భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు చెక్ పెట్టేందుకు, పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు చూస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త EV మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది టాటా సియెర్రా EV తో పాటు, మొత్తం నాలుగు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లోకి రానున్నాయా. ముఖ్యంగా మారుతి సుజుకి, టయోటా తమ మొదటి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుండటం మార్కెట్ వర్గాలను ఆకర్షిస్తోంది. టాటా మోటార్స్ దాని పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. ఈ వాహనాల రేంజ్, ఫీచర్లు, డిజైన్ పరంగా ఎలా ఉన్నాయో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

మారుతి సుజుకి ఈ విటారా (Maruti Suzuki e Vitara )మారుతి సుజుకి ఇ విటారా భారత్‌లో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ SUV అవుతుంది. ఇది 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుందని  భావిస్తున్నారు. ఈ కారు రెండు బ్యాటరీ 49 kWh, 61 kWh ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. పెద్ద బ్యాటరీతో ఈ EV ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ కారు దాదాపు 172 bhp శక్తిని జనరేట్ చేస్తుంది. డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కారు కోసం చాలా కాలం నుంచి మార్కెట్లో ఎదురుచూస్తున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella)టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా మారుతి ఇ విటారా ఆధారంగా రూపొందించబడింది, అయితే దీని డిజైన్ పదునుగా మరియు మరింత ప్రీమియంగా ఉంటుంది. ఇది 48.8 kWh మరియు 61.1 kWh బ్యాటరీలతో కూడా అమర్చబడి ఉంటుంది, ఇది గరిష్టంగా 543 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. ఇది టయోటా యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు అవుతుంది, ఇది కంపెనీ EV విభాగంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది.

టాటా సియెర్రా EV (Tata Sierra EV), టియాగో EV ఫేస్‌లిఫ్ట్ (Tiago EV Facelift) టాటా తన ఐకానిక్ సియెర్రాను ఎలక్ట్రిక్ అవతార్‌లో భారత మార్కెట్లోకి తిరిగి తీసుకువస్తోంది. టాటా సియెర్రా EV AWD ఎంపికలను, 55 లేదా 65 kWh బ్యాటరీతో అందించవచ్చు. ఈ కారు సుమారు 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా 2026లోనే త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇందులో కొత్త లుక్, డిజిటల్ డాష్‌బోర్డ్ ఉంటుంది. అయితే బ్యాటరీ, రేంజ్ అలాగే ఉంటాయని కంపెనీ తెలిపింది.

టాటా అవిన్యా స్పోర్ట్‌బ్యాక్ (Tata Avinya Sportback)టాటా అవిన్యా స్పోర్ట్‌బ్యాక్ కంపెనీ నుంచి అత్యంత హై-టెక్, ప్రీమియం ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఈ కారు 2026 చివరి నాటికి ప్రారంభించనున్నారు. త్వరగా టెస్టింగ్ కనుక పూర్తయితే కొన్ని నెలల్లో అవిన్యా స్పోర్ట్ బ్యాక్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది.  600 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుందని వాహనదారులు భావిస్తున్నారు. కంపెనీ మాత్రం ఈ కారు గురించి ఎక్కువ వివరాలు అందుబాటులో ఉంచలేదు. టెస్టింగ్ పూర్తయ్యాక వివరాలు లీకయ్యే అవకాశం ఉంటుంది.