Honda ZR-V Hybrid India:భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో తనదైన గుర్తింపు ఉన్న హోండా కార్స్‌ ఇండియా, తన స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్లాన్ వేసింది. ఈసారి ప్రీమియం కస్టమర్‌లను టార్గెట్ చేస్తూ ప్రీమియం ఎస్‌యూవీ, ZR-V హైబ్రిడ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో ప్లాన్ చేసిన గ్లోబల్- ఫస్ట్‌ వ్యూహం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఆలోచనలు మార్చుకుంది. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును డిజైన్ చేసి మార్కెట్‌లో మరింతగా విస్తరించాలని చూస్తోంది. దీంతోపాటు అప్‌డేటెడ్‌ సిటీ సెడాన్‌ను కూడా రంగంలోకి దించింది.

Continues below advertisement

ఆ వ్యూహం దెబ్బతినడంతో మారిన తీరు

గ్లోబల్- ఫస్ట్‌ ఆలోచనలతో గతంలో చాలా వాహనాలను అంతర్జాతీ మోడల్స్‌తో పోటీ పడి ఇక్కడ మార్కెట్‌ను రూల్ చేద్దామని హోండా భావించింది. కానీ ఇక్కడి కస్టమర్‌లకు ఆకట్టుకోవడంలో మాత్రం ఆ ఆలోచన విఫలమైంది. ఇక్కడి పోటీని తట్టుకోలేకపోయాయి. అందుకే వాటి నుంచి పాఠాలు నేర్చుకున్న హోండా ఇక్కడి కస్టమర్‌ మైండ్‌సెట్‌ను పూర్తిగా స్టడీ చేసింది. వారి ఆలోచనలతోపాటు ప్రాధాన్యతలను పసిగట్టింది. వాటిని బేస్ చేసుకొని ఇక్కడి వారి అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా ప్రీమియం విభాగంలో ZR-Vని తీసుకొచ్చింది. 

Continues below advertisement

ZR-V అంతర్జాతీయంగా 8 లక్షల యూనిట్లకుపైగా విక్రయించింది. ఇది అక్కడి మార్కెట్‌లో విజయవంతమైన కారుగా హోండా చెప్పుకుంటోంది. దీన్ని భారత్‌లో సిబియు (CBU - Completely Built Unit) రూపంలో దిగుమతి చేసుకొని అమ్మకాలు చేపట్టనుంది. దీని వల్ల ధర మాత్రం ప్రీమియంగా ఉంటుందని కంపెనీ ఇప్పటికే తేల్చి చెప్పింది.  

బుకింగ్స్ ప్రారంభం 

కొత్త హోండా ZR-V కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కార్ల డెలివరీ మాత్రం జూలై నెల నుంచి చేయనున్నట్టు హోండా కంపెనీ పేర్కొంది. కారు ఎలా ఉంటుంది ఫీచర్స్ ఏంటనే విషయాన్ని స్పష్టం చేసినప్పటికీ కారు ధర మాత్రం ఇంత వరకు రివీల్ చేయలేదు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. 

డిజైన్ అలా ఉందంటే... 

హోండా ZR-V డిజైన్ పరంగా చాలా విభిన్నంగా ఉంది. ఒక 'క్రాస్ఓవర్' శైలిలో కనిపిస్తుంది. వెడల్పైన గ్రాఫ్టెడ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ LED DRLలతో ఆకట్టుకుంటుంది. క్లామ్‌షెల్ బోనెట్ పైన హోండా లోగోను ఉంచారు. 19-అంగుళాల డైమండ్-కట్ అలాయ్ వీల్స్, రౌండ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో స్లోపింగ్ రియర్ విండ్‌షీల్డ్, క్లియర్-లెన్స్ LED టెయిల్ ల్యాంప్స్, క్రోమ్-ప్లేటెడ్ ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ కారుకు ప్రీమియం ఫినిషింగ్‌ను ఇస్తాయి.

ఈ SUV 4,568 mm పొడవు, 1,840 mm వెడల్పు, 1,620 mm ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,657 mm కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mmగా ఉంది. ఈ కారు ఇంటీరియర్ 'మినిమలిస్ట్' 'ప్రీమియం' థీమ్‌తో రూపొందించారు. డ్యాష్‌బోర్డ్‌ను కార్బన్-ఫైబర్ ఫినిషింగ్ కలిగిన ప్లాస్టిక్ ట్రిమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-స్పీకర్ల బోస్ (Bose) ప్రీమియం ఆడియో సిస్టమ్ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నాయి. 

ఈ కారు సెంటర్ కన్సోల్ 'ఎలివేటెడ్ బ్రిడ్జ్' డిజైన్‌తో ఉంది. సాంప్రదాయ గేర్ లివర్‌కు బదులుగా పుష్-బటన్ టైప్ సెలెక్టర్‌ను ఇచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్,  వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. భద్రత విషయంలో హోండా రాజీ పడలేదు. ఇందులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హోండా సెన్సింగ్ (ADAS) టెక్నాలజీని అందించారు. హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. 

ఇంజిన్ పనితీరు ,మైలేజీ  

హోండా ZR-Vలో భారత్‌లో మొట్టమొదటిసారిగా 2.0-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ స్పోర్ట్స్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. ఇది 184 PS పవర్, 315 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని  అందుకోగలదు.

ఇంతటి శక్తివంతమైన ఇంజిన్ ఉన్నప్పటికీ, ఇది లీటరుకు 22.80 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇది eCVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. బ్యాటరీ ఛార్జ్ ఉన్నంత వరకు ఇది ఆటోమేటిక్‌ EV మోడ్‌లో డ్రైవ్ చేయవచ్చు. ఛార్జ్ తగ్గినప్పుడు పెట్రోల్ ఇంజిన్‌కు మారుతుంది. 

 హోండా ZR-V హైబ్రిడ్, ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కొత్త చరిత్ర సృష్టించాలని ఆలోచనతో లాంచ్ అయ్యింది. అద్భుతమైన డిజైన్, లగ్జరీ ఫీచర్లు, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్ కలయికతో ఇది భారతీయ కస్టమర్లను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.