Good vs Bad Vehicle Number Plates Rules: రోడ్లపై నడిచే వాహనాలకి నంబర్‌ ప్లేట్‌ అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదు, అది చట్టపరంగా తప్పనిసరి నిబంధన. కానీ, కొంత మంది ప్రజలు, నంబర్‌ ప్లేట్ల విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. నంబర్‌ ప్లేట్లలోని అక్షరాలు, అంకెలను అష్ట వంకర్లు తిప్పుతున్నారు. కొటేషన్స్‌ రాస్తున్నారు. దీనివల్ల తమ వెహికల్‌ నంబర్‌ ప్లేట్‌ "స్టైల్‌"గా కనిపిస్తుందని భావిస్తారు. నిజానికి, అలాంటి వారికి చివరికి పెద్ద జరిమానాలు తప్పవు. కాబట్టి, ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కనేల?, జలుబు వదిలించుకోనేల? అనుకునే వాళ్లు గుడ్‌ నంబర్‌ప్లేట్‌ ఏది? బ్యాడ్‌ నంబర్‌ప్లేట్‌ ఏది? అనేది క్లియర్‌గా తెలుసుకోవాలి.

గుడ్‌ నంబర్‌ప్లేట్‌ అంటే ఏంటి?

ప్రస్తుతం ఇండియాలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లు (HSRP) తప్పనిసరి అయ్యాయి. వీటిలో ప్రత్యేకమైన లేజర్‌ ఇంగ్రేవింగ్‌, యూనిక్‌ కోడ్‌, టాంపర్‌ ప్రూఫ్‌ స్టికర్‌ ఉంటాయి.

ఫాంట్‌ సైజ్‌ క్లియర్‌గా ఉంటుంది

తెల్ల బ్యాక్‌ గ్రౌండ్‌పై నల్ల అక్షరాలు (పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు)

పసుపు బ్యాక్‌ గ్రౌండ్‌పై నల్ల అక్షరాలు (కమర్షియల్‌ వాహనాలకు)

గ్రీన్‌ ప్లేట్‌పై తెల్ల అక్షరాలు (ఎలక్ట్రిక్‌ వాహనాలకు)

ఇలాంటివి గుడ్‌ నంబర్‌ ప్లేట్లు. ఇవి మాత్రమే చట్టబద్ధం & సేఫ్‌. పోలీసులు కూడా అప్రూవ్‌ చేస్తారు, ఎలాంటి ఇబ్బంది పెట్టరు.

బ్యాడ్‌ నంబర్‌ ప్లేట్‌లు ఏవి?

చాలామంది తమ వాహనాలను స్టైలిష్‌గా చూపించడానికి రకరకాల ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్లు వాడుతుంటారు. అవన్నీ నిబంధనలకు విరుద్ధం:

డిజైన్‌ స్టిక్కర్లు, గ్లిట్టర్‌ నంబర్స్‌

డిఫరెంట్‌ ఫాంట్స్‌ (ఇటాలిక్స్‌, కర్సివ్‌ మొదలైనవి)

చిన్న సైజు లేదా చాలా పెద్ద సైజు అక్షరాలు

స్టేట్‌ ఎంబ్లమ్స్‌, లోగోలు, కొటేషన్లు లేదా దేవుడి పేర్లు వేసుకోవడం

నంబర్‌ను ఇంగ్లీష్‌, హిందీ కాకుండా వేరే భాషలో రాయడం

ఫలానా వారి తాలూకా అని రాసుకోవడం

డాడ్స్‌ గిఫ్ట్, మామ్స్‌ గిఫ్ట్‌ వంటివి నంబర్‌ ప్లేట్‌పై రాయడం

ఇలాంటివన్నీ బ్యాడ్‌ నంబర్‌ ప్లేట్లు. అంటే, బండి నంబర్‌ ప్లేట్‌ మీద ఆ వెహికల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ మాత్రమే ఉండాలి, వేరే ఏ ఇతర రాతలు, గుర్తులు ఉండకూడదు, దూరం నుంచి చూసినా స్పష్టంగా కనిపించాలి. ఈ రూల్స్‌ పాటించకుండా ఇష్టం వచ్చిన రాతలు రాసి & రంగులు పూస్తే, అలాంటివి స్టైలిష్‌గా కనిపించవచ్చు, కానీ మీకు సరైన ట్రాఫిక్‌ పోలీస్‌ తగిలితే కచ్చితంగా జరిమానా వేస్తారు.

రూల్స్‌ ఏమంటున్నాయి?

మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌ ప్రకారం నంబర్‌ప్లేట్‌ తప్పనిసరిగా RTO ఆమోదించిన ఫార్మాట్‌లో ఉండాలి. ఫ్యాన్సీగా మార్చుకుంటే:

రూ. 1,000 నుంచి రూ. 10,000 వరకు ఫైన్‌ పడుతుంది

ఒకసారి జరిమానా విధించినా నంబర్‌ ప్లేట్‌ సరి చేసుకోకపోతే (రిపీట్‌ అఫెన్స్‌ అయితే), ఆ బండి రిజిస్ట్రేషన్‌ను కూడా సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది

ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలి?

నంబర్‌ప్లేట్‌ అనేది వాహనానికి ఐడెంటిటీ. యాక్సిడెంట్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన లేదా ఎలాంటి క్రైమ్‌ జరిగినా, పోలీసులు ముందు చూసేది నంబర్‌ ప్లేట్‌నే. అది కరెక్ట్‌గా, క్లియర్‌గా లేకపోతే లీగల్‌గా సమస్యలు వస్తాయి.

"గుడ్‌ నంబర్‌ ప్లేట్‌" అంటే కచ్చితంగా RTO రూల్స్‌ ఫాలో అవుతూ, క్లియర్‌గా ఉండేది. "బ్యాడ్‌ నంబర్‌ ప్లేట్‌" అంటే స్టైలిష్‌గా కనిపించినా, చట్ట నిబంధనలకు అనుగుణంగా లేనిది. మీ వాహనానికి ఎలాంటి నంబర్‌ ప్లేట్‌ ఉండాలో బిగించుకోవాలన్నది ఇక మీ ఇష్టం.