Hero Xtreme 125R vs Honda SP125: భారత్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో 125సీసీ సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత వేగంగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు కేవలం మైలేజీకే పరిమితమైన ఈ సెగ్మెంట్, ఇప్పుడు స్టైల్, పెర్ఫార్మెన్స్, అత్యాధునిక ఫీచర్ల కలయికగా మారింది. ఈ విభాగంలో గట్టి పోటీని ఇస్తుంది. రెండు ముఖ్యమైన బైక్‌లు హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా ఎస్పీ 125. ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు సరిపోతుంది? ధర, మైలేజీ, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా మరింత విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.
ధర, వేరియంట్లు
ఎలాంటి వాహనం కొనాలని అనుకున్నా ముందు చూసేది ధర. హోండా ఎస్పీ 125 ఎక్స్- షో రూమ్ ధర సుమారు 88, 750 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి విరుద్ధంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ధర కొంత ఎక్కువగా 90, 672గా నిర్ణయించారు. హోండా ఎస్పీ 125 ఐదు విభిన్న రంగులతో లభిస్తుండగా, హీరో ఎక్స్‌ట్రీమ్ మూడు ఆకర్షణీయమైన రుంగులలో అందుబాటులో ఉంది. ధర పరంగా చూస్తే హోండా ఎస్పీ125 కొంత చౌకగా కనిపిస్తోంది.
ఇంజిన్ సామర్థ్యం, పనితీరు
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో 124.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 11.4 bhp శక్తిని, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా ఎస్పీ125లో 123. 94cc ఇంజిన్ ఉండగా, ఇది 10.72bhp శక్తిని, 10.9Nm టార్క్‌ను అందిస్తుంది.
రెండు బైక్‌లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉన్నాయి. గరిష్ట వేగం పరంగా చూస్తే, రెండు బైక్‌లు గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలు. అయితే వేగవంతమైన పికప్ కోరుకునే వారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మెరుగైన ఎంపికగా ఉంటుంది.
మైలేజీ, ఇంధన పొదుపులో ఎవరు ముందున్నారు?
125cc బైక్ కొనేవారు ప్రధానంగా సూచేది మైలేజీ. ఈ విషయంలో హోండా ఎస్పీ 125 స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. వినియోగదారుల నివేదిక ప్రకారం హోండా ఎస్పీ 125 లీటర్‌కు 62కిలోమటర్ల మైలేజీ ఇస్తుండగా, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లీట్‌కు57 కిలోమీటర్లు మైలేజీ మాత్రమే అందిస్తుంది. మీరు ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారైతే, హోండా ఎస్పీ 125 మీకు భారీగా ఇంధన ఖర్చులను ఆదా చేస్తుంది.
డిజైన్, డైమెన్షస్
డిజైన్ పరంగా రెండు బైక్‌లు విభిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి ఉన్నాయి. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R యువతను ఆకర్షించేలా స్పోర్టీ, అగ్రెసివ్ లుక్‌తో వస్తుంది. దీని బరువు 136 కేజీలు, ఇది హోండా కంటే కాస్త బరువుగా ఉంటుంది. హోండా ఎస్పీ 125 కేవలం 116 కేజీల బరువుతో చాలా తేలికా ఉంటుంది. దీని వల్ల సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించడం సులభతరం అవుతుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్, హోండా కంటే మెరుగ్గా ఉంది. ఇది ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. సీటు ఎత్తులో స్వల్ప తేడాలు ఉన్నాయి.
ఫీచర్లు, భద్రత విషయంలో ఎవరి సత్తా ఏంటీ?
సాంకేతికతపరంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125Rలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎస్పీ 125లో ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, డిజిటల్ కన్సోల్, సైలెంట్ స్టార్ట్ వంటి ఫీచర్ల ఉన్నాయి. భద్రత విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్ ఐీఎస్, 240 మి.మి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. హోండా ఎస్పీ 125లో సీబీఎస్ అందుబాటులో ఉంది. టైర్ల విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్ వెనుక వైపు 120/80-17 వెడల్పాటి టైర్‌ను కలిగి ఉండటం వల్ల రోడ్డుపై మెరుగైన పట్టును ఇస్తుంది.
వారంటీ- సర్వీస్
కస్టమర్ నమ్మకాన్ని పెంచడంలో హీరో మోటోకార్ప్ ముందుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ఐదేళ్లలు లేదా 70వేల కిలోమీటర్లు వారంటీ లభిస్తుంది. దీనికి అదనంగా ఐదు ఉచిత సర్వీస్‌లు కూడా ఉన్నాయి. హోండా ఎస్పీ 125పై మూడేళ్ల లేదా 42వేల కిలోమీర్ల వారంటీ మాత్రమే లభిస్తుంది. మూడు ఉచిత సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి.
మీకు స్పోర్టీ లుక్, ఎక్కువ పవర్, మెరుగైన వారంటీ , స్టైలిష్ ఎల్‌ఈడీ ప్రొజెక్ట్ లైట్లు కావాలనుకుంటే హీరో ఎక్స్‌ట్రీమ్ 125R కొనుగోలు చేయవచ్చు. మీకు అత్యుత్తమ మైలేజీ, తక్కువ ధర, తేలికపాటి, స్మూత్ ఇంజిన్ కోసం చూస్తుంటే మీరు కచ్చితంగా హోండా ఎస్పీ 125ను ఎంచుకోవచ్చు.
