GPS Tracking System For Cars And Bikes: కార్ కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి, బైక్ కొనాలన్నా లక్షకు తక్కువ రాదు. ఒకసారి కొన్న బండికి దురదృష్టవశాత్తు ఏవైనా జరిగితే, మళ్లీ కొత్తది కొనలేని ఆర్థిక పరిస్థితి మధ్య తరగతి ప్రజలది. కాబట్టి, తొలి బండినే చాలా జాగ్రత్తగా ఏళ్ల తరబడి వాడతారు. లక్షల రూపాయలు పోసి కొన్న కార్ లేదా బైక్ దొంగతనానికి గురైతే ఆ బాధ వర్ణనాతీతం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఆ బండి మళ్లీ దొరుకుందో, లేదో తెలీదు. పైగా, బండి ముడిపడిన పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఈ ఇబ్బందులు రాకుండా, ముందు జాగ్రత్తగా, బండిని కొన్నప్పుడే లేదా ఆ తర్వాత GPS (Global Positioning System) పరికరాలు బిగించుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. GPS డివైజ్ ఉన్న బండి దొంగల చేతుల్లోకి వెళ్లినా బెంగ పడకుండా, నిశ్చింతగా ఉండవచ్చు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌తో, ఆ బండి ఆ క్షణంలో ఎక్కడ ఉందో ఈజీగా కనిపెట్టొచ్చు. దీనివల్ల, బండీ దొరుకుంది & దొంగా దొరుకుతాడు.
జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్ రేటెంత?కొన్ని కంపెనీలు జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్ అమ్ముతున్నాయి & సేవలు అందిస్తున్నాయి. ఒక్కో ఉపకరణం ధర దాని నాణ్యత & పనితీరు ఆధారంగా రూ.1500 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. బండిని కొనే ఖర్చుతో పోలిస్తే ఇది పెద్ద మొత్తమేమీ కాదు.
జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్ ఎలా పని చేస్తుంది?జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌లో సిమ్ కార్డ్ ఉంటుంది, దీనిని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తుండాలి. ఈ జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌ను కార్ లేదా బైక్ లేదా ఏ వాహనంలోనైనా అమర్చుకోవచ్చు. దీనిని, బండిలో బయటకు కనిపించని ప్రాంతంలో బిగించి బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. కొన్ని డివైజ్‌ల్లో ప్రత్యేకంగా బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ ఆధారంగా అవి పని చేస్తాయి. బండి ఓనర్‌లో మొబైల్ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను లింక్ చేస్తారు. వెబ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా కూడా దీనిని వాడుకోవచ్చు. శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఆ బండి ఉన్న అక్షాంశ, రేఖాంశాలను ఖచ్చితంగా గుర్తిస్తారు. తద్వారా, వాహనం ఉన్న కచ్చితమైన స్థానం మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది.
మరెన్నో ప్రయోజనాలుజీపీఎస్ పరికరం ఉన్న వాహనం దొంగల చేతుల్లోకి వెళితే... ఆ బండి ఎక్కడ ఉంది, ఏ రూట్‌లో వెళుతోందో రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాదు, పార్క్ చేసిన బండిని ఆ ప్రాంతం నుంచి కదిలించాలని చూడగానే, ఓనర్ మొబైల్ పోన్‌లో అలారం మోగుతుంది. అంటే, మీరు ఎక్కడ ఉన్నా మీ బండిపై ఓ కన్నేసి ఉంచవచ్చు. కొన్ని ట్రాకర్లతో బండి ఇంజిన్‌ను వెంటనే ఆపేయవచ్చు మళ్లీ స్టార్ట్ కాకుండా లాక్ చేయవచ్చు.
మీ బండికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటే, వాహనం చోరీకి గురైతే, వెంటనే లోకల్ పోలీసుకు ఫిర్యాదు చేస్తే చాలు. ఆ బండిని ఎక్కడ ఉన్నా క్షణాల్లో కనిపెట్టి, గంటల వ్యవధిలోనే రికవరీ చేయవచ్చు. అంతెందుకు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందని అనుమానం ఉంటే, ఆ బండిని ముట్టుకోవడానికి కూడా దొంగలు జంకుతున్నారని పోలీసులు చెబుతున్నారు. జీపీఎస్ ట్రాకింగ్ సాంకేతికత వచ్చాక, తెలుగు రాష్ట్రాల్లో వాహనాల చోరీల సంఖ్య బాగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కొన్ని ఇబ్బందులుజీపీఎస్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ, కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దొంగలు సిగ్నల్ జామర్‌ను ఉపయోగిస్తే జీపీఎస్ ట్రాకర్ పని చేయదు. నెట్‌వర్క్ లేని ప్రాంతంలోకి తీసుకెళితే, డివైజ్‌లోని సిమ్ నుంచి సిగ్నల్స్ రావు. దొంగలు ట్రాకర్ ఎక్కడ ఉందో కనిపెట్టి దానిని డిస్‌కనెక్ట్ చేసినా అది పని చేయదు. అంతేకాదు, ట్రాకర్‌లోని సిమ్ కార్డ్‌ను రీఛార్జ్ చేయడం మరిచిపోయినా అది నిరుపయోగంగా మారుతుంది.