How to check and pay e-challan online: ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా కారు లేదా టూవీలర్‌ నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. దీనినే చలాన్‌ అంటారు. ప్రస్తుతం చాలా ట్రాఫిక్‌ ఉల్లంఘనలను ఎలక్ట్రానిక్‌ విధానంలో నమోదు చేస్తున్నారు. అయితే, చలాన్‌ సమాచారం SMS ద్వారా వచ్చినా కొందరు గమనించకపోవచ్చు. ఫోన్‌ నంబర్‌ మారడం లేదా మెసేజ్‌ను డిలీట్‌ చేయడం వల్ల కూడా ఆ సమాచారం మిస్‌ కావచ్చు. మీరు చూడనంత మాత్రాన చలాన్‌ రద్దయినట్లు కాదు. వాహనంపై జరిమానా ఉందో లేదో తెలుసుకోవడానికి, దానిని ఆన్‌లైన్‌లో చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వ Parivahan పోర్టల్‌ ఉపయోగపడుతుంది.

Continues below advertisement

చలాన్‌ చెల్లించనంత మాత్రాన డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ అవుతుందని చెప్పలేం. పదేపదే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం లేదా చట్టబద్ధమైన ఆదేశాలను పాటించకపోవడం వల్ల లైసెన్స్‌కు సంబంధించిన చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే, ట్రాఫిక్‌ పోలీసులు సంబంధిత వాహనాన్ని జప్తు కూడా చేయవచ్చు. కానీ, జరిమానా చెల్లించలేదనే ఒకే ఒక్క కారణంతోనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారని భావించకూడదు.

ఈ-చలాన్‌ అంటే ఏమిటి?

Continues below advertisement

ఈ-చలాన్‌ అనేది ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన డిజిటల్‌ రికార్డు. ట్రాఫిక్‌ పోలీసులు సీసీ కెమెరాలు, ఆటోమేటెడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థలు లేదా నేరుగా తనిఖీ చేయడం ద్వారా ఉల్లంఘనలను గుర్తించవచ్చు. కెమెరాల్లో రికార్డయిన ఫొటోలు, వీడియోల ఆధారంగా వాహనాన్ని గుర్తించి, జరిగిన ఉల్లంఘనను నిర్ధారించే అవకాశం ఉంటుంది. అయితే, అన్ని ఉల్లంఘనలూ కెమెరాల ద్వారానే గుర్తించరు. రూల్స్‌ను అతిక్రమించిన వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు నేరుగా గుర్తించి కూడా చలాన్‌ జారీ చేయవచ్చు.

వాహనం రిజిస్ట్రేషన్‌ వివరాల ఆధారంగా దాని నంబర్‌, రిజిస్టర్డ్‌ యజమాని వివరాలను గుర్తించి జరిమానా నమోదు చేస్తారు. సాధారణంగా, వాహనానికి అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు SMS ద్వారా చలాన్‌ సమాచారం పంపిస్తారు. ఆ సందేశం రాకపోయినా లేదా కనిపించకపోయినా మీ బండిపై చలాన్‌ లేనట్లు కాదు. మీకు తెలీకుండా లేదా వేరే వ్యక్తులు మీ బండిని తీసుకెళ్లి రూల్స్‌ జంప్‌ చేయవచ్చు. కాబట్టి, అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో చలాన్‌ వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?

ఆన్‌లైన్‌లో చలాన్‌ ఎలా చెక్‌ చేయాలి?

మీ వాహనంపై పెండింగ్‌ చలాన్‌ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా చేయండి.

1. ముందుగా అధికారిక Parivahan ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌ను [https://echallan.parivahan.gov.in/] సందర్శించండి.2. వెబ్‌సైట్‌లో చలాన్‌ స్టేటస్‌ తనిఖీ చేసే ఆప్షన్‌ను ఎంచుకోండి.3. అందుబాటులో ఉన్న ఆప్షన్‌ను బట్టి చలాన్‌ నంబర్‌, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ (DL) నంబర్‌ను నమోదు చేయండి.4. అడిగిన వివరాలు నమోదు చేసి, వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయండి.5. ఆ తర్వాత. మీ వాహనంపై ఏవైనా చలాన్‌లు ఉంటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఏ నిబంధన ఉల్లంఘించారు? ఎంత జరిమానా విధించారు? వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.

‘Challan Not Found’ అనే సందేశం కనిపిస్తే, మీరు నమోదు చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసి మళ్లీ ప్రయత్నించండి. అప్పుడు కూడా ఇదే సందేశం కనిపిస్తేనే ఎలాంటి చలాన్‌ లేదని నిర్ధారించుకోవాలి.

ఇది కూడా చదవండి: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?

ఈ-చలాన్‌ ఫైన్‌ ఎలా చెల్లించాలి?

చలాన్‌ వివరాలు కనిపించిన తర్వాత జరిమానా చెల్లించాలి.

1. అధికారిక ఈ-చలాన్‌ పోర్టల్‌లో చెల్లింపు ప్రక్రియను ప్రారంభించండి.2. చలాన్‌ నంబర్‌, వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా DL నంబర్‌ను నమోదు చేయండి.3. క్యాప్చా వెరిఫికేషన్‌ పూర్తి చేసి ‘Get Detail’ ఆప్షన్‌ను ఎంచుకోండి.4. స్క్రీన్‌పై కనిపించే ఉల్లంఘన వివరాలు, జరిమానా మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.5. చెల్లింపు కాలమ్‌లోని ‘Pay Now’ ఆప్షన్‌ను ఎంచుకోండి.6. అందుబాటులో ఉన్న చెల్లింపు విధానాన్ని ఎంచుకుని లావాదేవీని పూర్తి చేయండి.

చెల్లింపు పూర్తయ్యాక రిసిప్ట్‌ లేదా ట్రాన్సాక్షన్‌ రిఫరెన్స్‌ నంబర్‌ను భద్రపరచుకోండి. అవసరమైతే, భవిష్యత్తులో చెల్లింపునకు ఆధారంగా ఉపయోగపడుతుంది. వాహనానికి రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ కూడా రావచ్చు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకుల ద్వారా డబ్బు చెల్లించకుండా, అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే చెల్లింపు చేయడం మంచిది. 

ఒకవేళ, చలాన్‌ తప్పుగా జారీ అయిందని అనిపిస్తే, దానిని అలాగే వదిలేయకుండా సంబంధిత స్టేషన్‌ దృష్టికి తీసుకెళ్లండి.

చలాన్‌ చెల్లించకపోతే ఏమవుతుంది?

ఈ-చలాన్‌ను పట్టించుకోకపోతే అది ఆటోమేటిక్‌గా రద్దు కాదు. జరిమానా పెండింగ్‌లో ఉండిపోవచ్చు. కేసు స్వభావం, వర్తించే నిబంధనలు, సంబంధిత అధికారుల చర్యలను బట్టి తదుపరి నోటీసులు లేదా చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

పెండింగ్‌ చలాన్లు ఉంటే, వాహనాన్ని అమ్ముదామని అనుకున్నప్పుడు లేదా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (RC) బదిలీ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందువల్ల, అప్పుడప్పుడు మీ వాహనంపై చలాన్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.