Ford Bronco EV Price, Range And Features In Telugu: ఫోర్డ్, తన ఐకానిక్ SUV Bronco లో కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ లాంచ్‌ చేసింది. దీనికి ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ (Ford Bronco New Energy) అని పేరు పెట్టింది. ఈ SUV రెండు వెర్షన్లలో వస్తుంది (ఒకటి పూర్తిగా ఎలక్ట్రిక్ & మరొకటి పెట్రోల్-చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్). ప్రస్తుతం ఇది చైనాలోనే లభిస్తున్నప్పటికీ, దాని ప్రత్యేక సాంకేతికత కారణంగా ప్రపంచవ్యాప్తంగా EV మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

EV వెర్షన్ ఎలా ఉంది? ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ EV వెర్షన్ డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చింది. ఈ SUVలో ముందు మోటార్ 177 hp పవర్‌ & వెనుక మోటార్ 275 hp పవర్‌ ఇస్తుంది. అంటే, మొత్తం పవర్ 311 hp. దీని గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లు.

ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ SUV... BYDలో కనిపించే 105.4 kWh LFP బ్యాటరీతో పవర్‌ తీసుకుంటుంది. ఈ బ్యాటరీని ఫుల్లుగా ఛార్జ్ చేస్తే 650 కి.మీ. వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ (CLTC సైకిల్ ప్రకారం) ఇస్తుంది. ఈ కారులో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లకు అస్సలు కొదవవేదు. ADAS సిస్టమ్ & LiDAR యూనిట్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను ఫోర్డ్ బ్రోంకో EVలో పొందుపరిచారు.

పెట్రోల్‌తో నడిచే ఎలక్ట్రిక్ SUVపెట్రోల్-చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్, SUV ముందు మోటార్ 177 hp పవర్‌ & వెనుక మోటార్ 24 5hp పవర్‌ ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వెర్షన్‌ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఆసక్తిరకరంగా, ఈ ఇంజిన్‌ వాహనాన్ని నేరుగా నడపదు, బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అంటే, కార్‌ రన్నింగ్‌లో ఉన్నప్పుడే బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది, ప్రత్యేకంగా ఇంట్లో లేదా ఛార్జింగ్‌ స్టేషన్‌లో ఛార్జ్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

పెట్రోల్-చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్‌లో ఇచ్చిన బ్యాటరీ సైజ్‌ 43.7 kWh & ఇది ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 220 కి.మీ. వరకు ప్రయాణించగలదు. దీని పెట్రోల్ & బ్యాటరీ మొత్తం డ్రైవింగ్‌ రేంజ్‌ దాదాపు 1,220 కి.మీ. ఇది లాంగ్ డ్రైవ్‌లకు సూపర్‌గా పనికొస్తుంది. ఈ SUV మొత్తం బరువు 2,510 కి.గ్రా.

ఈ SUV ఎవరి కోసం?ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ SUV ఒక విప్లవాత్మక సాంకేతికత కలిగిన EV. బ్యాటరీ రేంజ్‌ వల్ల టెన్షన్‌ & నిరుత్సాహపడే వారికి ఒక గొప్ప ఆఫర్‌. ఈ బండి బలమైన శక్తి, లాంగ్ రేంజ్ & అధునాతన సాంకేతికత దీనిని మార్కెట్లో EV ట్రెండ్‌సెట్టర్‌గా మార్చగలవు.

భారతదేశంలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?ఈ SUV ని ఫోర్డ్ & జియాంగ్లింగ్ మోటార్స్ భాగస్వామ్యంతో మొదట చైనాలో విడుదల చేశారు. కొంతకాలం తరువాత ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో ఫోర్డ్ SUV అమ్మకం లేదు. కానీ, ఈ కంపెనీ, Everest SUV ని భారత్‌లో తిరిగి లాంచ్‌ చేయాలనుకుంటోంది. Ford Endeavour పేరిట రావచ్చు. ఫోర్డ్, Ford Endeavour లాంచ్‌ను అధికారికంగా ధృవీకరించనప్పటికీ, 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో దానిని తీసుకువచ్చే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ SUV ఒక ప్రీమియం ఆఫర్‌ & టయోటా ఫార్చ్యూనర్‌తో పోటీ పడే అవకాశం ఉంది.

మారుతి సుజుకి కూడా భారతదేశంలో EREV టెక్నాలజీపై పనిచేస్తోంది. రాబోయే కాలంలో, ఈ టెక్నాలజీని బడ్జెట్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్లలో చూసే అవకాశం ఉంది.