Updated Hero Xtreme 160R 4V: టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్, తన ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్‌ను కొత్త రూపంలో తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లను జోడించింది. ముఖ్యంగా టాప్ వేరియంట్లో టీఎఫ్టీ డిస్ప్లేను అందిస్తోంది. క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్లు వంటి సదుపాయాలతో బైక్ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో కంపెనీ, ఈ బైక్ ప్రారంభ ధరను రూ.1.27 లక్షలు ఎక్స్‌షోరూమ్‌గా నిర్ణయించింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది.
హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ 2023 నుంచి బజాజ్ పల్సర్ NS160, టీవీఎస్ అపాచీ RTR 160 వంటి మోడళ్లకు పోటీ ఇస్తోంది. గతంలో తీసుకొచ్చిన కంబాట్ ఎడిషన్‌కు కొనసాగింపుగా ఇప్పుడు మరిన్ని మార్పులు చేసింది. కొత్త రూపం, మెరుగైన ఇంజిన్ పనితీరు & అదనపు సాంకేతిక సదుపాయాలతో మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
కొత్త డిజైన్.. ఆకట్టుకునే రంగులు
ఈసారి బైక్ రూపురేఖల్లో హీరో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇంధన ట్యాంక్, వెనుక సీటు కవర్ ఆకృతిని మరింత షార్ప్‌గా మార్చింది. స్పోర్టీ లుక్‌ను మెరుగుపరిచింది. కొత్త రంగులను కూడా పరిచయం చేసింది.
ఈ బైక్ స్టాండర్డ్, ప్రో, కార్బన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్లో ఫైర్‌స్టార్మ్ రెడ్, పెర్ల్ బ్లాక్ రంగులు ఉన్నాయి. ప్రో వేరియంట్ ప్రో రెడ్, ప్రో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. టాప్ కార్బన్ వేరియంట్లో కార్బన్ రెడ్, కార్బన్ బ్లాక్, కార్బన్ గ్రే, అబ్రాక్స్ ఆరెంజ్ రంగులను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
ఇంజిన్‌లో స్వల్ప మార్పు
కొత్త ఎక్స్ట్రీమ్ 160R 4Vలో 164.32 సీసీ, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. గరిష్ఠ శక్తి 16.9 హెచ్‌పీ నుంచి 17.1 హెచ్‌పీకి పెరిగింది. ఈ శక్తి ఇప్పుడు 8,750 ఆర్పీఎం వద్ద లభిస్తుంది. గరిష్ఠ టార్క్ మాత్రం 14.6 ఎన్ఎం వద్ద యథాతథంగా ఉంది. ఇది 6,500 ఆర్పీఎం వద్ద అందుబాటులో ఉంటుంది.
వేరియంట్‌ను బట్టి ఫీచర్లు
స్టాండర్డ్ వేరియంట్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, మెకానికల్ థ్రాటిల్ ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు సింగిల్ ఛానల్ ABS అందించారు. కంబాట్ ఎడిషన్‌లో ఉన్న ఎల్సీడీ డిస్ప్లేను ఇందులోనూ కొనసాగించారు.
ప్రో వేరియంట్లో ఫీచర్లు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇందులో రైడ్ బై వైర్ సాంకేతికతతో పాటు రెయిన్, రోడ్, స్పోర్ట్స్ అనే మూడు రైడ్ మోడ్లు ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్ కూడా అందించారు. ముందు భాగంలో 37 మిల్లీమీటర్ల కేవైబీ యూఎస్డీ ఫోర్క్, వెనుక భాగంలో సర్దుబాటు చేసుకునే మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS భద్రతను మెరుగుపరుస్తుంది. ముందు 276 మిల్లీమీటర్లు, వెనుక 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
టాప్ కార్బన్ వేరియంట్లో ప్రత్యేక ఆకర్షణ టీఎఫ్టీ డిస్ప్లే. హీరో ఎక్స్‌పల్స్ 210లో ఉపయోగించిన డిస్ప్లేకు మార్పులు చేసి ఈ బైక్‌కు అనుగుణంగా రూపొందించారు. ప్రో వేరియంట్లోని ఇతర ఫీచర్లన్నీ ఇందులోనూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
ధరలు, డెలివరీ వివరాలు
కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.27 లక్షలు. ప్రో వేరియంట్ ధర రూ.1.37 లక్షలు. టాప్ కార్బన్ వేరియంట్ ధర రూ.1.41 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.
గతంలో ఉన్న కంబాట్ ఎడిషన్‌తో పోలిస్తే ప్రో వేరియంట్ ధర స్వల్పంగా తగ్గింది. కొత్త డిజైన్‌తో పాటు అదనపు సదుపాయాలను హీరో అందిస్తోంది. ఈ బైక్ బుకింగ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న హీరో షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్ నుంచి మొదలుకానున్నాయి. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
