Vehicle RC download Online: మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పోయినా, చిరిగిపోయినా లేదా అనుకోకుండా ఎక్కడైనా పడిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. గతంలో, ఇలాంటివి జరిగినప్పుడు గతంలో ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లి కొత్తదాని కోసం అప్లై చేయాల్సి వచ్చింది. కొత్త ఆర్సీ వచ్చేందుకు చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లో మీరు ఆప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మీ ఇంటి నుంచే మీ RC డిజిటల్ కాపీని కొన్ని నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి, మీ ఇంటి నుంచే మీ వెహికల్ RCని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో వివరిస్తాము.
RC ఎందుకు అవసరం?
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) అనేది వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ ఉందని చెప్పడానికి అధికారిక పత్రం. ప్రాంతీయ రవాణా కార్యాలయం జారీ చేస్తుంది. వాహనానికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తుంది. ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, యజమాని పేరు , చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం ఇందులో ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసినప్పుడు, బీమా క్లెయిమ్‌లు, వాహన అమ్మకాలు లేదా బ్యాంకు రుణాలు వంటి వివిధ పరిస్థితులకు RC అవసరం అవుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫిజికల్‌గా కానీ డిజిటల్ రూపంలో కానీ RC కలిగి ఉండటం చాలా అవసరం. DigiLocker, mParivahan వంటి ప్రభుత్వ యాప్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న RC కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది.
వెహికల్ 4.0 అంటే ఏమిటి?
వాహన్ 4.0 అనేది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇది వాహన రిజిస్ట్రేషన్, సంబంధిత సేవలను సరళీకృతం, ట్రాన్సపరెంట్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ దేశవ్యాప్తంగా ఉన్న RTOల ఏకీకృత డేటాబేస్‌ను ఉపయోగిస్తుంది, వివిధ రాష్ట్రాల మధ్య వాహన సంబంధిత సమాచారాన్ని పంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ బదిలీ, పన్ను చెల్లింపు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, హైపోథెకేషన్ సంబంధిత సేవలను ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు. RCల డిజిటల్ కాపీలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
RC డిజిటల్ కాపీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
- RC డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ VAHAN పోర్టల్‌కి వెళ్లండి.
- దీని తర్వాత, ఆన్‌లైన్ సర్వీస్‌కి వెళ్లి, వాహన సంబంధిత సేవలపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP ద్వారా లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌ను నమోదు చేయండి.
- తర్వాత డౌన్‌లోడ్ డాక్యుమెంట్ లేదా ఆర్‌సి ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.
- దీని తర్వాత మీ RC స్క్రీన్‌పై కనిపిస్తుంది, దీనిని మీరు PDFగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డిజిలాకర్ నుంచి కూడా ఆర్‌సిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాహన పోర్టల్ కాకుండా, మీరు డిజిలాకర్ నుంచి ఆర్‌సిని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం, ముందుగా డిజిలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విభాగాన్ని ఎంచుకోండి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కు వెళ్లి వాహన సమాచారాన్ని ఫిల్ చేయండి. డిజిలాకర్ ప్రొఫైల్‌లో నమోదు చేసిన పేరు, ఆర్‌సిలో నమోదు చేసిన పేరు సరిపోవాలి. దీని తర్వాత మీ డిజిటల్ RC జారీ చేసిన పత్రాల విభాగంలో కనిపిస్తుంది. ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.