Modern Car Technologies: లగ్జరీ కార్లు అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఖరీదైన లెదర్‌ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్‌లు, నిశ్శబ్దంగా ఉండే కేబిన్‌. కానీ నిజమైన లగ్జరీ అక్కడితో ఆగిపోదు. చాలా కార్లలో డ్రైవర్‌కు తెలియకుండానే పనిచేసే హిడెన్‌ ఫీచర్లు ఉంటాయి. ఇవి డ్రైవింగ్‌ను మరింత సేఫ్‌గా, కంఫర్ట్‌గా, స్ట్రెస్‌ లేకుండా మార్చేస్తాయి. చాలామంది యజమానులు ఈ ఫీచర్లను నెలల తర్వాత గమనించి ఆశ్చర్యపోతుంటారు.

Continues below advertisement

స్ప్రే చేయకపోయినా వచ్చే పరిమళాలు

కొన్ని లగ్జరీ కార్లలో ఉండే సెంట్‌ సిస్టమ్‌ సాధారణ పెర్ఫ్యూమ్‌ కాదు. ప్రముఖ కార్ బ్రాండ్లు ప్రొఫెషనల్‌ పెర్ఫ్యూమర్లతో కలిసి ప్రత్యేక పరిమళాలను రూపొందిస్తాయి. ఇవి ఎయిర్‌ కండిషనింగ్‌ డక్ట్స్‌ ద్వారా మైక్రో స్థాయిలో విడుదల అవుతాయి. వాసన ఎక్కువ కాకుండా, డ్రైవర్‌ మూడ్‌ను ప్రశాంతంగా ఉంచేలా ఈ సిస్టమ్‌ పని చేస్తుంది. బయట నుంచి వచ్చే చెడు వాసనలను తొలగించే ఆటో న్యూట్రలైజేషన్‌ మోడ్‌ కూడా ఉంటుంది.

Continues below advertisement

ప్రమాదానికి ముందే స్పందించే సీటుబెల్ట్‌లు

కొన్ని ప్రీమియం కార్లలో ప్రి-సేఫ్‌ సీటుబెల్ట్‌లు ఉంటాయి. కారు ముందు ప్రమాదం ఉందని సెన్సార్లు గుర్తిస్తే, బ్రేక్‌ వేయకముందే సీటుబెల్ట్‌లు స్వల్పంగా బిగుతుగా మారతాయి. దీంతో ప్రయాణికులు సేఫ్‌ పొజిషన్‌లో ఉంటారు. డ్రైవర్‌కి ఇది తెలిసేలోపే ఈ సిస్టమ్‌ తన పనిని పూర్తి చేస్తుంది.

వినిపించని శబ్దం - యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌

లగ్జరీ కార్లలో నిశ్శబ్దం అంటే కేవలం ఇన్సులేషన్‌ మాత్రమే కాదు. కొన్ని కార్లు హైఎండ్‌ హెడ్‌ఫోన్ల మాదిరిగా Active Noise Cancellation టెక్నాలజీని ఉపయోగిస్తాయి. మైక్రోఫోన్‌లు రోడ్‌ శబ్దాన్ని గుర్తించాక, స్పీకర్లు దానికి వ్యతిరేక శబ్ద తరంగాలను విడుదల చేస్తాయి. ఫలితం - రఫ్‌ రోడ్లు కూడా మృదువుగా అనిపిస్తాయి.

తనంతట తానే మూసుకుపోయే డోర్లు

డోర్‌ను పూర్తిగా మూయకపోయినా, చివరి కొన్ని మిల్లీమీటర్లలో సాఫ్ట్‌ క్లోజ్‌ మెకానిజం దాన్ని తానే లాగి మూసేస్తుంది. డోర్‌ను గట్టిగా మూయాల్సిన అవసరం ఉండదు, చిన్నగా నెట్టినా తనంతట తానే క్లోజ్‌ అవుతుంది. ఇది చిన్న విషయంగా అనిపించినా, రోజూ ఉపయోగంలో ఇది లగ్జరీ ఫీలింగ్‌ను పెంచుతుంది.

మైక్రో క్లైమేట్‌ కంట్రోల్‌

సాధారణ మల్టీ జోన్‌ ACకి మించి, కొన్ని కార్లు సీటు దగ్గర ఉన్న శరీర ఉష్ణోగ్రతను సెన్సార్లతో గుర్తించి గాలి ప్రవాహాన్ని మార్చుతాయి. కాళ్ల దగ్గర వేడి గాలి, పై భాగంలో చల్లని గాలి అందేలా సెట్‌ చేస్తాయి. దీర్ఘ ప్రయాణాల్లో ఇది కంఫర్ట్‌ను బాగా పెంచుతుంది.

రోడ్డును చదివే హెడ్‌ల్యాంప్స్‌

ఆధునిక లగ్జరీ కార్లలోని అడాప్టివ్‌ హెడ్‌ల్యాంప్స్‌ కేవలం వెలుతురు మాత్రమే ఇచ్చేలా ఉండవు. కెమెరాలు, జీపీఎస్‌ సహాయంతో మలుపుల ముందు లైట్‌ను విస్తరించి చూపిస్తాయి. ఎదురుగా వాహనం వస్తే ఆ భాగంలో వెలుతురు తగ్గిస్తాయి. డ్రైవర్‌కి తెలియకుండానే విజిబిలిటీ మెరుగుపడుతుంది.

ముందే ఆలోచించే బూట్‌ స్పేస్‌

కొన్ని లగ్జరీ SUVలలో బూట్‌ ఓపెన్‌ చేస్తే దాగి ఉన్న హుక్స్‌, స్లైడింగ్‌ పార్టిషన్లు బయటకు వస్తాయి. కూరగాయలు, బ్యాగులు కదలకుండా ఇవి సహాయపడతాయి. కొన్ని కార్లు వెనుక సస్పెన్షన్‌ను తానే తగ్గించుకుని లగేజీ ఎత్తడం సులభం చేస్తాయి.

గుంతల కోసం ముందే అలర్ట్‌

ఫ్రంట్‌ కెమెరాలు రోడ్డుపై ఉన్న గుంతలను స్కాన్‌ చేసి, సస్పెన్షన్‌ను ముందుగానే సర్దుబాటు చేస్తాయి. డ్రైవర్‌కు మాత్రం కారు తేలికగా వెన్న మీద జారినట్లే అనిపిస్తుంది.

లగ్జరీ కార్లు అంటే వాటి అసలైన విలువ వేగంలో లేదా ధరలో లేదు. డ్రైవర్‌కి ఆలోచన కూడా రాకుండా పని చేసే ఈ హిడెన్‌ ఫీచర్లే నిజమైన లగ్జరీ. మీరు గమనించని ప్రతి చిన్న సౌకర్యం వెనుక పెద్ద ఇంజినీరింగ్‌ ఉంటుంది. అందుకే లగ్జరీ కారు నడిపేటప్పుడు... డ్రైవర్‌కు పని తక్కువ, కంఫర్ట్‌ ఎక్కువ.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.