Summer Driving Tips | ఈ వేసవి కాలంలో స్కూల్, కాలేజీ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తారు. ఇటీవల ఏపీ, తెలంగాణలో ఇంటర్, టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి. మరోవైపు స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఈ సెలవులు ఎంజాయ్ చేయడానికి కొండ ప్రాంతాల వైపు వెళ్లేటప్పుడు రోడ్ ట్రిప్ మజాయే వేరు ఉంటుంది. చల్లని గాలి, అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అయితే మైదాన ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసినంత ఈజీగా కొండ ప్రాంతాలలో ఉండదు. ఇక్కడి ఇరుకైన రోడ్లు, ప్రమాదకరమైన టర్నింగ్స్, అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలు డ్రైవింగ్‌ను సవాలుగా మారుస్తాయి. కనుక మీరు కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. దాంతో మీ ప్రయాణం సురక్షితంగా, తీపి గుర్తులు మిగిల్చేలా సాగుతుంది. లేకపోతే ప్రమాదాలు, లేనిపోని ఇబ్బందులు తప్పవు. 

Continues below advertisement

ఈ ముఖ్యమైన చిట్కాలు పాటించండి.. అన్నింటికంటే ముఖ్యమైన, తొలి విషయం ఏంటంటే, కొండ ప్రాంతాలలో ఎప్పుడూ స్పీడ్‌గా డ్రైవింగ్ చేయకూడదు. చాలా మంది త్వరగా చేరుకోవాలనో, లేక టైం లేదనో వేగాన్ని పెంచుతారు. కానీ కొండ మార్గాలు ఇరుకుగా, మెలికలు తిరిగి ఉంటాయని తెలిసిందే. ఈ జర్నీలో జరిగే చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. అందువల్ల హిల్ స్టేషన్లలో నెమ్మదిగా, స్పీట్ కంట్రోల్‌లో ఉండేలా డ్రైవ్ చేయండి.

రెండవ ముఖ్యమైన విషయం.. సరైన గేర్‌ను ఉపయోగించాలి. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు వాడే గేర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రెండవ లేదా మూడవ గేర్‌లో డ్రైవింగ్ చేయడం మరింత సురక్షితం. దీనివల్ల వాహనంపై మీకు కంట్రోల్ ఉంటుంది. వాహనం ఇంజన్‌పై కూడా ఎక్కువ ఒత్తిడి పడదు.

Continues below advertisement

మూడవ విషయం ఏంటంటే ఓవర్‌టేక్ చేయాలని తొందరపడకండి. కొండలపై రోడ్లు ఇరుగ్గా, టర్నింగ్స్‌తో ఉంటాయి. ఎదురుగా ఏం వస్తుందో చాలా సార్లు మీకు స్పష్టంగా కనిపించదు. అలాంటి పరిస్థితిలో మీరు ఇవేమీ ఆలోచించకుండా ఓవర్‌టేక్ చేస్తే, ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ఎదురుగా వచ్చే మార్గం పూర్తిగా స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయాలి.

మలుపుల వద్ద హారన్ కొట్టాలి 

కొండ మార్గాలలో చాలా బ్లైండ్ టర్న్‌లు (ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని మలుపులు) చాలా ఉంటాయి. ఆ పరిస్థితిలో హారన్ కొట్టడం వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్‌కు మరో వెహికల్ రాక గురించి ముందుగా తెలుస్తుంది. దాంతో అప్రమత్తమై ప్రమాదం జరగకుండా నివారించవచ్చు.

 సరైన లైట్ల వాడకం కూడా అవసరమే. కొండ ప్రాంతాలలో ఎప్పుడూ లో-బీమ్ (Low beam) పైనే డ్రైవింగ్ చేయాలి. దాంతో ఎదురుగా వచ్చే వాహనదారుడికి ఇబ్బంది ఉండదు. ఇద్దరూ ఒకరినొకరు స్పష్టంగా చూసుకుని వెళ్తారు.

ఈ విషయాలు కూడా గుర్తుంచుకోవాలి.. బ్రేక్‌లను అనాలోచితంగా ఉపయోగించరాదు. ముఖ్యంగా లోతైన వాలులలో పదే పదే బ్రేకులు వేయడం వల్ల బ్రేకులు వేడెక్కి, వాటి పనితీరు తగ్గిపోవచ్చు. అందువల్ల వాహనం వేగాన్ని కొన్నిసార్లు గేర్ల ద్వారా నియంత్రించడం చాలా సురక్షితం.

కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరపాటుతో కాకుండా సహనం, జాగ్రత్తే ముఖ్యమని గ్రహించాలి. మీరు ఈ నియమాలను పాటిస్తే, కొండ ప్రాంతాలు హిల్ స్టేషన్లలో మీ ప్రయాణం సురక్షితంగా ఉండటమే కాకుండా, మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ జర్నీని ఎంజాయ్ చేయగలరు.