How To Apply Driving Licence Online: ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో, ప్రతి ఇంటికీ ఒక వాహనం (బైక్, స్కూటర్ లేదా కారు) అవసరం. మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఏదైనా మోటారు వాహనాన్ని నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ (DL) ఉండాలి. బండి తీసుకుని రోడ్డు మీదకు ఎక్కే ప్రతి వ్యక్తికీ ఇది తప్పనిసరి. గతంలో, డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTO ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సాంకేతికత మారింది, RTO ఆఫీసు ఆన్‌లైన్‌లోకే వచ్చింది. ఇప్పుడు, మీరు ఇంట్లోనే కూర్చుని మీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే DL కోసం దరఖాస్తు చేయవచ్చు.
1. ముందుగా ఏం సిద్ధం చేసుకోవాలి?
డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేయడానికి, ముందు ఈ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచండి:
ఆధార్ కార్డు / ఐడెంటిటీ ప్రూఫ్ స్కాన్ చేసిన కాపీ
చిరునామా ఆధారం కోసం కరెంటు బిల్ ల్యాండ్ లైన్ ఫోన్ బిల్ లేదా పోస్ట్-పెయిడ్ మొబైల్ బిల్ లేదా ఇతర ప్రూఫ్ స్కాన్ చేసిన కాపీ
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
సంతకం (స్కాన్ చేసిన రూపంలో)
ఆరోగ్య ప్రమాణ పత్రం (Medical Certificate - Form 1A, వయసు 40 ఏళ్లకు పైగా ఉంటే అవసరం)
2. ఏ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి?
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న Parivahan Sewa పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయవచ్చు.
3. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రక్రియ:
స్టెప్ 1: పరివాహన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయండి (ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ).
స్టెప్ 2: "Apply for Learner Licence" లేదా "Apply for Driving Licence" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
స్టెప్ 3: అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా, వాహన రకం, వర్గం (LMV, MCWG మొదలైనవి) వంటి వివరాలు నమోదు చేయాలి.
స్టెప్ 4: ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 5: మీకు సమీపంలోని RTOలో డేటా వెరిఫికేషన్, బయోగెమెట్రిక్ మరియు డ్రైవింగ్ టెస్ట్‌కు మీకు వీలైన తేదీని బుక్ చేయాలి.
స్టెప్ 6: ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించాలి (సాధారణంగా రూ. 200– రూ. 500 మధ్యలో ఉంటుంది).
4. అప్లికేషన్ తర్వాత జరిగే ప్రక్రియ
లెర్నర్ లైసెన్స్ (LLR) కోసం దరఖాస్తు చేసినవారు -- లెర్నింగ్ టెస్ట్‌ను ఆన్‌లైన్ పరీక్ష రూపంలో రాస్తారు. ఇది పాస్ అయితే, లెర్నింగ్ లైసెన్స్ ఈ-మెయిల్ లేదా పోస్టు ద్వారా వస్తుంది.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినవారు -- పరీక్ష తేదీన మీ RTO వద్దకు వెళ్లి వాహనంతో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాలి. ఆ టెస్ట్‌లో పాస్ అయితే, మీరు పర్మినెంట్ లైసెన్స్‌కు అర్హత సాధిస్తారు.
5. చిట్కాలు & సూచనలు:
అప్లికేషన్ ఫారాన్ని జాగ్రత్తగా, తప్పులు లేకుండా నింపండి. ముఖ్యంగా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, మీరు ఇచ్చిన వివరాలే కార్డ్‌లో ప్రింట్ అవుతాయి.
అవసరమైన డాక్యుమెంట్లు స్పష్టంగా కనిపించేలా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
OTP లేదా పేమెంట్ సమయంలో సర్వర్ లోడింగ్ సమస్యలు వస్తే, మరోసారి ప్రయత్నించండి.
ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోకుండా RTO వద్దకు వెళ్లవద్దు.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, భారత ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో మీరు సరైన సమాచారం ఇచ్చి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, సులభంగా లైసెన్స్ పొందవచ్చు.