Hero Destini 110 Classique Edition: హీరో మోటోకార్ప్, తన డెస్టినీ 110 స్కూటర్‌లో కొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది. డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్ పేరుతో వచ్చిన ఈ కొత్త వేరియంట్ ధరను రూ.76,400గా నిర్ణయించింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఇందులో ఇంజిన్ లేదా మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త కలర్స్, ప్రత్యేకమైన స్టైలింగ్ అంశాలతో స్కూటర్‌కు కొత్త లుక్ ఇచ్చింది.

Continues below advertisement

హీరో 2025లో తొలిసారిగా డెస్టినీ 110ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ 110cc స్కూటర్ల విభాగంలో Xoom 110, Pleasure+ XTEC తర్వాత తీసుకొచ్చిన మూడో మోడల్ ఇది. ఏడాదికి పైగా గడిచిన తర్వాత ఇప్పుడు క్లాసిక్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.

కొత్త ఎడిషన్‌లో ఏం ఉంది?

Continues below advertisement

డెస్టినీ 110 ప్రస్తుతం VX, ZX అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్త క్లాసిక్ ఎడిషన్‌ను బేస్ VX వేరియంట్ ఆధారంగా రూపొందించారు. అందువల్ల ఇందులో ముందు భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. టాప్ ZX వేరియంట్‌లో మాత్రం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అందిస్తున్నారు.

కొత్త ఎడిషన్‌లో ప్రధాన మార్పులు రంగులు, డిజైన్‌కే పరిమితమయ్యాయి. ఇందులో మూడు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు రెండు రకాల ఇన్నర్ ప్యానెల్ రంగులను అందించారు.

సిల్వర్, గ్రే కలర్ ఆప్షన్లలో బ్రౌన్ కలర్‌ ఇన్నర్ ప్యానెల్స్ ఉంటాయి. బ్రౌన్ కలర్ ఎంచుకుంటే మాత్రం నలుపు రంగు ఇన్నర్ ప్యానెల్స్ కనిపిస్తాయి. స్కూటర్ మొత్తం రంగుకు సరిపోయేలా మిర్రర్స్‌ను కూడా అందించారు. ప్రత్యేకమైన 3D ఎంబ్లమ్, సైడ్ భాగంలో స్ట్రైప్స్ కొత్త ఎడిషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి.

ఇది కూడా చదవండి: 2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!

ఇంజిన్, పనితీరులో మార్పుల్లేవ్

క్లాసిక్ ఎడిషన్‌లో కూడా అదే 110.9cc ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 7,250rpm వద్ద 8.2hp పవర్, 5,750rpm వద్ద 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు వైపులా 12 అంగుళాల చక్రాలను అందించారు. అంటే కొత్త ఎడిషన్ కొనేవారికి ఇంజిన్ పనితీరులో అదనపు మార్పులు ఉండవు. ప్రధానంగా కొత్త డిజైన్, కలర్ ఆప్షన్లే దీని ప్రత్యేకత.

ధర ఎంతంటే?

హీరో డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్ ధర 76,400 రూపాయలు. బేస్ VX వేరియంట్‌తో పోలిస్తే ఇది కేవలం రూ.1,400 ఎక్కువ. టాప్ ZX వేరియంట్ ధర మాత్రం రూ.83,800గా కొనసాగుతోంది. ప్రస్తుతం హీరో వెబ్‌సైట్‌లో ZX వేరియంట్ బ్లూ కలర్‌లో మాత్రమే కనిపిస్తోంది.

కొత్త క్లాసిక్ ఎడిషన్ ఇప్పటికే హీరో మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ షోరూమ్‌లలో కూడా ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇది కూడా చదవండి: Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.