Hyundai Cars Price After GST Cut Down: హ్యుందాయ్ భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. ఈ సంస్థకు చెందిన కార్లు మధ్యతరగతి కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. అందుకే  క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్ వంటి SUVలు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ముందువరుసలో ఉన్నాయి. పండగ సీజన్ వస్తున్నందున  కార్లు కొనేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ దీపావళికి మోడీ ప్రభుత్వం అనేక వస్తువులపై GSTని తగ్గించే అవకాశం ఉంది. ఇందులో చిన్న కార్లు కూడా ఉంటాయనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కార్లపై 28% GST, 1% సెస్‌తో కలిపి మొత్తం 29% పన్ను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిని 10% తగ్గించి 18%కి తీసుకొస్తే మాత్రం కార్ల ధరలలో నేరుగా పెద్ద తగ్గుదల కనిపిస్తుంది.

పన్ను తగ్గింపు ప్రభావం

ఒక కారు బేస్ ధర రూ. 5 లక్షలు అని అనుకుంటే ప్రస్తుత సమయంలో దానిపై 29% పన్ను కలిపి కారు ధర రూ. 6.45 లక్షలకు చేరుకుంటుంది. అయితే పన్ను 18%కి తగ్గితే, అదే కారు రూ. 5.90 లక్షలకు లభిస్తుంది. అంటే కొనుగోలుదారు దాదాపు రూ. 55,000 ఆదా అవుతుంది. అదేవిధంగా, రూ. 10 లక్షల ధర కలిగిన కార్లపై దాదాపు రూ. 1.10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇదే ప్రభావం హ్యుందాయ్ కార్లపై కూడా ఉంటుంది.

హ్యుందాయ్ కొత్త ధరలు

GSTలో 10% తగ్గింపు ఉంటే, హ్యుందాయ్ అనేక కార్లు చాలా చౌకగా మారతాయి. ఉదాహరణకు, గ్రాండ్ i10 నియోస్‌పై కస్టమర్‌లు దాదాపు రూ. 59,830 ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో, కొత్త మైక్రో SUV ఎక్స్‌టర్‌పై దాదాపు రూ. 59,990 వరకు ఆదా చేయవచ్చు. హ్యుందాయ్ ఆరా ధరలో దాదాపు రూ. 65,410, i20పై దాదాపు రూ. 75,089 వరకు ఆదా అవుతుంది.

కాంపాక్ట్ SUV వెన్యూ ప్రారంభ ధరపై కొనుగోలుదారులు రూ. 79,409 నేరుగా ప్రయోజనం పొందవచ్చు. మిడ్-సైజ్ SUV క్రెటా ప్రారంభ ధరలో దాదాపు రూ. 1.11 లక్షల వరకు తగ్గుదల ఉంటుందని అంచనా. అదే సమయంలో, ప్రీమియం సెగ్మెంట్ వెర్నాపై దాదాపు రూ. 1.10 లక్షలు, అల్కాజర్‌పై రూ. 1.49 లక్షలు, ఫ్లాగ్‌షిప్ SUV టక్సన్‌పై రూ. 2.92 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.  

ధరలు తగ్గితే నిజమైన దీపావళి అయినట్టే

ఈ దీపావళికి ప్రభుత్వం GSTని 28% నుంచి 18%కి తగ్గిస్తే, హ్యుందాయ్ కార్లను కొనడం కస్టమర్‌లకు మునుపెన్నడూ లేనంతగా ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి టాప్-సెగ్మెంట్ SUVల వరకు ప్రతి మోడల్‌పై వేల నుంచి లక్షల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. అయితే, హ్యుందాయ్ కంపెనీ పన్ను తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్‌లకు అందిస్తుందా లేదా దాని ధర విధానంలో కొంత భాగాన్ని ఉంచుకుంటుందా అనే దానిపై అసలు ధర ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, GST తగ్గింపు ఈ పండుగ సీజన్‌లో కారు కొనడానికి ఉత్తమ అవకాశంగా మారుతుందని స్పష్టంగా తెలుస్తుంది.