Honda CB1000 Hornet SP Recall: హోండా, భారత మార్కెట్లో కొత్తగా లాంచ్ చేసిన CB1000 Hornet SP బైక్‌కు రీకాల్ ప్రకటించింది. 13.29 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ లగ్జరీ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్‌ను యూత్ ఓ అద్భుతంలా చూస్తుండగా, కంపెనీ నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఈ రీకాల్ నోటిఫికేషన్ బైక్ ఓనర్లలో కొద్దిపాటి ఆందోళన కలిగించింది.
రీకాల్ ఎందుకు?హోండా, గ్లోబల్ లెవల్‌లో గుర్తించిన ఒక చిన్న సమస్య కారణంగా ఈ రీకాల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంజిన్ నుంచి వచ్చే వేడి సీటు కింద ఉండే పెయింట్ చేసిన భాగాన్ని మృదువుగా మార్చే అవకాశం ఉందని హోండా చెబుతోంది. అలా మృదువైనప్పుడు గేర్ చేంజ్ పెడల్ పివట్ వద్ద బోల్ట్ లూజ్ కావచ్చు. ఇలా జరిగితే, రైడింగ్ సమయంలో గేర్ మారుస్తున్నప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. రైడర్ భద్రతలో చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుందని తెలుసు కాబట్టి, హోండా ఈ రీకాల్‌ను వాలంటరీగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని Honda BigWing Topline షోరూమ్‌లు ఇప్పటికే బైక్ ఓనర్లతో వ్యక్తిగతంగా సంప్రదించడం ప్రారంభించాయి. జనవరి 2026 నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నల్ ఇన్‌స్పెక్షన్‌లు, పార్ట్స్ రీప్లేస్‌మెంట్ ప్రారంభం కానుంది. బైక్ ఓనర్లు తమ 17-అంకెల VIN నంబర్‌ను హోండా వెబ్‌సైట్‌లో నమోదు చేసి తమ బైక్ ఈ రీకాల్‌లో భాగమో, కాదో సులభంగా చెక్ చేసుకోవచ్చు.
మరో కీలక అప్‌డేట్‌హోండా నుంచి మరో ముఖ్యమైన అప్‌డేట్ కూడా వచ్చింది. కొన్ని రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ చేసిన CBR1000RR-R Fireblade SP & Rebel 500 మోడళ్లను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి సైలెంట్‌గా తొలగించింది. ఇది చూసి చాలా మంది బైకర్లలో సందేహాలు మొదలయ్యాయి.
ఈ తొలగింపు ఎందుకు? పరిశ్రమ సమాచారం ప్రకారం, హోండా ఈ రెండు బైక్‌లను భారత్‌కు పరిమిత సంఖ్యలోనే కేటాయించినట్టు తెలుస్తోంది. మొదటి బ్యాచ్ స్టాక్ అమ్ముడైపోవడంతో, వెబ్‌సైట్ నుంచి మోడళ్లను తాత్కాలికంగా తీసేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా, Fireblade SP వంటి ఫ్లాగ్‌షిప్ సూపర్ బైక్‌కు భారత మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. Rebel 500 అయితే భారత మార్కెట్లో మొదటిసారిగా CBU రూపంలో లాంచ్ అయింది. పరిమిత యూనిట్లు మాత్రమే తీసుకురావడం హోండాకు సాధారణ వ్యవహారమే.
గతంలో కూడా CB300R మోడల్‌ను ఇదే విధంగా వెబ్‌సైట్ నుంచి తొలగించడంతో, అది అందుబాటులో లేదని అర్థం చేసుకున్నారు. ఆ మోడల్ CBU కాకపోయినా, లోకలైజ్డ్ కంపోనెంట్స్ ఉన్నా కూడా అమ్మకాలు తగ్గడంతో సైలెంట్‌గా తీసేశారు.
ఈ Fireblade SP & Rebel 500 బైక్‌లు మళ్లీ వచ్చే అవకాశం ఉన్నా, ఎప్పుడు వస్తాయో మాత్రం స్పష్టత లేదు. హోండా కొత్త స్టాక్‌ను భారత మార్కెట్‌కు కేటాయిస్తేనే అవి మళ్లీ మన రోడ్లపై కనిపిస్తాయి.
శాశ్వత తొలగింపు కాకపోవచ్చు!AP, తెలంగాణ బైక్ అభిమానులకు ఈ అప్‌డేట్లు చాలా కీలకం. ముఖ్యంగా, BigWing షోరూమ్‌ల్లో Fireblade SP లేదా Rebel 500 కొనాలనుకున్న వారికి వెబ్‌సైట్‌లో వాటి లిస్టింగ్ కనిపించకపోవడంతో నిరాశ చెందవచ్చు. అయితే ఇది శాశ్వత తొలగింపు కాకపోవచ్చు. కొత్త స్టాక్ రాగానే తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.