Hero MotoCorp కంపెనీకి చెందిన Vida బ్రాండ్ భారతదేశంలో పిల్లల కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను ప్రారంభించింది. దీని పేరు Vida Dirt.E K3. 4 నుంచి 10 సంవత్సరాల పిల్లలను దృష్టిలో ఉంచుకుని బైక్ తయారు చేసింది కంపెనీ. వేగం, బైక్ నడపడం ఇష్టపడే పిల్లల కోసం ఈ చిన్న బైక్ రూపొందించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేగం, కంట్రోల్ పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లో ఉంటాయి. దాంతో ఇది పిల్లల భద్రతను నిర్ధారిస్తుంది.
ప్రారంభ ధర, వెల్‌కం ఆఫర్
Hero Vida Dirt.E K3 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69,990గా ఫిక్స్ చేశారు. ఈ ధర మొదటి 300 మంది కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తుందని హీరో విడా పేర్కొంది. ఆ తర్వాత దీని ధర పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఈ బైక్‌ను మొదటిసారిగా భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. తరువాత అంతర్జాతీయ ప్రదర్శనలో దాని ప్రొడక్ట్ నమూనాను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారతదేశంలో చిన్నపిల్ల బైక్ అధికారికంగా ప్రారంభించారు.
తేలికపాటి బైక్, పిల్లలకు అనుగుణంగా డిజైన్
Vida Dirt.E K3 కేవలం 22 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇది చిన్న పిల్లలు కూడా సులభంగా నడిపేలా, మెయింటైన్ చేసేలా చేస్తుంది. ఇందులో 3 రకాల సీటు ఎత్తులు ఉన్నాయి. దాంతో పిల్లల తమ ఎత్తుకు అనుగుణంగా బైక్‌ను సెట్ చేయవచ్చు. పిల్లలు పెద్దయ్యాక, బైక్‌ను కూడా అదే విధంగా మార్చవచ్చు. సీటు, హ్యాండిల్, వీల్ స్థానాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఇది ఎక్కువ కాలం ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.
భద్రతకు పూర్తి ప్రాధాన్యత
ఈ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌లో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో తొలగించగల ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. దీని వలన పిల్లలు అవసరమైతే బైక్‌ను నెట్టడం ద్వారా కూడా నడపవచ్చు. పడిపోతే గాయాలు కాకుండా హ్యాండిల్‌పై సాఫ్ట్ చెస్ట్ ప్యాడ్ ఇచ్చారు. ఇది మాగ్నెటిక్ కిల్ స్విచ్‌ను కూడా కలిగి ఉంది. ఇది పడిపోయిన వెంటనే బైక్‌ను ఆపివేస్తుంది. ప్రస్తుతం, ఇది వెనుక బ్రేక్‌ను మాత్రమే కలిగి ఉంది. కానీ భవిష్యత్తులో డిమాంగ్ తగ్గట్లుగా ముందు బ్రేక్‌ను కూడా తీసుకురావచ్చు.
యాప్ నియంత్రణ, బ్యాటరీ, స్పీడ్ ఎంపికలు
Vida Dirt.E K3 మొబైల్ యాప్ సపోర్ట్‌ను సైతం కలిగి ఉంది. ఈ యాప్ ద్వారా తల్లిదండ్రులు ఆ బైక్ వేగాన్ని, టార్క్ నియంత్రించవచ్చు. ఇది రిమూవ్ చేయగల 360Wh బ్యాటరీ, 500W మోటార్‌ను కలిగి ఉంది. బైక్‌లో 3 రైడ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో 8 km/h, 17 km/h సహా 25 km/h గరిష్ట వేగం అందుబాటులో ఉంది. ఈ బైక్ పిల్లలకు ఎలక్ట్రిక్ విభాగంలో ఒక కొత్త, సురక్షితమైన ఎంపికగా భావిస్తున్నారు. అడ్వెంచర్ తరహా ఆలోచన, తాము సైతం బైక్ డ్రైవింగ్ చేస్తున్నామని భావించే పిల్లల కోసం ఈ బైక్ తీసుకొచ్చారు.
Also Read: Ather 450 XE Price: ఒక్క ఛార్జ్ తో 161 కిలోమీటర్ల రేంజ్.. ఏథర్ 450 X ఈ స్కూటర్ ధర, ఫీచర్లు ఇవే