టూవీలర్స్‌లో స్పేస్ తక్కువగా ఉంటుంది. అందులో అమర్చాలి అంటే సవాలే. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతానికి ఈవీ టూవీలర్స్‌ పైనే దృష్టి పెట్టారు. 

పెట్రోల్‌, హైడ్రోజన్‌ మధ్య వ్యత్యాసం ఏంటి?

పెట్రోల్‌, హైడ్రోజన్ ఇంధనాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పెట్రోల్ వాహనాలు సాధారణంగా లీటర్‌కు 15-20 కిలోమీటర్ల మైలేజీ వస్తే, హైడ్రోజన్‌ కిలోకు 100-140కిలోమీటర్‌ మైలేజీ ఇస్తుంది. పెట్రోల్‌ ప్రతి కిలోమీటర్‌కు సుమారు 6 నుంచి 8 రూపాయలు ఖర్చు అవుతుంది. భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగితే ప్రతి కిలోమీటర్‌కు 3 నుంచి ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 

పెట్రోల్‌ నింపుకునే వాహనాలు 8 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలు పాతికల లక్షల నుంచి మొదలుకానున్నాయి. పెట్రోల్‌తో నడిచే వాహనాల నుంచి కార్బన్ ఉద్గారాలు, పొగ, విపరీతమైన వాయుకాలుష్యం విడుదలవుతుంది. హైడ్రోజన్తో నడిచే వాహనాల నుంచి ఎలాంటి కాలుష్యం రాదు. కారు సైలెన్సర్ నుంచి పొగకు బదులు స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. 

సీఎన్జీ vs హైడ్రోజన్‌ వాహనాలు 

సీఎన్జీ వాహనాల్లో మిథేన్ గ్యాస్ నింపుతారు. సాధారణ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఉంటుంది. దీని నుంచి కార్బన్ డయాక్సైడ్, స్వల్పంగా హైడ్రోకార్బన్లు వెలువడతాయి. సుమారు 3600పీఎస్‌ఐ పీడనం వద్ద నిల్వచేస్తారు.  హైడ్రోజన్ వాహనాలు స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువు నింపుతారు. ఫ్యూయల్‌ సెల్‌ టెక్నాలజీ వాడుతుంటారు. కాలుష్యం ఉండదు. కేవలం నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. సుమారు పదివేల పీఎస్‌ఐ అత్యధిక పీడనం అవసరమవుతుంది. సీఎన్జీ కేజీకి ఇరవై నుంచి 30 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.